ఆబ్దికం

#ఆబ్దికం
@@@@@
.....

"రామం"

తల్లి పిలుపు విని గతుక్కు మన్నాడు రామం.

అనుకుంటునే వున్నాడు, తల్లి పిలుస్తుందని.

"రేపు ఆబ్దికం మీ నాన్నది."
మెల్లగా అంటున్న తల్లిని చూసి-

"నిజమేనమ్మా! కానీ యీ కరోనా రోజుల్లో యెలా కుదురుతుంది." అన్నాడు.

"..నిజమేరా..కానీ కోవెల కు పోయి శాస్త్రి గారికి కనీసం స్వయంపాకమేనా.."

"సరేలే! రేపు పొద్దున్న వెళతాను."అన్నాడు నీరసంగా.

"దక్షిణ యెంత పెడదామనుకుంటునావు"అందావిడ

"రెండు వందలు చాలదూ"
తలెత్తి చూసిందావిడ కొడుకు వంక.

తప్పు చేసిన వాడ్లా తలదించుకుని గబగబ అక్కణ్ణుంచి బయటికి నడిచాడు, మరేం జవాబు చెప్పాల్సొస్తుందోనని .

రామం మంచి వాడే.
కానీ ప్రయివేటు వుద్యోగం..కరోనా వల్ల వుద్యోగం కోల్పోయిన బాధితులలో వొకడిగా మారిపోయాడు.

 ఆస్తిపాస్తులు లేవు.,చిరుద్యోగం కారణంగా  తల్లి, భార్య, కొడుకు ,తను
రోజులు గడపడమే కష్టంగా వుంది.

అప్పులు పెరిగి పోయాయి.
తన దగ్గర రేండు వందలే వున్నాయి.

ఇంకా నెల గడవాలి.

మొన్న వొక ఆఫీసు వాళ్లు పిలిచారు. అందులో చేరితే 
కొంత గాడిన పడొచ్చు.

ఆబ్దికం విషయం నిన్న రాత్రి నుంచీ బుర్రలో తిరుగుతోంది.

కానీ యేమీ పాలు బోవడం లేదు.

తల్లి చూపులు వెంటాడు తునాయి.

నిజమే యింట్లో తద్దినం పెడితే కనీసం మూడు వేల దాక అవుతుంది.
స్వయంపాకం రెండు వందలు యే మూలకి.

పాపం..కోవెళ్లు మూసేసిన దగ్గర్నుంచి శాస్త్రి గారికి ఆదాయం లేదు.
పిల్లలతో యేమవస్థ పడుతునారో!
తన కివాళ కాకపోతే రేపైనా యేదో వుద్యోగం దొరక్కపోదు..
కాని పౌరోహిత్యాన్నే నమ్ముకున్న ఆయన గతేమిటి?
 
రవి యధాలాపంగా చేతిని చూసుకున్నాడు.
అతనికేదో తట్టింది.
గబగబ బజారు వేపు అడుగులు వేసేడు.

మర్నాడు తల్లి రెడీచేసి యిచ్చిన స్వయంపాకం సంచిలో దక్షిణ వెయ్యి రూపాయలు పెట్టి ,తల్లి మొహం చూసాడు
ఆమె కళ్లు ఆనందంతో మెరిసాయి.
పూజారి గారి కోసం కోవెల మెట్లు యెక్కుతున్న రామంకి సంతోషంగా వుంది.

అతడి చేతి వేలిని యెల్లవేళలా అంటిపెట్టుకుని వుండే తండ్రి బంగారు వుంగరం యిప్పుడు లేదు.

Comments