సబల

కవితకి చికాగ్గా వుంది.
పైన సూర్యుడు, కింద సూర్యారావు తినీస్తునారు పాపం..
సమయం వుదయమ పదకొండు..
మార్తాండుడు జనాన్ని తన వుగ్ర కిరణాల్తో దగ్ధం చేసేయాలని కంకణం కట్టుకున్న వాడ్లా చెలరేగి పోతునాడు.
కవిత కాలి చెప్పులో గులకరాయిని విదిలించింది.
సుర్రావు గాడ్ని కూడా అలా విదిలించ గలిగితే బావుణ్ణు..
ఎంత మాటన్నాడు..ముసిలి వెధవ..నా యీడు ..నాకన్నా పెద్ద కూతురుండదా వాడికి..
"చూడు కవితా! రేపు హోటల్ అప్సరా కి రా.అన్ని విషయాలు నీకు చెప్తాను"
దుమ్మరిగొండ్లా పళ్లికిలిస్తు రహస్యంగా చెప్పిన సూర్రావు మొహం మళ్లీ కళ్ల ముందు కదలాడింది.
ఛీ..ఛీ.వెధవ..పట్టబుర్రరామకీర్తన పాడించాలి.
తనేం చెయ్యాలి?
అసకు తనేం చెయ్యగలదు?
అసలీ పరిస్థితి తనకెందుకొచ్చింది..
అడ్డమైన వెధవల మాటలుపడే దుస్థితి కి కారణం...
ఆర్నెల్లు కిందట తప్పతాగిన తన తండ్రి బస్సు కిందపడి పోవడం...
కంపాసనేట్ గ్రౌండ్ కింద తనకి వుద్యోగం రావడం..
భల్లూకం లాంటి సూర్రావు కింద పనిచేయాల్సి రావడం తన ఖర్మ.
ఇంటర్ చదువుతూ మధ్యలో యిలా సంసార భారం నెత్తన పడటం ఖర్మ కాక మరేవిటి?
తల్లి సత్తెకాలపు మనిషి.
తను ఆమెను చూసుకోవాలి.
సుఖపెట్టాలి.
తండ్రి ఎప్పుడూ ఆమె నో మనిషి లా చూళ్లేదు.
ఒక విధంగా తండ్రి పోవటం సుఖంగా వుంది.
కానీ రేపెలా?
సూర్రావు గాడి బారి నుంచీ రక్షించేదెవరు?
ఆలోచనలు..
సమాజం లో స్త్రీ యెంత ప్రగతి సాధించినా,పురుషుడి తో సమానంగా అన్ని పనులూ చేయగలుగున్నా..
అణగదొక్కాలని  చూస్తారెందుకు?
ఎలా?ఏం చెయ్యాలి?
కాస్సేపు ఆలోచిస్తే మెరుపులా వొక వుపాయం తోచింది.
హాయిగా యింటి దారి పట్టింది కూనిరాగం తీస్తూ.
@@@@@
హోటల్ అప్సరా!
సమయం సాయంత్రం ఆరు గంటలు.
సూర్రావు నీటుగా తయారై..విజిలేసుకుంటూ హోటల్ అప్సరా మెట్లెక్కేడు..
అక్కడ విశాలమైన సోఫాలో బిడియంగా..యిరుగ్గా కూర్చున్న కవితను చూసి కళ్లు మిలమిల మెరిసాయి.
రిసెప్షన్ లో అడిగి రూం తాళాలు తీసుకుని..కవిత వంక చూసి తనతో రమ్మన్నట్టుగా కళ్లెగరేసి..గబగబ నడిచి మెట్లెక్కెడు.
కవిత నెమ్మదిగా లేచి అతన్ని అనుసరించింది.
విజిలేసుకుంటూ రూం తలుపు తెరిచి..
కవితను రమ్మన్నట్టు తలాడించేడు.
నెమ్మదిగా గదిలోకి నడిచింది మేకలా..
వెంటనే గది తలుపులు మూసి గడియ పెట్టాడు సూర్రావు.
కవిత వేపు నడుస్తుండగా -
విన్పించిందా చప్పుడు..
టక్..టక్..
తలపెవరో కొడుతునారు.
ఓహ్! షిట్! రూం సర్వీసు అయ్యుంటాడు..
విసుగ్గా తలుపు తెరివిన సూర్రావు అవాక్కయ్యాడు.
ఎదురుగా సాక్షాత్తు తన పై అధికారి...
సింహం గా పేరుపడ్డ నరసింహా రావు.
@@@@@@@@

ఒక్కమాట..
కథ అయిపోయిందా!ఇంతేనా..సుఖాంతమా..దుఃఖాంతమా?
పరిష్కారం ??
గాంధీ గారు స్త్రీలు అర్ధరాత్రి తిరగడం గురించి అన్నారేమో గాని ప్రస్తుతం పసిపాపలు,స్కూల్ కి పోయే చిన్నారులు మొదలుకొని డెబ్భయేళ్ల వృద్దులక్కూడా పట్టపగలేరక్షణ లేదు.
నిర్భయ చట్టాలు, ఫాస్టట్రాక్ కోర్టులు కూడా మానవమృగాలని యేమీ చెయ్యలేకపోతునాయి.
శిక్షల భయం లేదు..
న్యాయవ్యవస్థ లో లొసుగుల్ని తెలివిగా వాడుకుని జారిపోతునారు.
అత్యాచారం చేసినవాడు మైనరన్న కారణంగా శిక్ష లో మినహాయింపు లెందుకు?
మైనరు అత్యాచారం చెయ్యగల మేజర్ అయినపుడు వాణ్ణి మైనర్ గా పరిగణించడమెందుకు?
తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ..పసిపాపల్లో ..వృద్ధుల్లో కూడా కామాన్ని వెతికే కీచక,సైంధవాధముల పట్ల జాలెందుకు?
అదే..నేను చెప్పదల్చుకున్నది.

Comments