అభిమాని
@@@@@
రవి పార్కులో అడుగుపెట్టాడు.
అతనికివాళ చాలా ఆనందంగా వుంది.
నిన్న తన అభిమాన రచయిత తో ఫోన్లో మాట్లాడి ఇవాళ తనని యీ పార్కులో కలియటానికి ఒప్పించగలిగాడు.
అసలాయన తన ఫొటోని ఎక్కడా ఎందుకు ప్రచురింపనిచ్చగించడో అర్ధం కావడం లేదు.
కురూపా!
వికలాంగుడా!
భగ్నప్రేమికుడా!
రవిలో ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయి.
ఏదేమైనా తనివాళ ప్రముఖ రచయిత శతభిషాన్ని కలుసుకోబోతునాడు.
చాలా ఎగ్జైటింగ్ గా,కంగారుగా వుంది.
ఎలా వుంటాడో?
ఎలా మాట్లాడతాడో?
ఇవాళ అన్ని అడిగేయాలి..
అతని అబిమాన రచయిత ఎవరో..అతని భవిష్యత్ ప్రణాళికలు.. అతని సంసారం..
పెళ్లయిందా?ఏమో?
చుట్టూ చూసాడు.
సాయంత్రం కావడంతో చాలా మందే వున్నారు.తన చుట్టూ వున్న సిమెంట్ బెంచీలన్నీ నిండిపోయాయి.
వీళ్లెవరికీ తెలీదు. తను ఆంధ్రుల అభిమాన రచయిత శతభిషాన్ని యిక్కడే మరికాస్సేపట్లో కలుసుకో బోతున్నాడని.
నవ్వుకున్నాడు.
పార్క్ లో అందరూ యెవరి గోలలో వాళ్లున్నారు.
బానపొట్ట అంకులాంటీలు సిమెంట్ చప్టా వాకింగ్ పాత్ మీద రకరకాల విన్యాసాలతో జాగింగ్ చేస్తునారు.
ముందు రాత్రి పార్క్ బెంచీ కింద యీనిన నల్ల కుక్క పిల్లలు ఒకదానిపై వొకటి యెక్కి పాలకోసం దాని పొదుగు మీద దాడి చేస్తునాయి.
సంఘసేవిక యెవరో బన్నులు,పాల పేకట్ పట్టుకు నించుని వాటిని అదలిస్తోంది .
మధ్య మైదానం లో యోగా టీచర్ స్థూలదేహులకు సూక్ష్మయోగాన్ని నేర్పుతునాడు.
మరొకాయన అదేపనిగా రామ్దేవ్ బాబా ప్రాణాయామాన్ని తన పద్దతి లో ఆచరిస్తు నాడు
ఇంకొకాయన చేతులు పక్క వాళ్ల మొహాలకు తగిలేంతగా పైకి విసుర్తునాడు.
సుగర్,బీపీ లు తగు మాత్రపు ఖర్చుతో చూసేందుకు,అవసరమైన సామగ్రి తో బల్ల పెట్టుకున్న మనిషి, వచ్చేపోయే వారిని గమనిస్తు నాడు.
పార్క్ బయట కొర్రలు,రాగులు,జొన్నలు,సిరి ధాన్యాల వర్తకుడు ఆరోగ్యం కాపాడుకోమని మైకులో హెచ్చరిస్తునాడు.
రవి మాటిమాటికీ గేటు వేపు చూస్తునాడు.
నిన్న ఆయన అన్న మాటలు గుర్తొచ్చాయి.
" నాకు ఎవర్నీ కలవటం ఇష్టముండదు.నాఫొటో ఏ పత్రికలో ప్రచురింపబడదు.
మా వాళ్లకి కొద్దిమంది సన్నిహితులకీ తప్ప నే నెవరో ఎవరికీ తెలియదు.
కాబట్టి..మీరు సెల్ఫీలు కోసం ఆశించకండి.
నేను మిమ్మల్ని గుర్తు పడతాను.కానీ మీరు మీ అంతట మీరే నన్ను గుర్తు పట్టాల్సుంటుంది.
