స(శ)హ జీవనం

స(శ)హ జీవనం
September 09, 2018

"సుక్కా! ఓ లమ్మి సుక్కా"
తండ్రి అరుపు విని,కొద్ది దూరంలో కుందేలు పిల్లలా గంతులేస్తూ,తనలోతనే ఆడుకుంటున్న పదేళ్ల చుక్క పరిగెత్తి తండ్రి దగ్గరకు వచ్చి-
"ఏట్రయ్య" అంది.
"బేగి పత్తల్లీ. ఎల్లాల" అన్నాడునారిగాడు.
చుక్కకి అర్థమయింది.
గబగబా తను చేయాల్సిన పనులు చేయసాగింది.
నారిగాడు మున్సిపాలిటీ వారందజేసిన అనాధ శవాలకు దహనసంస్కారాలు చేస్తాడు.
వారిచ్చిన డబ్బులతో తండ్రి, కూతురు బతుకు వెళ్లదీస్తారు.
నారిగాడనబడే నారాయణ ఏడేళ్ల వయసులోనే తల్లి ,తండ్రి ని పోగొట్టుకుని అనాథ గా మిగిలిపోతే,అతడి మేనమామ
చేరదీసి సాకేడు.
కూతుర్ని కని భార్య కన్నుమూస్తే నారిగాడితో పాటు ఆమెనీ ముద్దుగా నే చూసుకుని మురిసిపోయేవాడు.
అయితే కూతురికి పధ్నాలుగేళ్ల వయసపుడు
పాము కాటుకు గురై మరణించాడు.
అప్పటినుండి నారిగాడు ఆపిల్లకి అన్నీ తానై
బాసటగా నిలబడ్డాడు.
ఆస్తి లేదు...గుడిశ తప్ప నాది అన్నది మరేదిలేని ఆపేద జంట చాలా కష్టాలు పడ్డారు.
పెద్దయ్యాక తనే ఆమెని పెళ్ళి చేసుకున్నాడు.
పంటకూలీ..తాపీపని,యితరకూలీపన్లన్ని చేసేవాడు.ఏడాది గడిచేసరికి చుక్క కడుపులో పడింది.
చుక్క చక్కగా చక్కనిచుక్కలాగే వుంటుంది.
అందుకే చుక్క అనిపేరు పెట్టారు.
పిల్లకి ఏడాది నిండేక నారిగాడి భార్య కూడా తనచేతనైన కూలిపనులు చేసేది.
వాళ్లిద్దరికి చుక్కంటే ప్రాణం.
వీలయినంతలో దాన్ని అల్లారు ముద్దు గా పెంచాలనే వాళ్ల తాపత్రయం.
అయితే పయినున్న వాడు మళ్ళీ వీళ్లని చిన్నచూపు చూసేడు.
నోరు తిరగని జబ్బొచ్చి నారిగాడి భార్య కన్నుమూసింది.
అంతే నారిగాడి ప్రపంచం తలకిందులు అయింది.
తనతోపాటు యిన్నాళ్లు సహజీవనం సాగించిన ఏకైక సహచరి దూరమవడం తట్టుకోలేక పోయాడు.
పైగా పసిదాని భారమొకటి.
ఒక్కతినీ వదిలి ఏ పని చేయాలనుకున్నా కుదరదు.
కంటికి కనపడని భగవంతుడి మీద పట్టరాని కోపం వచ్చింది.
తన భార్య జబ్బు పడినప్పుడు
పూరి జగన్నాధుని..
శ్రికాకుళం సూర్యనారాయణ మూర్తిని..
సింహాద్రి అప్పన్న ని..
అన్నవరం సత్యనారాయణ స్వామిని..
బెజవాడ కనకదుర్గమ్మ ని..
చివరాకరికి ఏడుకొండల వెంకన్నని
పరిపరి విధాల వేడుకున్నాడు.. ప్రాధేయపడ్డాడు.
