లోయర్ బెర్త్

కార్డు కథ
లోయర్ బెర్తు

"అమ్మయ్య "
నాకెంతో యిష్టమైన లోయర్ బెర్తు లో దుప్పటి పరుచుకుని ,కిటికీ పక్కన చేరేను.
త్రీటయిర్ లో లోయర్ బెర్తు కి పోటీ యెక్కువ.
నేనెన్ని సార్లో నా బెర్తుని రకరకాల కారణాల వల్ల త్యాగం చెయ్యవలసి వచ్చేది.
కానీ యీ సారి మాత్రం యెట్టి పరిస్థితి లో త్యాగం చెయ్యకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాను.
నా ఎదటి బెర్తులో ఆకు పచ్చ యూనిఫాంలో మిలిటరీ వుద్యోగి..
మిగిలిన వారెవరూ యింకా వచ్చినట్టు లేదు.
ప్లాటఫాం జనాల సందడి తో కళకళ లాడుతోంది.
అదిగో..అప్పుడే..
మా కూపే లో మిగిలిన బెర్తు ల వాళ్లు వచ్చేరు.
ముసలాయన,ముసలామె,మనవలు.. ఎనిమిది..పదేళ్లవాళ్లు..
నా గుండె దడదడ లాడింది.
చదువుతున్న కామిక్స్లో తల పూర్తిగా దూర్చీసేను.
వాళ్లు సామాను సర్దుకున్నాక దగ్గరగా వినపడింది.
"బాబూ"
'అయింది'
అనుకున్నాను.
బలవంతంగా పుస్తకం లోంచి నత్త లా తల బయటపెట్టేను.
కింద బెర్తు కావాలని ముసలాయన మాటల సారాంశం.
నేను నా కాల్లో గాజు పెంకు గుచ్చుకుందని,పైకెక్కలేనని చెప్పేను.
ఆయన నిరాశగా చూస్తునాడు.
నేను కరగదల్చుకోలేదు.
అంతలో యెదటి బెర్తు మిలిటరీ వ్యక్తి ముసలాయన్ని పిలిచి తన బెర్తుని తీసుకోమని తను పై బెర్తు మీద తన సామాను సర్దుకున్నాడు.
వెంటనే నిచ్చెన యెక్కి బెర్తు మీద కూచున్నాక  చూసిన దృశ్యం నెనెప్పటికీ మర్చిపోలేను.
ఆయన పేంటు పైకెత్తి  నట్బోల్ట్లతో బిగించబడి న తన కృత్రిమ కాలుని విప్పి పక్కన పెట్టేడు.
నా ప్రమేయం లేకుండా నే నాకళ్లు చెమ్మగిల్లాయి.
ఆ తర్వాత నేను నా బెర్తు ని ముసలామె కు దానం చేసి మిలిటరీ వ్యక్తి ఎదటి అప్పర్ బెర్తులో సెటిలయ్యానని చెప్పక్కరలేదనుకుంటాను.
నా పదిహేనేళ్ల జీవితంలో యిదొక అపురూపమైన అనుభవం.

Comments