స్నేహం

ఛాంబర్ లోంచి బయటకు నడుచుకుంటూ నా సీటు వేపు నడుస్తున్నానన్న మాటే గాని నా మనసు మనసులో లేదు.
ఆలమూరు భాను..
ఆపేరు తో నా జ్ఞాపకాలు ఏభై ఏళ్ళు గా పెనవేసుకుని..
అప్పుడు నేను ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లోవున్న సోంపేట జిల్లా పరిషత్ స్కూల్లో సెకండ్ పారం చదువుతున్న రోజులు...
టౌన్ హాల్ వీధిలో మా యింటి కి మూడిళ్లవతలే భాను వాళ్ల యిల్లు.
వాళ్ల నాన్న గారేదో బేంకులో పని.
భానుకో చెల్లి.
మాయిద్దరి వీధి స్నేహం స్కూల్ లో కూడా వొకే సెక్షన్ లో కలిసి వుండడంతో గట్టి పడింది.
రోజూ సాయంత్రం స్కూల్ అవగానే చీకటి పడేదాకా వాళ్లింటి ముందున్న వాకిట్లో రకరకాల ఆటలు ఆడేవాళ్లం.
వాళ్లమ్మ సీతాదేవి గారు దీపాలు వెలిగించి "బాబూ" అని పిలవగానే ఆటాపేసి యిళ్లకు వెళ్ళి పోయేవాళ్లం.
అప్పుడే మాకు ఫిలాటలీ(తపాలా బిళ్ళల సేకరణ) అలవాటు అయింది.
ఉత్తరాల పై నీరు పోసి చిరక్కుండా జాగర్తగా తీయడం, భధ్రంగా దాచడం..
మధ్య మధ్యలో ఎవరి సేకరణ ఎలావుందో చూసుకోవడం..
అప్పట్లొ మా తరగతి టీచర్ సర్వేశ్వర రావని ఒకాయన వుండేవారు.
అతనికి ట్యూషన్ పిచ్చి.
పిల్లలంతా తన దగ్గర ప్రైవేటు చదవాలనే వాడు.
డబ్బులు వున్నవాళ్ళు చదివేవారు.
మా వాళ్ళు బెంగాల్ లో పనిచేస్తూ యిక్కడ మా అమ్మమ్మ సంరక్షణ లో మమ్మల్ని అంటె
నెను,మా మేనమామ,దొడ్డమ్మ పిల్లలం చదువు కు పెట్టడం తో యీ ప్రయివేటు ప్రాణాంతక మయేది.
అందువల్ల ఆయనకు నామీద గుర్రు గా వుండేది.
అయితే భాను ప్రైవేటు చదవడమేకాక మేష్టారి ప్రియ శిష్యుడు కావడం వల్ల నేను
కొన్నిసార్లు కాపాడ బడ్డాను ఆయన ప్రకోపం నుండి.
ఒకసార సెలవల తరువాత  యిచ్చిన హోంవర్కు- రిప్ వెన్ వింకిల్ ద మేన్ హు స్లెప్ట్ ఫర్ ట్వంటీ యియర్స్ కధని ఇరవై సార్లు రాయమంటే నేనా పని ఎగ్గొట్టి భాను శరణు వేడేను.
ఆరోజు రాయని వారందర్నీ చావచితక్కొట్డిన మేస్టర్ బారినుండి భానే నన్ను రక్షించేడు.
అదిగో..అప్పుడే..
వాడికి,నాకు బెడిసింది.
కారణం..ఆల్బర్ట్ ఐన్‌స్టీన్..
నేను సెలవుల్లో మా వూరు వెళ్ళి నప్పుడు
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తపాలా బిళ్ళను సంపాదించేను.
అతడి గొప్పతనం ఎవరిద్వారానో తెలుసుకున్నాను.
అంతే..
మా పీరియాడికల్  సమావేశం లో ఆ స్టాంపుని చూపించి నాకు తెలిసినదంతా బొళబొళా వాగీసేను నంబినాయనమ్మలా.
సరి..
భాను గాడి చిన్న కళ్లు యింకా చిన్నవయ్యాయి.
తీక్షణంగా ఐన్ స్టీన్ వంక చూసేడు.
..మళ్లీ నా వేపు చూసేడు గాని ఆచూపులో
కొద్దిగా తేడా కనిపించింది.
సెలయేటి నీటిలా చల్లటి చూపు కాదది.
బడబాగ్ని తో కుతకుత వుడికే నీటి కత్తుల చూపది.
నా కెందుకో కొద్దిగా భయం వేసింది.
నా ఐన్ స్టీన్ ని చొక్కా జేబులో గబుక్కుని
దోపేసి "వస్తాన్రా! భానూ!"
అంటూ వెనక్కి తిరిగి రెండడుగులు వేసేను.
"
ఆగు"
భాను గొంతు విని నెమ్మదిగా వెనక్కి చూసేను.
"కృష్ణా" నాకా స్టాంప్ కావాల్రా"
పేల్చేడు బాంబు.
నేను యిబ్బందిగా మొహం పెట్టాను.
కానీ వాడదేం లెక్క చెయ్యలేదు.
"ఒరే.నీకెన్ని హెల్పులు చెయ్యలేదు రా!
అవాళ నేనడ్డుకోపోతే సర్వి మేష్ట్రు నీ తాట
తీసిద్దుడు"
నేను కళ్లనీళ్ల పర్యంతమవుతు యేదొ చెప్పబోతుంటే-
నన్నాపి -"చూడు కృష్ణా! మరి మాటాడకు.నాతో ఫ్రెండ్‌షిప్ కావాలంటే నాకా స్టాంప్ యివ్వాల్సిందే"
నాకర్దమైంది.
మారుమాటాడకుండా జేబులో వున్న స్టాంప్ తీసి వాడి చేతిలో పెట్టాను.
ఆ తర్వాత కొన్నాళ్లకే వాళ్ల నాన్న గారికి
బదిలీ అవడంతో వాళ్ళు ఎక్కడికో వెళ్లిపోయారు.
ఆ తర్వాత మళ్లీ యిన్నాళ్లకి యిక్కడ బెంగాల్ లొ రైల్వే లొ నాకు పై అధికారిగా వాడ్ని చూసి గుర్తు పట్టేను.
మనిషి ఎక్కువ మారలేదు‌
కొద్దిగా లావయ్యాడు.
నాతో బాగా మాట్లాడేడు.
ఫామిలీ ని యింకా తేలేదన్నాడు.
నాలాగే కొడుకు, కూతురుట.
కొడుకు బెంగుళూరు లో ఏదో కంపెనీ లొ పెద్ద ఆఫీసరట.
కూతురు ఫారిన్ సంబంధం..
నా వివరాలు విన్నాకే వాడి వివరాలు చెప్పేడు