అయినా ఏ దేవుడు, దేవతా కనికరించలేదు.
డబ్బున్నమారాజుల్నే తప్ప బీదాబిక్కి కంటికి ఆనరని నిరూపించాడు.
సిన్నప్పుడే అమ్మ,అయ్య నాకాక్కుండా సేసీసినావు.
పోనీ మావకాడేనా వుందామంటే అరిజెంటుగా పావుసేత సంపించ్చీసేవు.
సిన్నగుంటని నాకంటించీ సి తమాసజేసేవు.
దరిద్దరంలో బతకమని శాపాకారాలెట్టీసి,నీ మట్టుకు నువ్వు పామ్మీద సల్లంగ లచ్చిందేవమ్మోర్ని పక్కన కూకుండ బెట్టుకుని
తొంగుడడిపోనావు.
నానేటిజెయ్యాల?
నాకెవుడు దిక్కు?
యీ గుంటేగనక నేకపోతే నాను కూడా ఏ
నుయ్యోగొయ్యొ సూసుకునీవోణ్ణి.
రా..ఒక్కపాలి కిందికొచ్చి దిగి సూడు..నాను,నా అసుమంటోళ్లు ఎన్ని కవుకులు పడ్తన్నవో,..
ఇలా ఎన్నిసార్లో దేవుడికి మొర బెట్టుకున్నాడొ
లెక్కాజెమా లేదు.
నిజంగా దేవుడు దిగొస్తే ఒక్క గుద్దు గుద్దేయగలిగినవాడిలా తయారయ్యాడు.
అలాంటి సమయంలోనే పట్నంలో మున్సిపాలిటీ లో పన్జేస్తున్న నారిగాడి దూరపు బంధువు దేవుడి రూపంలో వొచ్చి
నారిగాడ్ని పిల్లతో సహా పట్నం తీసుకుపోయి
దగ్గరుంచుకుని అనాధ శవాలని తగలెట్టే పన్లో ప్రవేశ పెట్టేడు.
అయితే ఈ పన్లో నారిగాడి కి మందలవాటయింది.
అయితే చుక్కని మాత్రం కంటికి రెప్పలాగే
చూసుకునే వాడు.
తనతో పాటే తిప్పుకునేవాడు.
ఆపిల్ల కూడా తండ్రి ని వదలకుండా తిరిగేది.
శవాలు,శ్మశానాలు ఆపిల్లని భయ పెట్డలేకపోయాయి.
అక్కడే సమాధుల మధ్య ఆడుకుంటూ ,తండ్రి కి అవసరమైన పనులు చేస్తూ వుండేది.
వున్నంతలో నారిగాడు కూడా పిల్లకి దేనికీ లోటు లేకుండా చూసుకునే వాడు.
పనంతా అయ్యాక లెక్కగా తాగి,యింటికి వచ్చి పిల్ల కి అన్నంపెట్టి తను తినేవాడు.
ఆ తర్వాత పడిన కష్టానికి సులువుగానే నిద్ర
పట్టడం తో హాయిగా నిద్రపోయేవాడు.
"రయ్యొరయ్య! పద"
చుక్క గొంతు విని గతం లోంచి వర్తమానంలో
అడుగు పెట్టాడు.
తోపుడు బండిలో నిన్న బస్టాండ్ దగ్గర చనిపోయిన వృధ్దురాలి శవం వుంది.
శవ పరీక్షలు, పంచాయతి అయ్యే క అనాధగా నిర్ణయించి శవాన్ని దహనం చెయ్యమని నారిగాణ్ణి ఆదేశించారు.
దాని ఫలితమే ప్రస్తుతం తండ్రి కూతుళ్ళ
ప్రయాణం.
మార్గశిర మాసం చలి.
పొద్దున్నే మొదలయిన ముసురు మొండి
చుట్టం లా వదలడం లేదు.
