మారండోయ్...

'మారండోయ్..
@@@@@@

"ధడేల్'
శబ్దం విని వులిక్కి పడ్డాను.
గృహ నిర్బంధంలో ఆరవరోజు.
మా అపార్ట్మెంట్ లన్నీ నిశ్శబ్దంగా వున్నాయి. 
ఎప్పుడూ వుండే పిల్లల అల్లరి గదుల్లోనే దాక్కుంది.
ఒక రకమైన భీతాహం..నిస్తేజం అలుముకుంది.
పనివాళ్లు,పాలబ్బాయల,పేపరు వాళ్ల హడావుడి కూడా లేకపోవడంతో జనారణ్యం బోసిగా వుంది.
చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దంలో ఆ చప్పుడు భయం గొలిపింది.
పిల్లేదో గిన్నె తోసిందనుకునీ లోగా మరో ప్లేటు నేలమీద పడి భళ్లున ముక్కలయింది.
నా మనసెందుకో కీడు శంకించి,చేతిలో మొబైలు పక్కన పెట్టి లేవ బోతుండగా అశరీరవాణి వినిపించింది.
"ఎప్పట్నుంచో చెప్తునాను.
బాత్రూం లో రిపేర్లు చేయించమని..నా గోల వింటేనా..
ఇప్పుడు అన్నీ బందు.
ఎవడూ రాలేడు..మనం పిలవలేం.
పని మనిషి లేకుండా వొక్కర్తినీ యంత్రం లా అన్ని పన్లూ చేసుకు చావడానికి పదహారేళ్ళ బాలా కుమారినా!
ఉన్న మూడు గదులూ,చిమ్మి,అలికీ,ముగ్గులు పెట్టి,అయ్యగారికి పూజకి అన్నీ సిద్ధం చేయాలా..
చూస్తే యీ దిక్కుమాలిన వైరసో జబ్బో మా ఆడాళ్లని కాల్చుకు తినాలని వచ్చినట్టుంది.
పన్నెండయీసరికల్లా వేడి గా బువ్వలు కావాలి.
అంట్ల సంబరం వుండనే వుంది.
అ పక్కింటి దిబ్బ వెదవొకడు (అన్యాపదేశంగా నన్ను కాదు కదా! కొంచెం బొద్దుగా చిరుబొజ్జతో వుంటాన్లెండి)అస్తమానం 'ఆంటీ అంటిపండు' అంటూ దేనికో దానికి తగలడతాడు."
హమ్మయ్య..ప్రవాహం ఆగింది.

నన్నేం చెయ్యమంటారు చెప్పండి.
బాత్రూం రిపేరు కోసం అపార్ట్మెంట్ మేసన్ కం ప్లంబర్ ని నెల రోజుల్నించీ పిలుస్తునే వున్నాను.
వాడు మహ బిజీ..
వస్తానని బుర్ర వూపుతాడు.
చూస్తుండగా రోజు గడిచిపోతుంది..
వాడు రాడు.
మర్నాడు అడిగితే-
వేరే పనిలొ బిజీ అంటాడు.
బయటి వాళ్లచేత చేయిస్తే కోపాలు.
ఈ లోగా లాక్ డౌన్.
బాబీలో పాట హం తుమ్..పాడుకోడమే.
మళ్లీ శబ్దాలు ..గరిటెలు శృతి చెస్తున్న చప్పుడు.
చెవులు రిక్కించి..యెందుకేనా మంచిదని ఫోను జేబులో పెట్టేసి సర్దిన బట్టల స్టేండ్ సర్దుతున్నట్టు నటించాను.
ఎప్పుడు వచ్చిందో...
"పొద్దున్న సర్దడం అయింది.దాన్ని కెలక్కుండా బయటకు వెళ్లి పాలపేకట్లు ,పెరుగు తీసుకొస్తే యీపూట గడుస్తుంది.
లేదంటే....''
అర్దమైందన్నట్లుగా బయటకు నడిచాను.
బయటకు రాగానే చాలా హాయిగా అనిపించింది.. స్వేచ్ఛ విలువ బంధింపబడ్డప్పుడే తెలుస్తుంది.
ఎన్నాళ్లో యిలా?
ఆవిడ చిరాకు పడ్డంలో తప్పులేదు.మగవారికన్నా ఆడవారికి..ముఖ్యంగా వుద్యోగిణులకు బాధాకరమే.
ఇవతల యిల్లు,అవతల ఆఫీసు..
మొన్న బేంకు స్నేహితురాలు గోడు విన్నాక పాపం అనిపించింది.
నెత్తీ,నోరు కొట్టుకుంటూ చెప్తున్నా ప్రజల్లో మార్పులేదు.
సగం మంది మాస్కులే వేసుకోరు.
ఎందుకు వేసుకోలేదంటే
'నాకు కరోనాలేదు మేడమ్' అన్నాట్ట.
తలకొట్టుకు యేడవాలనిపించిందామెకి.
గేట్ తీయగానే పొలో మంటూ మేకలమందలా పరిగెత్తుకు రాకుండా క్యూలో రమ్మని చెప్పి అక్కడ వారనలా పంపడానికి వున్న వొక్క మేల్ అటెండర్నీ పెడితే నియంత్రణ జరిగిందట.
హత విధి!
రక్షించు దేశాన్ని.
ఇంతకు నాపని.
ఫోన్ మోగింది.
అవతల మాటలు విని,
గభాల్న వెనక్కి తిరిగి గేటు దగ్గరకు చేరుకున్నాను.
ఫోన్లో ఫ్రెండ్ బయట పోలీసులు బయట తిరుగుతున్న వాళ్లని పట్టుకోవటానికి గస్తీ తిరుగుతూ, కనపడ్డవాళ్లని చితగ్గొడుతునారని చెప్పేడు.
అదీ సంగతి.
ఫ్లాట్ వైపు అడుగులు వేస్తున్నా మనసంతా గుబులుగా వుంది.
ఇంట్లో ఆవిడకి యేం చెప్పాలి?
అసలే మూడ్ బావులేదు.
తలుపు దగ్గరకు రాగానే-
"ఎందుకు అలా బయటికి కాలుగాలిన పిల్లిలా తిరగడం.. పోలీసులు పట్టుకుని రామకీర్తన వాయిస్తునారట..పక్కావిడ చెప్తోంది." అనటం విని
'హమ్మయ్య' కాగల కార్యం గంధర్వులు..వుహుం..పక్కావిడ తీర్చినందుకు మనసులో ధన్యవాదాలు చెప్పుకుంటూ జేబులోంచి ఫోన్ తీసేను.
యేం చేస్తాం..పుట్టుకతో వచ్చిన..

ఉప సంహారం
@@@@@@
సరదాగా రాసినా ,నిజానికి మన ఆడవారి సేవలకు విలువ కట్టే షరాబు లేడు.
వున్న బాధ్యతలకు తోడుగా ,పని మనిషి బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ మనకు వేళకి అన్నీ అమర్చి పెడుతున్న గృహలక్ష్మి సేవలను కాదనలేము.
ముఖ్యంగా వుద్యోగినులైన గృహిణుల పాట్లు చెప్పనలవి కాదు.
దానికి తోడు స్కూల్ లేని పిల్లకాయల సందడి.
కాబట్టి పురుషపుంగవులారా!
దయచేసి, వారి పనులలో అడ్డంపడకుండ,వలసినంత మేరా సహాయం చెయ్యండి.
వంటింటి పనులు కూడా చెయ్యగలిగినంతమేరా చేస్తే,వారికి శ్రమ తగ్గించిన వారవుతారు.

Comments