చిట్కా

#పోస్టుకార్డ్ కథ

చిట్కా
ఇంటర్నెట్, సెల్ ఫోను లేని రోజులు.
ఏదో బండి గురించి అడగాడానికి రైల్వే స్టేషన్ విచారణ కౌంటర్ ముందు పావుగంట నుండి నిలబడ్డాను.
క్యూ కదలడం లేదు..
జనం..
ఇళ్లలో కన్నా బయటే యెక్కువ తిరుగుతారెందుకో !
ఎండాకాలం..
ఉక్క..
చుట్టూ సందడి.. గోల..
చికాగ్గా వుంది.
కౌంటర్ లో వ్యక్తి అష్టావధానం చేస్తునాడు.
ఎదురుగా మైకులో అనౌన్స్మెమెంట్,మధ్య లో లేచి,పక్క కౌంటర్ దగ్గరకు యేదో పని మీద వెళ్లడం,మళ్లీ ఎదురుగా వున్న వాళ్లకి జవాబు చెప్పడం..వాళ్ల సందేహం తీర్చడం,నిరంతరంగా మోగుతున్న టెలిఫోను యెత్తి జవాబు చెప్పడం..
ఇదే ప్రక్రియ మరో పది నిమిషాలు కొనసాగింది.
నాకు నిల్చోటం దుస్సహంగా వుంది.
చెమటలు ధారలుగా కారి వళ్లంతా స్నానం అయిపోతోంది.
నా ముందు క్యూ హనుమద్వాలాన్ని తలపింపజేస్తోంది.
మరిక నా వల్ల కాదు..
అప్పుడు తట్టింది...అష్టావధానాన్ని చూడగానే.
వెంటనే లైను లోంచి బయటకు వచ్చి ఆ పక్కనే వున్న మరో రైల్వే ఆఫీసులో కి దూరి, అక్కడ వారి అనుమతితో వారి టెలిఫోన్ తీసుకుని విచారణ వ్యక్తి కి ఫోన్ చేసి,అతను యెత్తగానే,నాకు కావలసిన. సమాచారం అడిగాను.
హమ్మయ్య అనుకుని అక్కడ నుండి బయట పడ్డాను.

Comments