తొందరపాటు

తొందరపాటు
@@@@@@
అపసోపాలు పడుతూ హౌరా నుంచి వచ్చిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఖరగ్పూర్ స్టేషను లో హమ్మయ్య అని ఆగింది.
సుందరం ఎదురుగా వున్న  స్లీపర్ లో సింగిల్ విండో సీటు దగ్గర కూర్చున్నాడు.
జనం కోలాహలం గా ఎక్కుతున్నారు..కేకలు..గోల..అరుపులు..
తిను బండారాల వాళ్ల గోల..
అతని ఎదురు బెర్తుల్లోకి గొడవపడుతూ భార్యా,భర్త పిల్లలు వచ్చారు.
పిల్లలిద్దరూ చిన్నవాళ్లు.
భార్య రాగానే,కిటికి పక్క సీట్లో చతికిలబడి ,ఎదుటి బెర్తు కిటికీ పక్క సీట్లో చిన్న వాణ్ణి కూర్చోమంది.
భర్త బెర్తు కిందికి వంగి సామాన్లు సర్దుతునాడు.
పెద్దవాడు కిటికీ పక్క సీటుకోసం గొడవ పడ్తునాడు.
బండి మళ్లీ ఉసూరు మంటు బయల్దేరింది.
జనాలు ఎవరి సీట్లలో వాళ్లు సర్దుకున్నాక ఒకసారి చుట్టూ చూసాడు సుందరం.
ఆఫీసు పని మీద బాలాసోర్ వెళ్లాలి.ఇక్కడికి గంట దూరంలో వుంది బాలాసోర్.
పొలాలు, చెట్లూ వెనక్కి పరిగెడుతునాయి.
కిటికీ సీటుకోసం అన్నదమ్ముల పోరు తీవ్రమైంది.
తండ్రి ఏదో సర్ది చెబుతున్నా గడుగ్గాయిలు వినిపించుకోలేదు.
అప్పుడు వినిపించింది..
సైరన్ లాంటి ఆమె గొంతు.
నన్నుద్దేశించే చెబుతోంది.

"పిల్లడ్ని సముదాయించే బదులు ఆ కళ్లజోడు చేపలాయన్ని  ఒకసారి అడగండి.. '"
బెంగాల్ లో వున్న ప్రవాసాంధ్రులు స్థానికులైన బెంగాలీలను చేపల వాళ్లంటారు.
వారికి చేపంటే ప్రాణం.
చేప శుభం వారికి.జలపుష్ప మంటారు

సుందరం ఉలిక్కి పడ్డాడు.
చాలా కాలం నుండి బెంగాల్ లో ఉంటూ అక్కడి వారిలా మారిపోయాడు త ను.
కళ్లజోడు,
కుర్తా,పైజామా,బొద్దుగా బెంగాలీ గానే పొరబడతారందరు.
దానికితోడు భాష కూడా అనర్గళంగా మాట్లాడగలడు.
అసలు అతడ్ని చూసి తెలుగు వాడనుకోరెవరు.
మొహం కిటికీ వేపు తిప్పి నవ్వుకున్నాడు.
కుర్రాడి తండ్రి వచ్చి సుందరాన్ని సీటిమ్మని అడిగాడు.
సుందరం లేచి బెర్తు మీదకూర్చున్నాడు.

కుర్రాడి మొహం చింకిచాటంత అయింది.
తమ్ముడి వేపు గర్వం గా చూస్తూ,కిటికీ పక్క సీటు ఆక్రమించాడు.
ఆ బెర్తాయన బాలాసోర్ వరకూ రాడు కాబట్టి వాడిని అక్కడ నుంచి మరో గంట వరకూ కదల్చలేరు.
కొడుకు ని సెటప్ చేసాక భార్యాభర్తలు ఇద్దరూ కబుర్లలో పడ్డారు.
వినాలనుకోకపోయినా వాళ్ల మాటలు సుందరం చెవిలో పడుతునే వున్నాయి. 
అతడు బెంగాలీ అన్న భ్రమలో వాళ్లు మొత్తం వాళ్ల సంసారాన్ని సుందరం ముందు పరిచేసారు.
వాళ్ల ఆస్తులు,అప్పులు,భవిష్యత్ ప్రణాళికలు, కుటుంబ కలహాలు అన్నీ దొర్లాయి వాళ్ల సంభాషణలో.
తను దిగాల్సిన స్టేషను రావడంతో సుందరం లేచాడు.
పైన పెట్టిన సంచి అందుకోబోతుండగా అందులో వున్న  పోతన భాగవతం , కింద పడిపోయింది.
దాన్ని లోపల పెడుతూ,వాళ్లవంక చూసాడు.
ఇద్దరూ నిలువు గుడ్లతో అతని వేపు చూసారు.
.

Comments