వాయస పిండం

#కదన కుతూహలం
వాయస పిండం
*************

శర్మ కాకి కోసం కాకిలా ఎదురు చూస్తున్నాడు.
అతడి చేతిలో వాయసపిండం ఉంది.హైద్రాబాద్ వచ్చిందగ్గరనుంచీ ఆబ్దీకం పెట్టడం కష్టమవుతోంది.

సిటీ లో మడినీళ్ల సమస్య.
భోక్తల సమస్య.
మన వంటలు నచ్చని బ్రాహ్మలు తృప్తిగా తినకపోవడం సమస్య.
ఇప్పుడు వాయస పిండం సమస్య వచ్చింది.
 మిత్రులు వీటిని నిర్వహించే కొన్ని సంస్థ ల గురించి చెప్పేరు.
కానీ వారి పద్ధతులు,వంటలు నచ్చక తను ఇంట్లోనే పెట్టాడు.
అసలు సమస్య వాయస పిండం.
సిటీలో కాకులు కనపడటమే గగనం.

అపార్ట్‌మెంట్ లో  చెట్లున్నా, పిడికెడు మెతుకులు విదిల్చే చేతులు కనపడక కాకులు ఎక్కడికో వలసపోయాయి.
వచ్చినపుడు 'వెధవ కాకి గోల' అంటూ తరిమేసి ఇప్పుడు పిండాలు ముట్టుకోవాలని వెంటపడితే ఎలా!
ఎండ నెత్తి, కాళ్లూ కాల్చేస్తోంది.
అప్పుడు చూసాడు-
రోడ్డు వార మర్రిచెట్టు నీడలో కాకి కొమ్మ మీద వాలి ఉంది.
దానికింద 
పదేళ్ల  కుర్రాడు..
సొమ్మసిల్లి పోయి ఉన్నాడు.
శర్మ మరేమీ ఆలోచించకుండా వాయసపిండం తో పాటు కొంగులో తెచ్చిన మూడు పిండాలు, గారెలూ,అప్పాలు అరిటాకు మీద వదిలి  వెనక్కి తిరిగాడు.

***

Comments