వీడని నీడ
"ఘర్..ఘర్ర్,.."
ఘ్రా....ఘ్రు ర్...ఘఘ్ర్"
అదిరి పడ్డ కంపార్ట్ మెంట్ జనం పై బెర్తుల వేపు చూసేరు.
నీలాచల్ ఎక్స్ప్రెస్ ..త్రీటైర్ బోగీ..
రైలు పెద్దశబ్దంతో అలసట యెరగని ఇనుపజంతువులా గమ్యం వేపు పరుగులు తీస్తోంది.
పై బెర్తుల మీద నేను,మా అన్నయ్య గాఢ నిద్రలో వున్నాం.
మర్యాదగా పిలిచిన పిలుపులకి లేవకపోయెసరికి గట్టిగా తట్టి లేపారు.
"సార్లూ! మీగురక కాస్త ఆపితే మేము కూడా శయ్యాగతులమవుతాము
అయినా అదేం గురకండీ బాబు..రెండు ఖడ్గమృగాలు,అడివి పందులు దెబ్బలాడుకున్నట్టు..నక్కలు వూళ వేస్తున్నట్టు అదీ లయబద్ధంగా...
నీలాచల్ హోరుని మించింది మీ గురక జోరు...""
ఇలాంటి కామెంట్లు మాకు కొత్త కాదు.
చుట్టాలిళ్లకు వెడితే మాకు పక్కలు వేరు గా యేర్పాటు చేస్తారు.
మా పక్కన పడుకునేందుకు యే నరమానవుడు సాహసించలేదు.
మా ధాటికెదురులేదన్న తిరుపతి కవుల్లా,కొప్పరపు సోదరుల్లా హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయే వాళ్లం.
అయితే మాకు బాధ లేదని కాదు కానీ గురక నివారణోపాయం మాకు అలోపతీ, హోమియోపతి..ప్రసాదించలేకపోయాయి.
రకరకాల చిట్కాలు పాటించినా పెద్ద వుపయోగం లేకపోవడం వల్ల యధావిధిగా మాగురక ప్రహసనం కొనసాగింది.
మా గురక భయానికి మా ఇంట్లో కన్నంవేసిన దొంగలు కూడా పారిపోయారని వినికిడి.
ఇలా అప్రతిహతంగా కొనసాగుతున్న గురక ప్రహాసనానికి అడ్డు మా పెళ్లి రూపం లో వచ్చింది.
మాకంటే ముందు మాగురక జగద్విఖ్యాతం కావడం తో మాకు సంబంధాలు కుదరడం కష్ట మయింది.
'ఏమి సేతురా లింగా'
అని యుగళగీతం పాడుతున్న మాకు తలవని తలంపుగ జంట సోదరీద్వయం తో సంబంధం వెతుక్కుంటూ వచ్చింది.
ఎక్కువ బేరసారాలు జరక్కుండానే పెళ్లి నిశ్చయమైంది.
అనుకున్న ముహూర్తానికి వైభవంగా పెళ్లి కూడా జరిగిపోయింది.
హమ్మయ్య అని ఆడపెళ్లి వారితో పాటు మా వాళ్లు కూడా గుండె మీద బరువు దింపుకున్న వారిలా తెగ ఆనంద పడి పోయారు.
ఆ రాత్రి --
వూరు వూరంతా మా యింటి ముందే వుంది.
ఎందుకంటే మా గదుల్లోంచి నాలుగు యేనుగులు ఘీంకరిస్తున్నట్టు,అడవి పందులు ఘూర్జరిస్తున్నట్టు వింతవింత ధ్వనులు వినపడ్డాయట.
ధన్వంతరీ,అశ్వనీ దేవతలారా!
మా కీ గురక నుండి విముక్తి ప్రసాదింపుడు.
Comments
Post a Comment