జరిగితే జ్వరమంత సుఖంలేదంటారు.
చిన్నప్పుడు నాకు జ్వరం రావాలని కోరుకునే వాణ్ణి.
అప్పుడు ఇంట్లో జరిగే రాయల్ ట్రీట్మెంట్ బావుండేది.
ఒకసారి మా నాన్న తో కలసి రైల్వే హాస్పిటల్ కి వెళ్లాను.పదేళ్ళో,పన్నెండేళ్లో వుంటాయి నాకప్పుడు.
ఖరగ్‌పూర్ లో రైల్వే హాస్పిటల్ చాలా పెద్దది.బ్రిటిష్ వాళ్ల కాలం నాటిది.
కలకత్తా గార్డెన్ రీచ్ హాస్పిటల్ తర్వాత దీనికి చాలా పేరుండేది.
విశాలమైన ఆవరణ ,ప్రశాంతంగా వున్న భవనాలు..అంతస్తుల లో రకరకాల వార్డులు... దారికి రెండు వేపులా రకరకాల నీడనిచ్చే చెట్లు..
గవర్నమెంట్ ఆస్పత్రి లా గలీజు గా వుండేదికాదు.
ఎప్పుడూ ఎప్పటికప్పుడు హెల్త్ వర్కర్లు నేలంతా ఫినైల్ వేసి శుభ్రం చేస్తూ వుండేవారు.
రైల్వే హాస్పిటల్ లో ఉచిత వైద్యమేకాక ఉచిత భోజనం కూడా వుంటుంది.
పేషెంట్ ఉద్యోగి కాక కుటుంబ సభ్యుడైతే నామినల్ గా ఛార్జ్ చేసేవారు.
పన్నెండయ్యేసరికి మధ్యాహ్న భోజనాలు.. సాయంత్రము ఏడున్నర కి రాత్రి భోజనాలు..అయితే మనకది పడదు
బెంగాలీ టైప్ భోజనం.
మాంసాహారం కూడా వుంటుంది.పెరుగు మజ్జిగ వుండవు.
పొద్దున్న బ్రెడ్ స్లైసులు వెన్నతో ఇస్తారు.
అక్కడ యదేచ్చగా తిరిగే పిల్లులు మాత్రం దొంగతనంగానో దొరతనంగానో ఆ తిళ్లు తిని పుష్టిగా తిరుగుతుంటాయి.
నాకు హాస్పిటల్ అంటే భయం వుండేది.
దేవదూతల వంటి నర్సులు బావున్నా వాళ్ళ చేతిలో ఇంజెక్షన్లంటే బెదురు.
ఠీవిగా స్టెతస్కోప్ మెళ్లో వేసుకున్నా డాక్టర్లు అశ్వినీ దేవత లలా అందంగా కనపడినా వాళ్లు ఆపరేషన్ లో కత్తులతో పరపరా కోసేస్తారని భయపడే వాణ్ణి.
అవేళ మా నాన్నగారి స్నేహితుడిని చూడ్డానికి వెళ్లామిద్దరం.
అతను ఆర్థోపెడిక్ వార్డ్ లో అంటే మూడో అంతస్తులో వున్నాడు.
హాల్లో ఎంటరవగానే ఎడం పక్క పురుళ్ల వార్డ్.
నాకు చాల ఆనందం కలిగించే వార్డ్ అది.
చిన్న వేలిడంతేసి పిల్లలు ..పురిటివాసనలు,మందుల ఘాటు తో కళకళలాడుతూ వుంటుంది.
ఎప్పుడూ హడావుడి గా వుంటుంది.
విజిటర్స్ టైంలో తిరునాళ్ళు లా కనిపిస్తుంది.
"టైం అయింది ఇహ కదలండి "అంటూ గంట వాయిస్తున్నా కదలరెవరూ.
రెండో అంతస్తులో ఆపరేషన్ థియేటర్, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ వున్నాయి.
మూడో అంతస్తులో ఆర్థో పేషెంట్లుంటారు.
సరే..విజిటర్స్కి లిఫ్ట్ ప్రవేశం లేదు కాబట్టి మెట్ల దారిన వార్డ్ చేరాం.
అక్కడందరు రకరకాల కట్లతో మంచాల మీద పడి వున్నారు.
మా పేషెంట్ బెడ్ చేరుకుని అతనూ మా నాన్నా మాటల్లో పడ్డాక నేను చుట్టూ వార్డంతా కలయ జూసాను.
విశాలమైన హాలు..
నీటైన దప్పట్లు,రగ్గులతో సర్దిన ఇనపమంచాలు..
ప్రతి మంచం పక్కన ఒక స్టూలు..ఒక చిన్న స్టీలు బీరువా..
బీరువా పైన పళ్లు,బ్రెడ్,బిస్కట్ పాకెట్..
మంచినీటి సీసా,గ్లాస్.
మా నాన్నగారు తెచ్చిన పళ్లు కూడా ఆ బీరువా మీద పెడుతూ వుంటే-
"మీ వాడు కూడా వచ్చాడే..నన్ను చూడ్డానికి.. రా బాబు..రా"
అని పిలిచి అక్కడున్న ద్రాక్ష పళ్లు కొన్ని తీసిచ్చాడాయన.
మా నాన్న వారిస్తున్నా,చాపల్యం కొద్దీ తీసుకుని నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే అటుగా పోతున్న మళయాళి నర్సు
"ళౌళీ బాయ్" అంటూ బుగ్గలు నిమిరింది.
చెప్పకేం..అప్పుడు కొద్దిగా ,బొద్దుగా, ముద్దుగా వుండేవాణ్ణని ..పెద్దల ఉవాచ.
కాస్సేపు మిగిలిన మంచాల వంక చూసేను.
కొందరి బేండేజీ కాలు పైకి లేపి స్టాండ్ కి తగిలించారు.
కొందరు మెడలో స్లింగుతో వున్నారు.
మళ్ళీ ద్రాక్ష అంకుల్ నన్ను పిలి చి ఏం చదువుతునానో తెలుసుకుని
" పెద్దయ్యాక ఏవుద్యోగం చేస్తావోయ్" అనడిగారు.
తడువుకోకుండా.."డిఆర్ ఎమ్."అన్నాను.
అందరూ పకపక నవ్వారు.
మా నాన్న గారి మాటల బట్టి రైల్వే లో డివిజన్ కి డిఆర్ఎం.రాజు లాటి వాడని వినివున్నాను.
అందుకే అలా చెప్పాను.
హాస్యాస్పదమైన నా కోరిక వాళ్లని ఎందుకు నవ్వించిందో కాలక్రమంలో తెలుసుకున్నాను.
డీఆరెమ్ కాలేకపోయినా డీఆరెమ్ ఆఫీసు లో మప్ఫయి నాలుగేళ్ల పాటు పనిచేసాను.
ఇంతకీ అన్నేళ్లలో ఒక్కసారి కూడా రైల్వే హాస్పిటల్ లో ఇన్ పేషెంట్ గా చేరే అవసరం కల్పించనందుకు ఆ దేవదేవుడికి కృతజ్ఞతలు.
Comments
Post a Comment