ప్రళయం లో కూడా విశ్వనాథ త్రిశూలం పై తేలియాడే నగరం.
కాశ్యాన్ మరణాన్ ముక్తిః
అని ప్రసిద్ది పొందిన క్షేత్ర రాజం.
శంకరునకు,వ్యాసునకు గుణపాఠం చెప్పిన శంకర సదనం.
ఆఫీసు పని మీద మొఘల్సరాయ్ వచ్చిన విశ్వం ఖర్చు కలిసొస్తుందని కాశీ వచ్చాడు.
విశ్వం లో పొదుపరి తనం కన్నా పిసినారి తనం ఎక్కువ.
ప్రతీది లాభ నష్టాల బేరీజు తర్వాతే నిశ్చయించుకుంటాడు.
బేరం చెయ్యనిదీ ఏదీ కొనడు.
గంగానది దగ్గర క్షేమేశ్వర ఘాట్ లో నిలబడి చూస్తునాడు విశ్వం.
పక్కనే హరిశ్చంద్ర ఘాట్ లో కాలుతున్న చితి పొగలు వాతావరణం లో కలిసిపోయి అదొక రకమైన వాసన ...
పడవలు..యాత్రికులు..
ఇక్కడ కాస్త సందడి తక్కువే.
దగ్గరగా కనపడుతున్న పడవ వాణ్ణి పిలిచి,
"గంగ హారతి కి వస్తావా! ఎంత "అనడిగేడు హిందీలో.
"నాలుగు వందలండి"- అన్నాడు వాడు తెలుగు లో.
"నువ్వు తెలుగువాడివా"
"అవును బాబు.మాది విజీనారం." అన్నాడు వాడు. దాదాపు ఆరడుగుల పొడవుతో,బలిష్టమైన భుజాలతో తెల్లగా వున్నాడు.దుబ్బులా పెరిగిన ఉంగరాల జుట్టు ..
దీపాల్లాంటి కళ్లు.. "అంతఎక్కువేమిటోయి.రెండు వందలిస్తాను.పద" అన్నాడు విశ్వనాధం..
అతను ప్రతీ వారితో బేరం ఆడకుండా ఉండలేడు.
చెప్పినరేటుకి సగం కి అడగాలని కిటుకు లు చెప్పిన పెద్దమామయ్య సలహాని ఇప్పటికీ అమలు పరుస్తాడు విశ్వం.
కాస్సేపు తర్జన భర్జనలు జరిగాక మూడువందల కి బేరం కుదిరింది.
పడవ కదిలింది.
చల్లటి మార్గశిర మాసపు గాలి వణికిస్తునాది.
ఆపీసు ఖర్చుతో కాశీ యాత్ర చేసినందుకు తనని తానే అభినందించుకున్నాడు.
నల్లటి నీళ్లలో శవాల మీద పూలదండలు తేలుతున్నాయి.పేరు తెలియని పక్షులు ఏ చెట్టు మీదనుండో గట్టిగా అరుస్తున్నాయి.
"నరసిమ్మ నీదివ్వె నామ..."
పాడుతూ తెడ్డు వేస్తున్నాడు పడవ వాడు.
"నీ పేరేంటోయ్" అడిగాడు విశ్వం.
"అప్పన్నండి". పాట అపి జవాబిచ్చాడు.
"తవరు కాస్త మధ్యలో కూసోండి.బేలన్స్.."
అసిస్టెంట్ కుర్రాడ్ని కేకేసి హిందీలో ఏదో అన్నాడు.
పక్కకు చూస్తే నల్లటి చీకటి..నీళ్ల గలగల..
దశాశ్వమేధ ఘాట్ సమీపించింది.
మెట్లపై కనులపండువుగా గంగా హారతి.
పెద్ద పెద్ద తప్పెట్ల తాళాల శబ్దం...దీపాల బారు..జనం..
బాగా వంగి చూస్తుండగా-
హటాత్తుగా పడవ ఒరిగింది.
ఒడ్డున కూచున్న విశ్వం నీళ్లలో పడ్డాడు పట్టుతప్పి.
'బాబుగారూ- 'అంటూ కేక పెట్టి గభాల్న నీటిలో దూకి,
ఈతరాక మునిగిపోతున్న విశ్వాన్ని ఒక చేత్తో పట్టుకుని పడవ ఎక్కించాడు.
చావు అంచుదాకా వెళ్లిన విశ్వం యింకా పూర్తిగా తేరుకోలేదు.
తడిసిన బట్టల్లో వణుకు తున్నాడు.
తన తుండు గుడ్డతో విశ్వం తల తుడిచి,తడి బట్టలు విప్పించి అతని బేగ్ లో వున్న పంచె ,షర్టు కుర్రాడి సాయంతో కట్టించాడు.
పడవ ఒడ్డుకి చేరాక, జాగ్రత్తగా విశ్వా న్ని దింపాడు.
అప్పటికి తేరుకున్న విశ్వం
తన ఎదురుగా నిలబడ్డ అప్పన్న వంక చూసాడు.
చేతిలో గెడ కర్రతో ఆరడుగుల అప్పన్న త్రిశూలధారి లా కనిపించాడు.
పర్సులోంచి ఐదవందల నోటు తీసి అప్పన్న చేతిలో పెట్టి,వెనుదిరిగాడు విశ్వం.
"బాబూ..ఇదిగోండి ..సిల్లర" అన్న అప్పన్న మాటలు వినపడనట్లే ముందుకు సాగిపోయాడు..
Comments
Post a Comment