దారి తప్పిన కూన
@@@@@@@@@
కమల భయం గా చూస్తోంది.
దాదాపు నెల తర్వాత వచ్చింది.
తననెలా రిసీవ్ చేసుకుంటారో!
ఇంటి వాళ్ల సంగతి తనకి బాగా తెలుసు.
నాన్న దూర్వాసుడు లా మండిపడతాడు.
నోరులేని అమ్మ తనని కాపాడే ప్రయత్నం చేస్తుందని నమ్మకం లేదు.
అన్నయ్యకి స్వతంత్రం లేదు.మామ్మ ఒక్కతే చెస్తే యేమయినా చెయ్యగలదు.
కానీ దుర్వాసుడు లాంటి కొడుకుకు అడ్డు చెప్ప గలదా!
తను చేసింది మహా ఘోరం..
క్షమార్హం కాదు...
పవిత్రమైన కుటుంబం లో పుట్టి,వూరూపేరు లేని వాడితో చెడతిరిగి నెల్లా ళ్ల తర్వాత వాడు మోజు తీర్చుకున్నాక వదిలేస్తే ,దిక్కులేక యింటికి నానాబాధలు పడి వచ్చింది.
కాని..తనకు ఆశ్రయం లభిస్తుందా!
ఇంటి వాళ్లు తనని చేరదీసి అక్కున చేర్చుకుంటారా!
తనేం చెయ్యాలి.
నెలకిందట-
తన యింటి ముందు జరుగుతున్న నిర్మాణం పనిలో చలాకీగా పనిచేసే హసన్ తనని ఆకర్షించాడు.
తొమ్మిదవ క్లాసు చదువుతున్న తను అర్ధంకాని వ్యామోహం.. ఇన్ఫాచ్యుయేషన్ కి గురైంది.
రోజు స్కూల్ కి వెళుతున్నప్పుడు ,వస్తున్నప్పుడు,చూపులు,నవ్వులతో మొదలై,దొంగతనంగా కలుసుకోవడం ..యిల్లు వదిలి అతడితో పారిపోవడం జరిగింది.
కొత్త మోజు తీరాక అసలు రంగు బయట పడింది.
ఓరోజు తెల్లవారు జామున లేచి చూసేసరికి పక్కన. అతడు లేడు.
ఎలా బయటపడి అక్కడి నుంచి యిల్లు చేరిందో తనకే గుర్తు లేదు.
ఇప్పుడు యింటి దగ్గర కు చేరాక భయం.
ఎలా?
తలుపు తెరిచిన తండ్రి కనపడ్డాడు మసకగా.
తనని చూస్తునే శివమెత్తినవాడ్లా అరిచాడు.
తల్లి వంటింటి పొగల్లో వుండి వుంటుంది.
అన్నయ్య కిటికీ వూచల్లోంచి జాలిగా చూస్తునాడు.
అక్కలు ముగ్గురు భయంగా చూస్తునారు.
మామ్మ నెత్తి మీద ముసుగు లాక్కుంటూ తండ్రి ని సముదాయిస్తోంది.
అయపోయింది..
తనకిక యింట్లో స్థానం లేదు.
తను చేసిన తప్పు చిన్నది కాదు.
వాళ్లు చేసిన దానిని తప్పు పట్టలేదు.
తనకీవాళ్లకీ నేటితో రుణం తీరిపోయింది.
ఉన్న వొక్క ఆశ అడుగంటింది.
"యూత్ ఈజ్ ఎ బ్లండర్
మేన్ హుడ్ ఈజ్ ఎ స్ట్రగుల్
ఓల్డ్ యేజ్ ఈజ్ ఎ రిగ్రెట్."
అన్నారు.
తనదోవ తను చూసుకోవాల్సిందే.
కాస్సేపాగి,కళ్లు తుడుచుకుని అనంత అంధకార లోకాల్లోకి సాగిపోయింది కమల.
ఎక్కడుందో!
ఇప్పుడేం చేస్తోందో!
ఇది జరిగి నేటికి ముఫ్ఫయేళ్లు గడిచాయి.
కమల నాన్న,అన్నయ్య,మామ్మ గతించారు.
తల్లి రాని కూతురు కోసం మంచంపట్టేసింది.
అక్కలు వాళ్ల కాపురాలు వాళ్లు చేసుకుంటూ వున్నారు.
కమల ఏమైందో? ఏ నిప్పుల లోకాల్లో,గ్రీష్మారణ్యాల్లో దారి తప్పి తిరుగుతోందో?
ఆ రోజు..ఆ పిల్లని..దారితప్పిన కూనని అ కుటుంబం చేరదీసి వుంటే...
ఇది నిజంగా ముఫ్ఫయేళ్ల కిందట జరిగిన కథ.
Comments
Post a Comment