గొలుసు కధ-4

జరిగిన కధ
అమాయక శాస్త్రి తల్లిదండ్రులు గతించాక
చెడు సావాసాల దారి పట్టక ,స్నేహితుల చెడు
ప్రభావాలను తప్పించుకుని, మానేజర్ సహాయం తో తండ్రి వ్యాపార వ్యవహారాల ఆఫీసు లోకి
అడుగు పెడ్తాడు.
అక్కడ అతనికి రాధిక అసిస్టెంట్ మానేజర్ రూపంలో ప్రత్యక్షమై చేదోడు వాదోడుగా నిలిచి
అతని కి తగిన తర్ఫీదు యిస్తూ అతని ప్రేమలో
పడుతుంది.
శాస్త్రి కూడ ఆమెను యిష్టపడతాడు
అమాయక శాస్త్రి నించి నిశ్చలశాస్త్రి గా పరిణతి
పొందిన అతన్లో కొత్త కొత్త ఆలోచనలు ప్రవేశించి
రాధికను దూరం చేసుకుంటాడు.
ఇహ నాలుగో భాగం చదవండి.

రాధిక కు ముందు అతనేమన్నాడో అర్దం కాలేదు.
అర్ధమయ్యేసరికి అతనక్కడ లేడు.
రాధిక బరువుగా సీటు లోంచి లేచి హేండ్ బేగ్
తీసుకుని బయటకు నడిచింది.
అడుగులు భారంగా పడుతున్నాయి.
బయటకు రాగానే కనపడ్డ ఆటో ఆపి అందులో
నిస్సత్తువ గా కలపబడింది.
అంతవరకు వుగ్గబట్టిన దుఃఖం శ్రావణ మేఘల్లా
ఆమె కళ్లద్వారా బయటపడింది.

ఎందుకి శిక్ష తనకి?
ఎవరికీ ఎటువంటి హాని తెలిసి తను చేయలేదే
ఏ దేవుడు తనకి ప్రతి కూలంగా వున్నాడు?
ఏపాపాలు తనని యింకావెంటాడుతునాయి?
చిన్నతనం నుంచి తను,తల్లి పడ్డ కష్టాలు,బాధ్యతలు అన్నీ కళ్లముందు గిర్రున తిరిగాయి.
చదువు పూర్తయిన వెంటనే తండ్రి లాంటి మానేజర్
గారి దయతో యిక్కడ వుద్యోగంలో చేరడం,శక్తి వంచనలేకుండా పని చేస్తూ యీ స్థాయికి ఎదగడం
శాస్త్రి తో పరిచయం, అతని అమాయకత్వం,
అతనికి అన్ని రకాలుగా తర్ఫీదు యివ్వడం,
తమ మధ్య అంకురించిన ప్రేమ...
రుమాల్తో కళ్ళు, మొహం శుభ్రం చేసుకుని
వెనక్కి చేరబడి ఏంచెయ్యాలో ఒక్క క్షణం లో
ఆలోచించుకుని మానేజర్ గారింటికి ఆటోలో చేరింది.
గంట సేపు గడిచాక అక్కణ్ణుంచి యింటి కి బయలుదేరింది.
ఇప్పుడు రాధిక మనసులో ఎటువంటి గందరగోళం
లేదు
మానేజర్ గారితో మాట్లాడే క ఆమె మనసు చాలా
తేలిక పడింది.
ఇంటికి వచ్చాక అమ్మ చేతి ఫిల్టర్ కాఫీ తాగి,
అయాన్ రేండ్ రాసిన అట్లాస్ ష్రగ్డ్ మంచం మీద
వాలి చదవడం మొదలు పెట్టింది.
@@@@@@@@@@@@@@@@@
నెల రోజులు గడిచాయి.
శాస్త్రి కి ఆరోజంతా చాలా చికాకు గా వుంది.
ఆమాటకొస్తే గత ఇరవై తొమ్మిది రోజులు అతనికి
దుర్భరంగానే గడిచాయి.
అతనికేమీఅర్ధం కావడం లేదు.కొత్త గా రాధిక జాగా
లో వచ్చిన వనజ అర్ధం కాని ప్రహేళికలా తయారయింది.
అతని చేతిలో స్టీరింగ్ అలవాటు ప్రకారం తిరుగు
తున్నా ఆలోచన ల అంతకన్నా వేగంగా తిరుగుతూ
అతన్ని అశాంతికి గురి చేస్తున్నాయి.
వనజ పని బాగా చేస్తుంది కాని అమెకి అతి చనువు ఎక్కువ.
తనకి అతి చనువు ఎంబరాసింగ్గా వుంటుంది.
తనేది గట్టిగా చెప్పలేడు.
దానికి తోడు ఆమె వేషభాషలు...
అసలీ మెని మానేజర్ గారెలా సెలెక్ట్ చేసేరో
అవాళ తను రాధిక ను తప్పించాలనుకున్నప్పుడే
మానేజర్ తో సంప్రదించగానే
"సరే బాబు రేపు కొత్త అమ్మాయి వనజని నీ
దగ్గరకే పంపు తాను." అన్నారు.
అసలా అమ్మాయిని ఎలా డీల్ చెయ్యాలో అర్దం
కాలేదుతనకి.
రాధిక తప్ప వేరే అమ్మాయి తనకి పరిచయమే
లేదు.
రాధిక ప్రశాంతకాసారమైతే వనజ వడిగా ప్రవహించే సెలయేరు
రాధిక తొణకని నిండు కుండ అయితే
వనజ గలగల లాడే ఓటి కుండ
ఆహార్యం లో కూడా ఇద్దరి లో హస్తిమశకాంతర తేడాలు ఉన్నాయి.
వద్దనుకున్నా రాధికతో ఆమెను పోల్చుకోకుండా
వుండలేకపోతున్నాడు తను.
మొదటిసారి తన ఆలోచన తప్పేమొ అనిపించింది
తనలో యీ పురుషాహంకారం ఎప్పుడు తలెత్తింది?
అసలు రాధిక తనతో ఎప్పుడూ ఎగతాళి గా ప్రవర్తించలేదు.
మరి తనకు ఆమె పట్ల ఆసక్తి లేదా అంటే అదీనిజంకాదు.
మరి?
త్రిమూర్తులు కూడా ఆదిశక్తి ప్రమేయం లేనిదీ కదల లేరని అంటారు
ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ తప్పనిసరి అని కూడా
అంటారు.
శంకరాచార్యులు-"శివశక్త్యాయుక్తో...శ్లోకం లో కూడా
ఇదే సెలవిచ్చారు.
మరి తనకెందుకీ పురుషాధిక్యాహంకారం?
తెలివితేటలు పెరిగి మేల్ఇగో వచ్చింది గానీ
మనుషుల్ని చదివి పోల్చుకునే శక్తి మాత్రం
రాలేదు.
రాళ్లు, రత్నాలు వేరు చేసే ప్రజ్ఞ మాత్రం అలవడలేదు.
తన తప్పుని యిప్పటికయినా సరిదిద్దుకోవాలి.
కారు రేడియో లో-నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీకోసమే కన్నీరు....ఘంటసాల గొంతు ఖంగుమంటోంది.
కారు రాధిక యింటి వేపు పోనిచ్చాడు.
రాధిక తనని చూసి ఏమంటుందో?
అసలు మాటాడుతుందా?
కారాగింది.
కిటికీ లోంచి బయటికి చూసేడు.
ఎదురుగా మానేజర్ గారు,రాధిక, ఆమె తల్లి కనిపించేరు. 

సశేషం

Comments