శుక్రవారం పోస్ట్-13 ముష్టి

శుక్రవారం పోస్ట్-13

ముష్టి
@@@

"లచ్చోరం చాయిబాబా గుడి, శనోరం ఎంకన్న గుడి..ముందే అనుకున్నాం కదేటి..మరియాల నువ్వేటిక్కడ?"

లా పాయంట్ లేవదీసాడు కోటి.

చేతులు నలుపు కుంటూ -
ప్రాధేయపడుతూ-యీ వొక్క సుట్టుకీ 'వొగ్గీ'మంటునాడు లచ్చిగాడు.

వాళ్లిద్దరి మధ్యా జ్యూ రిస్ డిక్షన్ కోసం వాదులాట జరగడం లేదు.

అదెప్పుడో ఫైసలా అయిపోయింది ముష్టి అసోసియేషన్ ద్వారా.

ఇవాళ లచ్చిగాడికి పిల్లదానికి వంట్లో బావులేక డబ్బవసరం వచ్చింది.

అంచేత కోటి గాడి కాళ్లావేళ్లా పడుతునాడు.

గురువారం బాబా కోవెల కళ్లవేడుకగా వుంది.
డబ్బున్న మారాజులు కార్లు పార్క్ చేసి ,గుడిలోకి పాపం కడుక్కోడానికి వస్తునారు.
చెప్పుల స్టాండ్ వాడికారోజు ముగ్గురు  సహాయకులు చాలక నాలుగోవాణ్ణి వెతుక్కుంటునాడు.
కొబ్బరి కాయలు,అరటిపళ్లు,పువ్వులు అమ్మేవాళ్లు రోజూ కన్నా యెక్జువ ధరకి అమ్ముతునారు.
పూజారి గారు పట్టుపంచె ,విభూతి కట్లతో వస్తున్న జనాన్ని నవ్వు మొహంతో పలకరిస్తునారు.
సాయినాధుడు కాలు మీద కాలు మీద కాలు వేసుకుని జనాల కామితాలను చిరునవ్వుతో వింటునాడు..వీళ్లెప్పటికి మారరు అనుకుంటూ.

"అయితే యేటంటావెటి."
కోటిగాడు గట్టిగా అన్నాడు

"ఈపాలికొగ్గీరాదాన్నా"

రాళ్లు కరిగే స్వరంలో లచ్చిగాడు ప్రాధేయపడుతున్నాడు.

కోటిగాడు వాడివేపు చూసేడు.

వాడి కళ్ళలో దైన్యం కోటిగాణ్ణి కదిలించింది.

"సర్లే .‌ఫో.."-పర్మిషన్ యిచ్చీసేడు.

లచ్చిగాడు మహదానందంగా బారులు తీరి కూర్చున్న సహచరుల పక్కన కూలబడ్డాడు.

కోటిగాడు శిబి చక్రవర్తి లా...దానకర్ణుళ్లా...కనపడుతునాడు లచ్చిగాడికి.

నీతి: దానాలకి అంబానీల్లా డబ్బులే వుండక్కర్లేదు.
అర్దం చేసుకునే మనసుంటే చాలు

Comments