చీమలు పెట్టిన....

'శుక్రవారప్పోస్ట్..5

చీమలు పెట్టిన....

త్రాష్టుడు'

పళ్లు కొరుతూ అన్నాడు వీరభద్రరావు.
"మూణ్ణెళ్లై అద్దె బాకీ పెట్టి 'యిదిగో అదిగో' అంటూ తిప్పుతునాడు.
పోనీలే..పాపం..పేదముండావాడని వూరుకుంటే అలుసు గా వుంది.
ఇవాళ తాడోపేడో తేల్చేయ్యాలి."
గట్టిగా నిశ్చయించుకున్నాడు.

భార్య భారీకాయంతో అందించిన 

కాఫీ ఒక్క గుక్కలో తాగేసి దండయాత్ర కు సిద్ధమయి మేడమీదకు దారి తీసాడు.

మెట్లెక్కుతుండగా మూసిన తలుపుల గుండా దమనకరావు మాటలు వినిపించాయి సన్నగా..

" లేదు..రేవతీ..నాకు చాలా సిగ్గేస్తుంది.
అంత పెద్దాయన మన బాధలు చూళ్లేక అద్దె వసూలు కి వచ్చి కూడా మన సొద విని మారుమాట్లాడలేక ప్రతిసారి వెళిపోతునారు.
అతనిలాటి వుత్తముణ్ణి బాధించడం నాకైతే పరమరోతగా వుంది.
మనకష్టాలు మనవే.వాటివల్ల ఆయనకు నష్టం కలిగించడం యెంత వరకు సబబు?
మరో వుద్యోగం దొరికేవరకూ నువ్వు మీ వాళ్లింటికి వెళ్లి వుండు.
నేనేపార్కులోనో,కోవెల్లోనో గడిపేస్తాను.
నీ గాజులు తీసి యిలా యిస్తే ఆయనకి మనం బాకీ వున్న మూణ్ణెల్ల అద్దె యిచ్చేస్తాను.
అంత నెమ్మదస్తుణ్ణి,మంచి వారిని యింకా యిబ్బంది పెట్టడం భావ్యం కాదు."

తలుపు తట్ట బోతున్న వీరభద్రం నీరై పోయి వెనుదిరిగాడు.

మెట్లు దిగుతున్న గృహమేథి ని కిటికీలోంచి గమనిస్తున్న దమనకరావు పెదాలపై చిరునవ్వు చిందింది.
 
బరువుగా మెట్లు దిగుతున్న వీరభద్రరావు కి మనవడు గట్టిగా చదువుతున్న

"చీమలు పెట్టిన పుట్టలు పాముల...."
పద్యం వినపడింది.
ఇంటి కోసం తను పడ్డ బాధలు..కష్టాలు అప్రయత్నంగా గమనాన్ని నిరోధించాయి.

మళ్లీ వెనక్కి తిరిగి మెట్లెక్కి తలుపు తట్ట బోయి ..సన్నగా వినపడుతున్న మాటలకి ఆగేడు..
" పదపద.మరో మూణ్ణెల్ల వరకు ముసలాయన మన జోలికి రాడు.ఇవాళ బయటే భోజనం..."
అంటూ తలుపు తీసి ,యెదురుగా విస్ఫులింగాలు వెదజల్లుతున్న వీర భద్ర మూర్తిని చూసి నిశ్చేష్టుడయ్యాడు దమనకరావు అనబడే డి.మేనకారావు.

Comments