#గొలుసేది?
కాస్త పాతకాలం:
శేషు కాలేజ్ నించీ ఇంట్లొకి వచ్చేసరికి, తల్లి సునంద, పిన్ని జానకితో మాటాడుతూ కనిపించింది.
“నువ్వెప్పుడు వచ్చేవమ్మా?” మొహం విప్పారుతుంటే అడిగేడు.
“ఇందాకేరా… బాగా చదువుతున్నావా?” ఆప్యాయంగా అడిగింది సునంద. బుర్ర ఊపేడు శేషు. తల్లి మెడ మీద దృష్టి పడింది.
మెళ్ళో పసుపుతాడు, నల్లపూసలు.
శేషుకి గుండె ఆగినంత పనయింది.
తల్లికి ఉన్న ఏకైక నగ ఒక కొబ్బరితాడు గొలుసు. దానికే
మంగళ సూత్రాలు వేసుకుంటుంది.
అలాటిది పసుపు తాడుతో ఉన్నాది అంటే… ఒకవేళ గొలుసు దేనికో తాకట్టు పెట్టేసిందేమో. ఇంకెందుకు?
తన ఫీజులు కట్టిందికో? పుస్తకాలకో?
“శేషూ… మొహం కడుక్కొని రారా… మీ అమ్మ జంతికలు, రవ్వలడ్డూలు తెచ్చింది. తిందూగానీ…” జానకి మాట విని పెరట్లోకి దారితీసేడు శేషు.
సునందా, శర్మలకి ఆరుగురు పిల్లలు.
పెద్దవాడు శేషు. తమ పల్లెటూరులో, వాడికి చదువు సాగదని, పట్నంలో ఉన్న చెల్లి దగ్గర శేషుని చదువుకి పెట్టింది సునంద. శేషు ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నాడు. జానకి కొడుకు సాగర్ ఒక ఏడాది చిన్నవాడు. ఇద్దరికీ చాలా స్నేహం.
ఫ్రెష్ అయి వచ్చి తల్లి తెచ్చిన జంతికలు కరకరలాడిస్తున్నా, శేషు బుర్రంతా తల్లి బంగారు గొలుసు మీదే ఉంది. తల్లిని అడిగే ధైర్యం లేదు. పిల్లలు పెద్దల విషయాల్లోకి వస్తే తల్లితండ్రులు ఇద్దరూ ఒప్పుకోరు.
తండ్రిది చిన్న ఉద్యోగం. అంతంతపాటి సంసారం. తల్లి గుట్టుగా సంసారం నెట్టుకొస్తోంది. తన తరవాత ముగ్గురు ఆడపిల్లలు. ఆఖరున ఇద్దరు తమ్ముళ్ళు. ఆడపిల్లలకి చెవులకి పావుతులమేసి రింగులు తప్ప తండ్రి కొన్న బంగారం ఏమీలేదు.
తల్లి మెళ్ళో గొలుసు కూడా ఆమె పుట్టింటి వాళ్ళు పెట్టిందే. మూడు తులాల కొబ్బరితాడు పచ్చగా మెరుస్తూ తల్లి మెళ్ళో ఉండేది.
పాపం తన మీద తల్లితండ్రులు ఇద్దరూ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో.
“మా శేషు చదువు అయి ఉద్యోగస్తుడు అయితే నాకు ఏ బెంగా లేదు…” అని తల్లి అనడం తెలుసు.
పిన్ని ఏమడిగిందో గానీ తల్లి ఆమెతో, “ఈ గొలుసు లేకపోతే ఏమయిందే? శేషు చదువు సాగి వాడు ఉద్యోగస్తుడయితే నాకు అదే వడ్డాణం పెట్టుకున్నంత…”అనడం విన్నాడు.
ఇంతలా తల్లి తనమీద ఆశలు పెట్టుకొని ఉన్న ఆ ఒక్క గొలుసూ
అమ్మి తనని చదివిస్తుంటే తను చేస్తున్న ఘనకార్యాం ఏవిటి?
చదువుమీద కన్నా సాగర్ తో తిరుగుళ్ళ మీదే శ్రద్ధ ఎక్కువ. వాడు ఖర్చంతా పెడుతుంటే సినిమాలు, షికార్లూ తిరుగుతున్నాడు. మొన్న ఆర్నెల్ల పరీక్షల్లో ఎన్నో సబ్జెక్టలలో తక్కువ మార్కులు వచ్చేయి. శేషు కళ్ళనీళ్ళతో దిండు తడిపేడు.
ఏదయినా ఫస్ట్ క్లాసులో పాసవాలని శపథం చేసుకున్నాడు.
ఆ తరవాత శేషు చదువు నిర్లక్ష్యం చేయలేదు. తదేకంగా చదివి ఫస్ట్ క్లాసులో పాసయేడు. స్కాలర్ షిప్ తెచ్చుకొని ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసేడు. మంచి ఉద్యోగం సంపాదించి తల్లి కళ్ళనీళ్ళు తుడిచేడు.
మొదట తల్లి మెళ్ళోకి పుస్తెలతాడు చేయించేడు. తరవాత చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి సాయం చేసేడు. తల్లి చూసిన అమ్మాయినే పెళ్ళి చేసుకున్నాడు. “పిల్లడంటే వాళ్ళ శేషే… వాడిని చూసి నేర్చుకోండర్రా”
అని మిగిలిన తల్లితండ్రులు, తమ పిల్లలకి చెప్పేలా నడచుకున్నాడు.
ఏ తల్లి మెడలో నగ మాయం అయినా, శేషగిరి మనసు కలుక్కుమంటూనే ఉంటుంది.
తల్లితండ్రుల కష్టాలు చూసి బతుకు విలువ తెలుసుకోవాలని అందరికీ చెప్తూనే ఉంటాడు.
*****************************
( మన భాగవతుల కృష్ణారావు గారి
‘అమ్మనగలు’ కవిత చదివేసరికి నాకు ఎన్నో ఆనాటి విషయాలు తలపుకి వచ్చేయి. ఆ రోజుల్లో ఎందరో అమ్మలు తమ వంటిమీద బంగారం అమ్మి పిల్లలని చదివించేరు. ఆ గురుతులతో ఈ కథ రాసేను)
Comments
Post a Comment