వాడి ఛాంబర్ లోంచి బయటకు వచ్చినా నా అలోచనలన్నీ వాడన్న మాటలు చుట్టూ పరిభ్రమిస్తూ..
నాకు తెలియకుండానే నా సీటు లో కూల బడ్డాను.నా కన్నా అన్ని విధాలా మంచి పొజిషన్ లోనే వున్నారు వాడు,వాడి పరివారం.
యాంత్రికంగా రెండు రోజులు గడిచేయి.
అవాళ బజార్లో విశ్వ నాధం గారు కలిసేరు.
అతన్తో మాట్లాడుతూ వుంటే మా భాను ప్రసక్తి వచ్చింది.
విశ్వనాధం గారు వేరే సెక్షన్లో ఆఫీస్ సూపర్నెంటు గా వున్నారు.
అతని ద్వారా విన్న విషయం నా కాళ్లకింద భూమిని లాగేసినట్లయింది.
భాను పనిష్మెంట్ ట్రాన్స్ ఫరయి యిక్కడ కొచ్చాట్ట.
ముందు జాగా ల్లో కూడా లంచాలు తిని ,ఎంక్వయిరిలో యిరుక్కుని ,పెద్దవాళ్లని పట్టుకుని యిక్కడకు బదిలి చేయించుకున్నాట్ట.
వాళ్లావిడతో పడదట.
పిల్లలు కూడా ప్రేమ పెళ్లిళ్లు చేసుకొని వీళ్లతొ
సంబంధాలు తెంపుకుని వెళ్లిపోయేరట.
వీడంటే ఎవరికీ పడదట .
నాకు భాను గాడి మీద ఓ క్షణం జాలి కలిగింది.
వాడిలో చిన్నప్పట్నుంచీ మార్పు లేదన్నమాట.

Comments