పెద్దరికం

పెద్దరికం
@@@@

"చూడు..చిన్నా యేంచేసాడో! పంట డబ్బంతా పెట్టి పట్నంలో జాగాకొనడానికి బయానా గా ఇచ్చివచ్చాడు చక్కా చేతులూపుకుంటు.
ఇంటి ఖర్చు లేమవుతాయి?నన్నోసారి అడగక్కర్లేదా? పెద్దవాడయిపోయాడా!"
సణుగుతునాడు భాస్కరం.
భార్య సముదాయించాలని చూస్తున్నా మెత్తబడలేదు.
కృష్ణ పక్క గదిలోంచి అన్నీ వింటున్నాడు.
ఆ రాత్రి నిశ్శబ్దంగానే గడిచింది.
పిల్లలు అల్లరి కూడా పెద్దవాళ్ళ కోపాల కారణంగా చల్ల బడిపోయింది.
పధ్నాలుగేళ్ల
భాస్కరం కొడుకు తన రూంలో కూర్చుని తండ్రి మాటలు వింటున్నాడు.

ఆ రాత్రి-
భార్యతో కృష్ణ -
"రేపు అక్కడ రాజధాని రాగానే జాగాల ధరలు విపరీతంగా పెరుగుతాయి.
మనం ఇవాళ లక్షలు పెడితృ రేపు కోట్లు వస్తాయి.
ఈ విషయం అన్నయ్యకి అర్ధం కాదు.
ఎంతసేపు తనని సంప్రదించకుండా డబ్బు ఇచ్చేసానని కోపం...
ఏం చెయ్యను..మనం బయానా ఇవ్వకపోతే రేపు ఇంకెవరో కొనేస్తారు."
అన్నాడు బాధగా.
భార్య అనునయంగా చూసింది.
కాస్సేపాగి మళ్లీ అన్నాడు-

"నాకో విషయం అర్థం కాదు.
పెద్దవాళ్లెప్పుడు చిన్న వారిని అర్ధం చేసుకోడానికి యెందుకు ప్రయత్నించరో తెలియదు.
చిన్నవాళ్లని ఎప్పటికీ తమ చెప్పు చేత ల్లో పెట్టుకోవాలని చూస్తారు.
మంచి చెప్పినా నచ్చదు..సీతా ..నాకు చాలా బాధగా ఉంది.. అన్నయ్య ప్రవర్తన... "

సీత జాలిగా అతడి తల నిమురుతూ -

"బాధపడకండి.అన్నీ సర్దుకుంటాయి" అంది.

ఇంతలో గోల,కేకలు వినపడి ఇద్దరూ గది బయటకు వచ్చారు.
వాసు గట్టిగా అరుస్తున్నాడు.



కళ్లనీళ్ల తో ఎదురుగా నిలబడ్డ పధ్నాలుగేళ్ల తన అన్నయ్య వంక చూసాడు రవి.

ఎదురుగా టేబుల్ మీ సగంపైగా తినేసిన చాక్లెట్ ఉంది.

"నేనొచ్చి సమానంగా ముక్కలు చేస్తానని చెప్పేనా? ఎందుకా తొందరా?కాస్సేపు అగలేవా?".. వాసు హూంకరింపు..

రవి ఏడుపు..మాటలు..
గబగబా గదిలోకి వచ్చారు రవి తల్లిదండ్రులు.
వాళ్ల వెనకాలే వచ్చి, గుమ్మం దగ్గర నిలబడ్డారు వాసు తల్లి దండ్రులు.
తమ్ముడు మరదలి వేపు తృణీకారంగా చూసాడు వాసు తండ్రి.
రవి తండ్రి కూడా తిరస్కారంగా అన్న వైపు చూసి,తలతిప్పేసుకుని-
"ఏవైంది రవీ?" అనడిగాడు.

అందరి చూపులూ పిల్లల మీదే ఉన్నాయి.

ఎదురెదురుగా వున్న గదుల్లోంచి పిల్లలు కలుగు ల్లో ఎలకల్లా తొంగి చూస్తున్నారు.

"ఏవైందిరా"- గుమ్మం దగ్గర నిలబడి తండ్రి అడిగిన ప్రశ్నకి జవాబుగా-

"చూడు నాన్నా! రవిగాడు నువ్విచ్చిన చాక్లెట్ నేనొచ్చేలోగా, మూడొంతులు తినేసాడు."
అన్నాడు కోపంగా.

రవి తండ్రి ఏడేళ్ల రవిని కోపంగా చూస్తున్నాడు.
వాసు సర్ది చెప్తున్నట్టుగా-

" పోన్లేరా..వెధవ చాక్లెట్.. చిన్నవాడు కదా! వదిలెయ్.." అన్నాడు.

వాసు తీక్షణంగా తండ్రి ని చూస్తూ-
"మరైతే .. పంట డబ్బుల గురించి  బాబాయి తో ఎందుకంత దెబ్బలాడేవ్" అన్నాడు.

పెద్ద వాళ్ల మొహాల్లో కత్తివేటుకు నెత్తురు చుక్క లేదు.

వాసు తండ్రి అపరాధపూర్వకంగా తమ్ముడిని చూసి,తల దించుకుని బయటకు నడిచాడు.

తలదించుకుని వెడుతున్న తండ్రి ని చూసి చిన్నగా నవ్వుకుంటూ ,మిగిలిన చాక్లెట్ తీసి తమ్ముడి చేతిలో పెట్టి,కన్ను గీటాడు వాసు.

Comments