సర్దుబాటు

శుక్రవారం పోస్ట్..7
సర్దుబాటు

ఇవాళ నేననుకున్న పని యెలాగైనా చెయ్యాలని కృతనిశ్చయుడనై బయలుదేరాను.

కిందటి వారం మా అమ్మాయి వాళ్ల ఫ్లాట్ లో కూర్చున్నప్పుడు
జరిగిన సంఘటన నా ప్రయాణ కారణం.
ఆరోజు పక్క ఫ్లాట్ లోవున్న బెంగాలీ వృధ్దమహిళ గాధ నన్ను కలచివేసింది.
తెలుగు దేశంలో..భాషతెలియని మనుషుల మధ్య వంటరిగా బతుకుతున్న ముసలావి డ స్వంత భాషలో మాట్లాడుతున్న నన్ను చూసి బొళబొళా తన వ్యథ నంతా కుళాయి లో నీటిలా వ్యక్త పరిచింది.
ఇంటింటి రామాయణమే.
ఇద్దరు కొడుకులు.. వాళ్ల భార్యలు..తనతో పడకపోవడం..
భర్త పెన్షన్ తో చెరో కొడుకూ పంపిస్తున్న ఇరవైవేలతో విడిగా వుంటోంది.
కూతురెక్కడో బెంగుళూర్ లో అల్లుడు తో సుఖంగా వుంటోంది.
అల్లుడూ,కూతురు మంచివాళ్లట.వాళ్లే అప్పుడప్పుడు వచ్చి యోగక్షేమాలు విచారించి
డబ్బులిచ్చి వెడుతుందిట.
పెద్దవాడు ఫారిన్లో వున్నాట్ట.నెలనెలా గవర్నమెంట్ వారిలా పదివేలు పంపి చేతులు దులిపేసుకుంటాట్ట.
చిన్న కొడుక్కి బిజినెస్ వుంది..పక్కనే యేదో అపార్ట్మెంట్ లో వుంటాట్ట..
తనని యిక్కడ చేర్చేసి మళ్లీ యిప్పటి దాకా మొహం చూళ్లేదట.
కనీసం ఫోన్లో కూడా చచ్చేవా..బతికుఉన్నావా అని అడగట్ట.
కోడళ్ల సంగతి సరేసరట.మరి అడక్కండి అంటూనే అన్నీ చెప్పింది.
ముసలాయన పదిహేనులక్షల ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ నెలనెలా వస్తుందట.
అయినా ఒక్కర్తినీ దెయ్యం లా యెలా వుండాలో చెప్పమంది.
చిన్న కొడుకెక్కడుంటాడో చెప్పమన్నాను.
చెప్పింది.

నేటి నా ప్రయాణం చిన్న కొడుకు దగ్గరి కే.
వివేకం వారిస్తున్నా మనసొప్పుకోక చివరికి గమ్యం చేరాను.

బెంగాలీ లు  మనలా కాకుండా యెవరేనా భాషేతరులు వాళ్ల భాషలో మాట్లాడితే తెగ సంబరపడిపోతారు..
అదొక ప్లస్పాయింట్ వుండడం వల్ల నన్నునేను బెంగాలీ లో పరిచయం చేసుకుని  అట్టే నాన్చకుండా విషయం లోకి వచ్చీసేను.

అతను సైగ చేసి బయటకు తీసుకు వచ్చి యిలా అన్నాడు.
" సర్.మీకు తెలియదు.
అత్తాకోడళ్లకు వొక్క క్షణం పడదు.
అమ్మ అర్దం చేసుకోదు..కాంప్రమైజ్ కాదు.
మా ఆవిడతో అశాంతి నాకిష్టం లేదు.
అందుకే ఆవిణ్ణి దగ్గరగా వుంచేను.నెలనెలా ఆ అద్దె పన్నెండువేలు నేనే కడుతున్నాను.
అదికాక అమ్మకు నాన్న గారి పెన్షన్ ఎనిమిది వేలు,బేంకు వడ్డీ లు పదివేలపైనే వస్తాయి.
ఆమె బాగోగులు చూడమని అక్కడ నాకు తెలిసినాయనని రిక్వెస్ట్ చేసేను.
ఆయన బయటపనులు చూస్తాడు.
పనిమనిషిని పెట్టుకోమన్నాను.
మా అన్నయ్య కూడా నెలనెలా పదివేలు పంపుతాడు.
మరింకేం చెయ్యమంటారు ..మీరే చెప్పండి.అక్కడకు వెళితే మా ఆవిడ విసుక్కుంటుంది.
మా ఆవిడతో అశాంతి కన్నా యిదే సుఖం కదా!
అయినా మా చెల్లెలు దగ్గరా,మీలాంటి వాళ్ల దగ్గరా మమ్మల్ని ఆడి పోసుకుంటుందామె..సానుభూతి కోసం.. "
నా బుర్ర తిరిగి సెలవు తీసుకుని వచ్చేసాను.
రాజీపడి సర్దుకుని బతకడం తెలియని ముసలామె మీద జాలిపడాలో,కోపగించుకోవాలో  తెలియని స్థితిలో వొక గుణపాఠం నేర్చుకుని యింటి దారి పట్టాను.
రచయిత యెవరో తెలియని కొటేషన్ గుర్తుకొచ్చింది.
"యూత్ యీజ్ ఎ బ్లండర్
మేన్హుడ్ ఈజ్ ఎ స్ట్రగుల్
ఓల్డ్‌ యేజ్ ఈజ్ ఎ రిగ్రెట్"

Comments