చాలీచాలని బట్టలు చలినాపలేకపోతున్నాయి.
చుక్క చలికి వణుకుతోంది.
అప్పటికే చీకటి నల్ల పరదాలు పరుచుకుంటున్నాయి.
డబ్బున్న మారాజుల పిల్లలు హాయిగా స్వెట్టర్లు,వూలుకోట్లు వేసుకుని నీ సలి నన్నేటి
సేస్తది అని లెక్కలేకండా తిరుగుతునారు.
గౌను చేతుల్తొ కిందకి లాక్కుంటు-
"స..సలె..సలేస్తందరొరయ్య"
చుక్క మాటలు విని నారిగాడు-
"పోని బండిల కూకుంటావా"
అన్నాడు.
అలాగే అన్చెప్పి ,బండిలో దూరి,శవం పక్కన
సర్దుకుని కూర్చుంది.
అయినా దిక్కుమాలిన చలి వణికించేస్తోంది
పాపం ..
పళ్ళు టకడక కొట్టేసుకుంటున్నయి.
కాస్సేపాగి మరి కూర్చోలేక ఆపసిది..ఆపువ్వులాంటి పిల్ల గబుక్కున
శవం మీద పరిచిన సైను బట్ట తీసి నిండుగా
కప్పేసుకుని అంతటి తో ఆగక పక్కనే పడుక్కోపెట్టబడ్డ నిర్జీవ కళేబరాన్ని గట్టిగా
కావిలించుకుంది.
కూతురి సందడి వినపడక పోవటం తో
వెనక్కి తిరిగి చూసిన నారిగాడి గుండె
చెరువైంది.
అనాధ రక్షకా యింకా ఎన్ని కష్టాల సముద్రాలు చూపిస్తావ్?
ఆపద్బాంధవా నా చిట్టి తల్లిని అసలెందుకు
పుట్టించేవు?
నా రు పోసేవాడు నీరు పోస్తాడంటారు..
మరి మా కాలిపోతున్న బతుకుల్ని ఏ గంగాజలం తో ఆర్పుతావ్?
మాలాటి అసహాయులితో ఆడుకోవడం నీ
లీలైతే అటువంటి లీలలు ఏ ప్రయోజనం ఆశించి చేస్తున్నావు?
ఇలా ఎన్నో జవాబు తెలియని ప్రశ్నలు
ఆదేవదేవుణ్ణి..కరుణా సింధువుని..సర్వవ్యాపి ని అడగాలనుంది.
అతని కళ్లలో కారేది నీరు కాదు..దేవుడు కూడ వెలకట్టలేని రుధిరాశ్రువులు..
అప్పుడు ..
ఎదురుగా వస్తున్న వ్యక్తి వీళ్ళ ని చూసేడు.
అతనికి నలభై అయిదేళ్ళ వయసుంటుంది.
అతనడిగిన వాటికి నారిగాడు జవాబులు తెలిసినంత వరకూ చెప్పాడు.
మిగిలిన విషయాలు అతను మున్సిపాలిటీ లో తెలుసుకున్నాడు.
వారం రోజుల తరువాత నారిగాడి జీవితం
పూర్తిగా మారిపోయింది.
చుక్క గవర్నమెంట్ స్కూల్ లో జాయినయింది.
నారిగాడు ఆ వ్యక్తి నడిపే సహాయ సంస్థ లో
పనికి కుదిరాడు.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు..
ఢిల్లీ లో గూంజ్ అనే ఎన్జీవో స్ధాపించి వేలాది సహాయక చర్యలు చేపట్టి,మెగససే అవార్డు
అందుకున్న అంశ్ గుప్తా.
"అవేళ ..ఆ చలిలో.. నీ కూతుర్ని అలాశవంతో..చూసి నా గుండె ద్రవించింది.
ఆ దృశ్యం నే నెప్పటికీ మరిచిపోలేను"
అంటాడాయన .

Comments