అలాగైతే నే నేను మిమ్మల్ని కలుస్తాను." అన్నాడాయన.తనొప్పుకున్నాడు.
ఆంధ్రదేశంలో బాగా పేరున్న కమర్షియల్ రచయిత.. అతని పుస్తకాలు అందరూ వయోబేధం లేకుండా వేలం వెర్రి గా చదువుతారు.
అతడెలా వుంటాడో,అలవాట్లు, అభిరుచులు యేమీవనజ తెలియదు ఎవరికీ.
అటువంటి వ్యక్తి ని కలుసుకో బోతునాడు తను.
వస్తాడా!
కాలం గడుస్తోంది.
రవి చూపులు మాటి మాటికీ పార్క్ గేటు వేపు తిరుగుతునాయి.
కొంపదీసి రాడా!
మనసులో అనుమానం..
ఛఛ..అలా చెయ్యడు..మాటిచ్చాడు కదా!
తనకి తానే సర్ది చెప్పుకున్నాడు.
సెకెన్లు నిమిషాలుగా మారాయి.
నిముషాలు గంటగా మారకముందే గేటు దగ్గర ఆరడగుల వ్యక్తి కనపడ్డాడు.
చాలా హుందాగా వున్నాడు..క్రీమ్ కలరు షర్ట్.. వైట్ పేంట్..టక్ చేసుకున్నాడు..
తిన్నగా రవి కూర్చున్న సిమెంటు బెంచ్ దగ్గరకు వచ్చి"-మిస్టర్ రవీ..." అన్నాడు.
రవి సంభ్రమంగా లేచి,
"వావ్..వచ్చారా శతభిషం గారు" అన్నాడు కాస్త బిగ్గరగా.
అంతే.
పార్కులో కూచున్న జనాల కళ్లన్నీ వీళ్లిద్దరి వేపు తిరిగాయి.
ప్రఖ్యాత రచయిత శతభిషం.
పుస్తకాలు చదివే ప్రతి వారికీ ఆ పేరొక తారక మంత్రం.
ఉవ్విళ్లూరించే శృంగార కథలు..ఆకట్టుకునే సీరియళ్లు..సస్పెన్స్ అదరగొట్టే డిటెక్టివ్ కథలు..
ఒకటేమిటి.. అతని రచనలు ప్రచురించని పత్రిక లేదు.
అతడి కథలు ఇతరబాషల్లోకి కూడా అనువదించబడ్డాయి.
రవి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతునాడు.ఈలోగా వారిని అక్కడి జనం బిలబిలలాడుతూ చుట్టు ముట్టేరు.ఎవరెవరో ఏవేవో అడుగుతున్నారు.
సెల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటునారు.
ఎవరి మాట ఎవరికీ అర్ధం కాకుండా గందరగోళం గా వుంది.
ఈ లోగా చీకట్లు ముసురుకున్నాయి.
అ సందట్లో శతభిషం ఎలా జారుకున్నాడో ఎవరూ గమనించలేదు.
తన అభిమాన రచయిత ను కళ్లారా చూడగలిగిందుకు రవి సంతోషంగా వున్నా,శతభిషం కోరిక ని తీర్చలేకపోయినందుకు అపరాధ భావనతో వూగిస లాడుతూ , ఇంటి దారి పట్టాడు.
అదే సమయంలో శతభిషం పార్క్ నుంచి తిరిగి వచ్చిన మిత్రునికి నల్ల కళ్ళద్దాలు సవరించు కుంటూ ఉత్తరం డిక్టేట్ చేస్తున్నాడు, మిత్రుడు లాప్ టాప్ మీద టైప్ చేస్తున్నాడు:
రవి గారికి,
నేను ముందే చెప్పాను. ఇలాంటి హడావుడి జరుగుతుందని ఊహించే నా బదులుగా నన్ను సదా అంటిపెట్టుకుని ఉండే నా మిత్రుణ్ణి పంపేను పార్క్ కి.
నమస్కారం.
శతభిషం.
Comments
Post a Comment