శుక్రవారం పోస్ట్16

శుక్రవారం పోస్ట్-16
గ్రహింపు
@@@@#
రంగారావు గారి జేబులో డబ్బులు మాయం అవుతునాయి.

ముందు గ్రహించలేక పోయారు.
ఏవో ఖర్చు లొచ్చి తనే ఖర్చుచేసాననుకున్నారు.
కానీ పదేపదే జరగడం ..
అనుమానం కలిగించింది.
అంత మతిమరుపు మనిషి కాడు.
ఎవరు తన జేబులో డబ్బు తీస్తున్నారు?
ఇంట్లో వుండేది నలుగురు.
తను,భార్య జానకి,  అరవై యేళ్ల  తన తల్లి,బి.కాం చదువుకుంటున్న కొడుకు.
పని మనిషి యెప్పటినుంచో పని చేస్తునాది.
అన్ని రకాల పరీక్షల్లో నెగ్గాకే అమెను పనిలొ పెట్టుకున్నారు.
కొడుకుకి దుర్వ్యసనాలు లేవు.
భార్య తనకు కావలసినవి చెప్పగానే తనే తెచ్చి యిస్తాడు.
మరి..
ఎవరి పని?
బాగా ఆలోచించాడు.
అంతు చిక్కడం లేదు.
సరే..తనే పట్టుకోవాలి..
ఆరోజు వంద కాయితం జేబులో కనపడుతున్నట్లు పెట్టి రహస్యంగా గమనించసాగేడు. .
గదిలోకి ముందు పనిమనిషి వూడవడానికి వెళ్లి వచ్చేసింది.
నోటలాగే వుంది.
భార్య దేని కోసమో వెళ్లింది.
పది నిముషాలసేపున్నాక బయటకు వచ్చింది.
వెళ్లి చూస్తే నోటలాగే వుంది.
కొడుకు కాలేజీకి తయారై వెళ్లిపోయాడు.
జేబులో నోటు అలాగే వుంది.
కాస్సేపటికి తల్లి గదిలోకి వెళ్లడం చూసేడు.
ఆమె రాగానే గదిలోకి పనున్నట్టు పోయి చూస్తే నోటు లేదు.
రంగారావు ఆలోచనలో పడ్డాడు.
తల్లికి డబ్బవసరం యేమొచ్చింది..
తననెందుకు అడగలేదు.
కాస్సేపు ఆలోచిస్తే తనకే తట్టింది.
తల్లికి పెన్షన్ లేదు.
ఆవిడ అవసరాలు ఆవిడకుంటాయి.
తిండి, బట్టా మాత్రమే కాదుకదా.
గుడి కి వెళ్తుంది..ప్రవచనాలకి హాజరవుతుంది..పూజలు..దానధర్మాలు ..
అన్నిటికి తన దగ్గర చేయిచాపి అడుక్కోవలసిన అవసరం ఆమెకి యేముంది?
తన కొడుకు చొక్కా జేబులో చెయ్యి పెట్టి దర్జా గా తీసుకునే హక్కు అమెకు యెప్పుడూ వుంది.
అయితే తను కాక మరెవరు చూసినా  ఆమెను అపార్దం చేసుకోవచ్చు.
అందుకే.-
మరునాడు తల్లి గదిలోకి వెళ్లి ..
"అమ్మా! ఈ వెయ్యి రూపాయలు నీ దగ్గరుంచు.
నీకు కావలసివి తీసుకో..."
అని చెప్పి వచ్చేసాడు.
వెళిపోతున్న కొడుకు ను చూస్తున్న ఆ తల్లి కళ్లలో నీళ్లు..
తన అవసరాలకు తప్పనిసరై చేస్తున్న పనికి ప్రాయశ్చిత్తంగా..

Comments