కావమ్మగారు

కావమ్మగారిని మొదటిసారి మా మావయ్య వారింట్లో చూసేను.

అప్పట్లో ఆవిడ వయసు ఏభై పై చిలుకుండొచ్చు.
తెల్ల సైనుపంచ గోచి కట్టుతో మాటిమాటికీ జారిపోతున్న ముసుగు తలపై సవిరించుకుంటూ,చకచకా నడిచేవారావిడ.

ఆవిడకెవరూ లేరు.
పెళ్లిలో చేసిన ప్రమాణాలు గాలికొదిలేసి భర్త
ధనుర్వాతంతో ఆర్నెల్లకే ప్రాణాలొదిలీసేడు
పుట్టింటి వారు అప్పటి కి చేరదీసినా అన్నావదినల ఆగడాలను భరించలేక యిల్లు వదిలేసిందావిడ.
అత్తింటి వాళ్ళ తో బంధం మొగుడితోనే పోయింది.
తెలిసిన వాళ్ళ యిళ్లల్లో అరకొరా పనులు చేస్తూ,వాళ్ళు యిచ్చే తృణం పణం తో గడిపేది.

దయగల మారాజులెవరో లంకంతకొంపలో ఓ
కొట్టుగదిస్తే తలవాల్చుకు పడుకునేది.
అన్ని విధాలా ఆవిణ్ణి అన్యాయం చేసిన భగవంతుడు ఆవిడకు ఒక్క మహోపకారం
మట్టుకు చేసాడు.
నలభీముల్ని మించిన పాకకళావైదుష్యమావిడది.
ఆవిడ వంటల ప్రావీణ్యత ఆవూరివాళ్లు కొద్ది రోజుల
లోనే గ్రహించి ఆవిడని తమ అవసరాలకు పిలిచేవారు.
పుట్టిన రోజు లు.పెళ్లి పనులు, బాలసారలు,తద్దినం
వంటలు యిలా ఎన్నో.
క్రమేపీ యింటి కి చుట్టాలొచ్చినా ఆవిడ సహాయం
ఆశించేవారు.
ఆవిడ లో మరో ప్రత్యేకత ఏమిటంటే-
శుభ్రత.
మిగిలిన వాళ్ళ లా కాకుండా వంట పూర్తి అయ్యాక
వంట చేసిన జాడ కూడ కనిపించకుండా వెంటనే
శుభ్రపరిచే ది.
అదే అందరికీ నచ్చిన విషయం.
డబ్బు విషయం లో కూడా నిక్కచ్చిగా ఉండేది కాదు.
ఎవరేమిస్తే అదే తీసుకుని సంతోషంగా వెళ్ళి పోయేది.
అప్పటికి కొందరు హెచ్చరిస్తే-
"పోన్లే నాయనా! నావెనకెవరున్నారని..దాచుకోవాలన్న తాపత్రయం
నాకు లేదు.
ఏదో యిలా రోజు లు వెళ్ళి పోతే చాలు"
అనేది.
నిజంగా నే ఆవిడ వంటల రుచి చెప్పనలవికాదు.
వంకాయ ముద్ద,గోంగూర పప్పు,కందాబచ్చలి కూర,
వంకాయ మెంతికారం కూర,ముక్కల పులుసు,బంగాళా దుంపల వేపుడు...
పులిహోర, ఒబ్బట్లు,కరకరలాడే బూరెలు,
వేసిన ద్రవ్యాలేవీ కనపడకుండా ఘుమఘుమలాడే
చారు....
వేచిన కందిపప్పు వుడికిస్తే వీధంతా వాసన వ్యాపించేది.
అప్పటికీ ఆడంగులు ఆవిడ వాడే మసాలా దినుసులు గురించి అడిగితే
చిన్న నవ్వు నవ్వి "ఏముందమ్మా కొత్తగా. మీరంతా
వాడేవే"
అని పనిలో నిమగ్నమై పోయేది మరో మాటకు
అవకాశం లేకుండా.

