1965-69 మధ్య కాలంలో నేను,మా మేనమామ యిద్దరు కొడుకు లు,వాళ్ళ పెద్ద చెల్లెలు (ప్రస్తుతం మా వదిన),మా దొడ్డమ్మ యిద్దరు కూతుళ్ళు, వాళ్ల తమ్ముడు మా అమ్మమ్మ గం.భా.స.లక్ష్మీ నరసమ్మ గారి సంరక్షణ లో సోంపేట టౌన్ హాల్ వీధిలో చదువు కోసం కాపరం పెట్టాం.
అప్పుడు జరిగిన సంఘటన.
మా అమ్మమ్మ శ్వేత వస్త్ర కిరీట ధారిణి..రాయల్ బెంగాల్ టైగర్.
చదువు కుని వుంటే ఇందిరాగాంధీ లా రాజ్యాలేలే సామర్థ్యం వుండేది.
రైల్వే లో పన్జేసే మా వాళ్ళు నెలనెలా డబ్బులు పంపేవారు మా ఖర్చులు కోసం.
మేమందరం అప్పట్లో ప్రైమరీ చదువు ల్లో నే వుండేవాళ్లం.
అప్పుడు కార్తీక పౌర్ణమి రోజున జరిగిన సంఘటన యిది.
అప్పట్లో మంచి నీరు కావాలంటే అరమైలు దూరంలో వున్న చీకటి బంగళా నూతి కి వెళ్లి తెచ్చుకోవాలి.
ఇంట్లో వున్న వుప్పు నీటి నూతి నీరు వాడకానికి అట్టి పెట్టుకునే వాళ్లం.
చీకట్నే లేచి మా రాయల్ టైగర్ రెండు బిందెలు చంకన పెట్టుకుని బయల్దేరి బంగళా వేపు తోటి తన సహ చరిణుల తో కబుర్లాడుకుంటూ వెళ్లడం ఆవిడ ఆనవాయితి.
ఆరోజు కార్తీక పౌర్ణమి కి ఎవరో చుట్టాలు కూడా వున్నారు.
అందరూ కలసి మడిగా చలిమిడి చేసి చేటలొ పెట్టి,
మమ్మల్ని ముట్టుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
రోజంతా వుపవాసం వుండి సాయంత్రం చంద్రుడు వచ్చే క పూజ చేసి చలిమిడి, వడపప్పు, పళ్ళు ఫలహారం
చేస్తారు.
మేమంతా మా సందడి లొ వుండగా కోవెలకు బయల్దేరుతూ ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పెద్ద వాళ్లు వెళ్ళే రు.
పూర్వకాలంలో ఇళ్ళు గమ్మత్తుగా సోలగొట్టాల్లా పొడుగ్గా గది వెనక గది వెనకాల పెరడు, నుయ్యి,మరుగు వుండేది.
వీధిలో ఎవరేనా నిలబడి చూస్తే గది తలుపులు తెరిచి వుంటే నుయ్యి దగ్గర స్నానం చేసిన వాళ్ళు కనపడతారు.
ఇప్పుడు మేమంతా మా ఆట సందడ్లో తలుపులు తెరిచి పెట్టి ఆడుకుంటూ ,మధ్యలో మా జాగ్రత్తలు గుర్తొచ్చి చూసేసరికి జరగవలసిన అనర్ధం జరిగిపోయింది.
వీధిలో కుక్క దర్జాగా వంటింటి దాకా వెళ్ళి అక్కడ చేట మీద మా వాళ్ళు మడిగా చేసి పెట్టుకున్న చలివిడి నాకి మమ్మల్ని చూసి పారిపోయింది.
చలిమిడి మీద స్పష్టంగా కుక్క పాదం గుర్తు చక్కగా ముగ్గు వేసి నట్టు కనిపించింది.
మా ప్రాణాలు పైకి పోయాయి.
అందులో మా దొడ్డమ్మ కూతురు.. మా కన్నా కొంచెం పెద్దది..
చేత్తో గబగబ శునకపాద చిహ్నాలు సరిచేసి..
"ఎవరూ పొరపాటున కూడా నోరు జారవద్దని" హెచ్చరిక చేసి గది తలపు గొళ్లెం వేసింది.
ఆతరువాత మా రాబె టైగర్ తదితరులు రావడం,చంద్రుడికి పుజలు చేసి,శాస్త్రోక్తంగా శునక చలిమిడి నైవేద్యం పెట్టడం,
ఫలహారం చెయ్యడం జరిగాయి.
మాకు ప్రసాదం యిస్తున్నప్పుడు మాత్రం
మేమంతా ఏకకంఠంతో "మాకొద్దు,మాకొద్దని "
కోరస్ పాడాం.
Comments
Post a Comment