: మహాశివరాత్రి- కొబ్బరన్నం
ఇదేవిటి..మహాశివరాత్రి నాడు వుపోషం మానేసి ..యీ కొబ్బరన్నాలేవిటి!!
హన్నా! అనుకోకండి.
శివరాత్రి కి అందరం వుపవాసమే.
అయితే శివరాత్రి సందర్భంగా కోవెలలో కొట్టిన కొబ్బరికాయ లు,వీళ్ళు వాళ్ళు రుద్రాభిషేకం వేసుకుంటూ యిచ్చిన కొబ్బరి చిప్పలు..
చూసేక ఆ మర్నాడు నాకు వచ్చిన ఆలోచన కొబ్బరన్నం.
దానికేవుంది.కోరుతీసి అరవ్వాళ్లలా కరివేపాకు పోపుపెట్టి అన్నం కలిపేయడమే కదా అనుకుంటునారా!
కాదు..ససేమిరా కాదు.
మరో పధ్ధతి వుంది.
కొబ్బరి పాలు తీసి,అందులో మసాలా తయారు చేసి పాలు జరుగుతున్నప్పుడు బియ్యం కడిగి ఆపాలల్లో పోసి వుడికించడం.
అలా చేసిన కొబ్బరన్నం చాలా రుచిగా వుంటుంది. ఆ బియ్యం కూడా రోజూ తినేవి కాక యే బాద్షాభోగో,గోవింద భోగో,అధమం జీరా రైసో అయితే మంచిది.కిలో వంద పైనే.
అయితే ఆ మసాలా కి కొన్ని దినుసులు తప్పని సరి.
గసగసాలు, తెల్లుల్లి,నీరుల్లి,అల్లం..
అన్నీ యింట్లో యెప్పుడూ వుండేవే కానీ యీ గసగసాలు యెప్పటికప్పుడు తెచ్చుకోవలసిందే.
మినిస్టర్ అప్రూవల్ దొరికిన వెంటనే ముందు బయటకు షాపుకొచ్చి వంద గ్రాముల గసగసాలు కొన్నాను.
కిలో వెయ్యి రూపాయలట.
డబ్బులు తిన్నట్టే వుంది.
అందుకే కొందరు దీని బదులుగా నువ్వులు పప్పు వాడతారు.
కానీ నాకు గసగసాల రుచి నచ్చుతుంది.
ఇంటికొచ్చాక నేను చెయ్యాలనుకున్న పనులు.. అంటే నాకు సరదా కలిగించే పనులు..
చెయ్యడానికి వుద్యక్తుణ్ణయ్యాను.
కూరలు తరగడం..మిక్సీ తిప్పడం..నాకు ఆమోదింపబడ్డ పనులు.
అయితే వాటిని కూడా మా ఆవిడ నిర్దేశించినట్లు చెయ్యనందుకు అప్పుడప్పుడు మంగళాస్టకాలు వినవలసి వుంటుంది.
ఆవిడ కు శుభ్రత ,క్రమశిక్షణ యెక్కువ.తీసిన వస్తువులు మళ్లీ పనయ్యాక అక్కడే పెట్టాలి.
నాకు తొందర యెక్కువ.
పనవ్వాలి.అంతే..
అదావిడకి నచ్చదు.
మొత్తానికి ఆవిడ కు కావలసిన పద్దతి లో చేసేసి,కొబ్బరి తురుము రెడీ చేసి ,కొద్దిపాటి చీవాట్లతో బయట పడ్డాను.
మిగిలిన పనంతా ఆవిడదే.
అరగంట గడిపి యింటి కొచ్చేసరికి వేడివేడి కొబ్బరన్నం వాసనలు నోరూరిస్తు రారమ్మని పిలిచాయి.
ఏ మాటకామాటే చెప్పుకోవాలి..బ్రమ్మి గాళ్లకి కడుపే కైలాసం అనూరికే అన్లేదు.
మీరూ ఒకసారి ప్రయత్నం చెయ్యండి.
Comments
Post a Comment