ఆవిడ వంటలలో మరో ప్రత్యేకత ఏమిటంటే
వాటి రుచి ఎప్పుడూ ఒకేలా వుండడం.
వందల వంటల్లో కూడా ఆవిడ వంటని పోల్చెయ్యవచ్చు.
గారెలయితే చిన్నపిల్లల బుగ్గల్లా మృదువుగా
స్పాంజ్ లా మెత్తగా...
పాయసం తియ్యగా, చిక్కగా..
ఫిల్టరు కాఫీ మంచి సువాసనతో, తగుమాత్రం తీపితో మైగ్రెయిన్ తలనొప్పి కూడా ఎగరగొట్టేసేది.
గుండాలవారి వీధి లో వుండే నేను ఆవిడ ఫేన్
అయిపోయాను.
మాయింట ప్రతి వేడుకలో ఆవిడ వంటలే.
ఆవిడవస్తుందంటే ఆయింటి ఆడవారికి కూడా
యమసుఖం.
పొద్దున్నే పంపులు వచ్చే వేళకి వచ్చేసి,మడిగా
వంటకి నీళ్లు స్వయం గా పట్టుకునేది.
ఎవరి సహాయం ఆశించకుండా వొక్కతే కూరలు
తరుక్కునేది.
మొత్తం వంటంతా అయ్యాక వంటగదిలో వంట జరిగిన ఆనవాలు లేకుండా శుభ్రం చేసి వెళ్ళే ది.
అవేళ పని మీద బొంకుల్దిబ్బ దాటి లక్కపందిరి
వీధి లోకి తిరుగుతూ నే కావమ్మ గారి ని చూసి
"దొడ్డమ్మా ఎలా వున్నావు" అనడిగేను.
నువ్వు ఎప్పుడు వచ్చేవయ్యా హైదరాబాదు నుంచి అనడిగిందావిడ.
ఇక్కడోవిషయం చెప్పాలి.
ఆవిడని చిన్నప్పటి నుంచి ఎరిగిన నేను, స్వతహాగా భోజనప్రియుణ్ణి కావడము చేత ఆవిడతో చాలా చనువుగా వుండేవాణ్ణి.
అవికూడా నాతో కష్టసుఖాలు కలబోసుకునేది.
అప్పుడప్పుడు ఆవిడతో ఆవిడ గది కివెళ్లి ,
ఆవిడ యిచ్చే దిబ్బరొట్టి పెచ్చులు,ఫిల్టర్ కాఫీలో
ముంచుకు తినడం నా అలవాటు గా మారిపోయింది.
దిబ్బరొట్టి పెచ్చులావిడ విలక్షణంగా చేసేది.
ఎర్రగా రొట్టె కాలేక ఆపెచ్చంతా విడిగా డబ్బాలో
పెట్టేది.
మళ్లీ నూనె పోసి కాల్చే సరికి మరోకొత్త పెచ్చు
తయారయేది.
ఇలాపెచ్చులన్నీ విడిగా కాఫీలో తినడం నాకు
చాలా యిష్టం.
ఆవిడతో గదిలో అడుగు పెట్టిన నాకు ఆవిడ ఏదో
సమస్యతో సతమత మవుతున్నట్లు అనుమానం
కలిగి-
ఏమైంది దొడ్డమ్మా అనడిగేను.
ఆవిడ మాట్లాడకుండా అరలోంచి డబ్బా తీసి అందులో వున్న రొట్టె పెచ్చులు ఒక ప్లేట్ లో
పెట్టి,కాఫీ కప్పు చేతికందించి--"ముందివి తిను"
అని చెప్పనారంభించింది.
దయగల మారాజుల నిర్దయ వారసులు ఎవడో
బిల్డర్కి యిల్లప్పజెప్పి ఫ్లాట్సుగా మార్పించాలని
అనుకుని ఆవిణ్ణి గది ఖాళీ చెయ్యమని చెప్పేసేరట.
నేను వెంటనే లేచి -"బలే దొడ్డమ్మా నువ్వసలు నాతో
హైదరాబాద్ వచ్చీ కూడదూ.నాకాహొటల్ తిండి పడటం లేదు కూడా " అన్నాను.
దానికావిడ-" లేదు నాయనా,మొన్ననే అవధాని గారు చెప్పేరు.అదేదో మఠం లో వేద పాఠశాల పెట్టేరట.అక్కడ పదిమంది పిల్లలు, వాళ్ళ కు
వేదం నేర్పే యిద్దరు గురువు గార్లు వున్నారట.
వాళ్ల కు రెండు పూటలా వండి పెట్టడానికి
ఏబాదరబందీ లేని,నాగా పెట్టని వంట మనిషి
కావాలన్నారట.వుండేందుకు అక్కడే బస కూడా
ఏర్పాటు చేసి,నెలకి పదివేలిస్తారట.
అక్కడికి వెళ్దామని నిశ్చయించుకున్నాను."
"ఎక్కడున్నా దా మఠం?""
" మీ హైదరాబాదు లోనే ఎక్కడో"
"సరే అయితే నేను కూడా అప్పుడప్పుడు వస్తుండొచ్చునిన్ను చూడటానికి"
తప్పకుండా అందావిడ.

ఇదంతా జరిగి ఏడేళ్ల యింది.
ఈ మధ్యలో ఒకటి రెండు సార్లు ఆవిణ్ణి మఠం లో
కలిసేను.
ఆవిడలో ఎటువంటి మార్పు లేదు.
అందరు అక్కడావిణ్ణి గౌరవించేవారే.
తర్వాత కాలంలో నేను నా పెళ్ళి, పిల్లలు వాళ్ళ బాధ్యతలు ,మధ్య  కావమ్మ గారిని కలియలేదు.
మళ్ళీ యివాళ ఆవిడ గుర్తు కి రాగానే మఠం వేపు
దారి తీసాను.
కానీ నా అడుగులు ఎందుకో తడబడుతున్నాయి.
గుండె గబగబా కొట్టుకోవడం మొదలైంది.
దొడ్డమ్మ ఆరోగ్యంగా వుంటుందా?
నాకే కబురు తెలియలేదు కాబట్టి బావుందనే
అనుకోవాలి.
ఏడుకొండల వాడా ఆవిణ్ణి చల్లగా చూడు.
గంగాధరా ఆవిడకే ఆపదా రాకూడదు
మఠం లో అడుగు పెట్టేను.
నేనింక రాయలేను.
నాకళ్లు నీటి పొర కారణంగా మసగ్గా వున్నాయి.
పాము పక్క మీద హాయిగా నిద్ర పోయే శ్రీ మన్నారాయణమూర్తి ఆవిణ్ణి పైలోకాలకి పోకుండా
ఆపలేకపోయాడు.
వెండికొండ వేలపు ఆమెను లయం చేసుకున్నాడు.
జీవితం లో వర్షాలే తప్ప వసంతాలెరగని ఆజీవి
పరమపదాన్ని చేరింది.
మఠం ద్వారా తెలిసిన విషయం-
ఆవిడ నెల జీతమంతా మఠానికే దానమిచ్చిందట.
సమయానికి రాక,వచ్చినా..ముగ్గురు సహాయకులతో సామానంతా దుబారా చేసి, వంటిల్లంతా చెడుగుడాడి ,డబ్బులు దగ్గర పేచీ పెట్టే
మనుషులెదురైనప్పుడల్లా కావమ్మ గారు నాకు
గుర్తు వస్తుంటారు.

Comments