మేనత్త కొడుకూ...
"ఇట్రా వో సారి"
మా ఆవిడ పెట్టిన గావు కేకకి గెడ్డం బరుక్కుంటున్న వాణ్ణి అదిరిపడి,తూలిపడబోయి,నిలదొక్కుకుని
"యావైందేమిటి"
అంటూ వంటింటి గుమ్మం ముందు నిలబడ్డాను.
చేతిలో రేజర్..
"ఆ దిక్కుమాలిన గీకుడింకా అవలేదా?"
"అయిపోవచ్చింది..చెప్పు.."
"మరేం లేదు. మజ్జిగ పులుసు రుచి చూడమందావని.."
"అబ్బ..యిప్పుడే కదా టీ తాగేను.మజ్జిగ పులుసెలా రుచి
తెలుస్తుంది.."
"నేనేం గూనెడు పులుసు యివ్వలేదు..చెంచాడు చూడ్డానికేం..దొ బ్బిడాయి.."
మారు మాటాడక చెంచా నోట్లో పోసీసుకున్నాను..పొయ్యి మీద మరుగుతున్న పులుసు వేడికు నాలిక చురికింది.
"ఎలావుంది?"
"బ్రహ్మాండమైన వేడిగా వుంది"
"కాస్తా వూదుకుని నెమ్మదిగా తాగొచ్చుగా..కొంపలు ములిగిపోయిట్లు..తొందర..
పనే వుంది కనక ఎంతసేపూ టిక్కుటిక్కుమంటూ ఆ ముదనష్టపు ఫోను నొక్కుకోవడమేగా..
ఇంతకీ రుచెలావుంది?"
సరిపోతుంది. అన్నీ బాగానే పడ్డాయి.అవునుగాని నాకు తెలియకడుగుతాను..నువ్వేదో పెద్ద సైంటిస్ట్ లాగా,నేను నీ ప్రయోగాలకు వుపయోగపడే యెలక లా ట్రీట్ చెయ్యడం నీకేమైనా భావ్యమా!"
సర్లె... ఏదో రుచులు వున్నదున్నట్టు చెప్తావని అందరూ అంటుంటారని పోనీకదా అనిస్తే.."హుమ్మని హుంకరించి తన సామ్రాజ్యం లోకి వెళ్లి పోయింది.
ఇక్కడ నేను నా ప్రజ్ఞ గురించి కొంత ఆత్మస్తుతి చేసుకోక తప్పేట్టు లేదు,తప్పని తెలిసినా.
రుచులు చెప్పడంలో నా తరవాతే యెవరైనా అని మా బంధువర్గంలో నాకో పేరుంది.
మా యింట్లో జరిగే వేడుకలప్పుడు నాకే ముందుగా రుచి చూడమని యివ్వడం ఆనవాయితీ.
అందువల్ల..ఆ సంగతి చిన్నప్పటినుండి మా యావిడకు తెలిసివుండడమ వల్లనూ ఆవిడ వంటలకు నేను యాసిడ్ టెస్ట్ గా వుపయోగపడుతుంటాను.
అయ్యా/అమ్మా!ఆవిడ మా మేనమామ కూతురు.
నేనావిడకి మేనత్త కొడుకు ని.
మేనత్త కొడుకూ ఓ....
చాలా సార్లు అనిపించింది.
పై పిల్ల అయితే యిలా ప్రవర్తించివుండేదికాదేమోనని.
అయితే ఏ మాటకామాటె చెప్పుకోవాలి.
ఇంటి పనుల్లో ఆవిణ్ణి మించిన వారు లేరు.
మా అమ్మా,నాన్నలపై విపరీతమైన అభిమానం కనబరిచేది.
ఇప్పుడు వాళ్లులేరనుకోండి.
ఇల్లు సర్దడం..నీట్నెస్ ఆవిడ తర్వాతే ఎవరైనా.
నా బాధల్లా నాకు రావలసిన గౌరవము నాకివ్వడం లేదని.
ఒక్కరోజు యావండి అని పిల్చెరగదు.
పోనీ యిప్పటివాళ్లలా పేరుపెట్టి పిలవదు.
పోనీ యెవరికైనా పరిచయం చెయ్యాలన్నా మా అయన అని చెప్పదు.
ఆమధ్య వాళ్ల వదినల్తో అనడం విన్నాను.
మాయింట్లో అన్నీ టైములే.
పొద్దున్నే లేవగానే మొహం కడగడం ఆలస్యం.. టీ కప్పు అందించాలి...మళ్ళీ పూజయ్యీసరికి కాఫీ,టఫినూ యిచ్చీయాలి..పన్నెండు కొట్టిందోలేదో విస్తరి వెయ్యాలి.మళ్ళీ నాలుగు కొట్టగానే టీ..
హరిమీదగిరి పడ్డా యిదే తంతు..
రిటైర్ అయినా మా బ్రామ్మడింతే.
అదండీ సంగతి..
Comments
Post a Comment