పరిష్కారం
------------------
గిరీష్ తల వేడెక్కిపోతుంది.
ఏం చెయ్యాలి!
గతిరవైయేళ్లుగా పడుతున్న మానసిక సంక్షోభం తీరే దారి లేదా!
నిశ్శబ్దంగా కూర్చున్న తల్లి ని చూసాడు.
చిన్నప్పటి నుంచీ అమాయకంగా గోవులా కనపడేది.
ఇన్నేళ్లలోనూ వర్షాల్ని తప్ప వసంతాల్ని చూసెరగదావిడ.
కట్టుకున్న భర్త తాగుడికి అంకితమయిపోతే నానా కష్టాలు పడి తనని పెంచింది.
ఆరాత్రులు..రోజులు ఎన్నటికీ మర్చిపోలేడు తను.
ఒక్కోసారి తండ్రి ని చంపేయాలన్నంత కోపం వచ్చేది.
అనారోగ్యాలవల్ల ఆఫీసుకు పోక జీతం కూడా సరిగ్గా వచ్చేదికాదు.
ఇరుగు,పొరుగుల మంచితనంతో నెట్టుకొచ్చారు ఇన్నాళ్లు.
కానీ-
ప్రస్తుతం సమస్య..
తండ్రి రేపు రిటైరవుతాడు.
ఆ రిటైర్ మెంట్ డబ్బులతో ఇంట్లో దుకాణం పెట్టినా ఆశ్చర్యం లేదు.
నాల్రోజుల్లో ఆ డబ్బులన్నీ హరించుకుపోతాయి
ఆ తర్వాత..
అదే ప్రశ్న వెంటాడుతోంది.
తల్లి ఎప్పటికీ నోరు విప్పదు.
అన్నిటినీ తన ఖర్మ గా సరిపెట్టుకునే సనాతన భారతీయ నారి.
అదృష్ట వశాత్తు తండ్రి కేంద్ర ప్రభుత్వ వుద్యోగి కావడం వల్ల అతనెంత అవకతవకగా ప్రవర్తించినా,ఉద్యోగం వూడలేదు..అలా అనేకంటే తమ పై జాలి కొద్దీ ఆఫీసువారు కాపాడేరన్నది నూటికి నూరుపాళ్ల నిజం.
అసలు సమస్య నిన్న మొదలైంది.
తండ్రి కి నిన్నటి నుంచీ జ్వరం.. డాక్టర్ తాగితే చావు తప్పదని హెచ్చరించారు.
కానీ ఆ చావేదో ముందుగా వస్తే,తనకుద్యోగం గారంటీ.
రిటైరయ్యాక చనిపోతే ఏమీ లాభం లేదు.
ఏం చెయ్యాలి.
తల్లి ని చూసాడు.
నిర్వికల్ప సమాధిలో వున్న యోగిని లా వుంది.
ఆమెను సంతోషంగా చూసిన గుర్తులేదు.
తనని మాత్రం జాగ్రత్తగా చూసుకునేది.
ఆమెని సుఖపెట్టాలి.
రాత్రి పన్నెండు అయింది.
తల్లి గోడ వార చాపమీద పడుకుని వుంది.
లేచాడు..
పక్క గదిలో తండ్రి గది లోకి వెళ్లాడు.
కానీ తల్లి దగ్గు వినపడగానే గాబరాగా బయటకు వచ్చేసాడు.
తన పక్క మీద పడు క్కున్నాడు.
తల్లి అలాగే పడుకునుంది..
నిశ్శబ్దంగా నిట్టూర్చి,పక్కకు తిరిగి పడుక్కున్నాడు.
ఆలోచనలతో ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు.
తెల్లారింది.
పక్క గది లోంచి తండ్రి మూలుగులు వినపడటం లేదిప్పుడు.
పడుక్కున్న కొడుకు వేపు తిరిగి కళ్లు తుడుచుకుంది తల్లి.
కొడుకు భవిష్యత్తు కోసం ,ఆ గదిలోకి వెళ్లి ,నీళ్లకోసం సైగ చేస్తున్న భర్త నోటిలో చెంబులో నీళ్లన్నీ ఒక్కసారే వంపేసిన ఆ తల్లి గురించి గిరీష్ కెన్నడూ తెలియదు.
మర్నాడు ఉదయించిన సూర్యుడు కొత్త రంగుల కిరణాలతో తల్లీ,కొడుకులను నిద్రలేపాడు.
నీతి: ది పెగ్ యు డ్రింక్ కన్సిస్ట్స్ టియర్స్ అండ్ డ్రీమ్స్ ఆఫ్ యువర్ ఫేమిలీ అండ్ ద కిక్
గివన్ బై సక్సెస్ ఫుల్ ఫేమిలీ ఈజ్ మచ్ మోర్ బెటర్ దాన్ ఎ చీప్ లిక్కర్.
Comments
Post a Comment