సోంపేట.
ఒరిస్సా ఆంధ్రా బోర్డర్ లో వున్న చిన్న పట్టణం
.
పంధొమ్మిది వందల అరవై ఐదూ,డబ్భయిల మధ్య కాలంలో నాకా వూరితో పరిచయం.
ఐదో క్లాస్ నుండి ఫోర్త్ ఫారం వరకూ అక్కడే చదువుకున్నాను.
నాతో పాటుగా మా పెదనాన్న పిల్లలు..మా మావయ్య పిల్లలు కూడా మా అమ్మమ్మ సంరక్షణలో టౌన్హాల్ వీధిలో వుండీవారం.
అప్పట్లో అక్కడ రిక్షాలు చూసిన జ్ణాపకం లేదు.
ఒకే సినీమా హాలు..చిదంబరేశ్వర టాకీస్..
సాయంత్రం ఫస్ట్ షో టైముకి అరగంట ముందు ఘంటసాల భక్తిపాటలు వేసేవారు.
ఇహ అక్కడ ఏకైక రవాణా సాధనం..జట్కా.
గూడుబండిని గుర్రాన్ని కట్టి,లోపల తాటాకుల చాప పరిచి ఉండేది.
గతకల్లో బుర్ర కి శఠగోపాలు తగిలేవి.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే మాకు వేసవి శెలవులు వచ్చేసరికి మాకు సంబరంగా ఉండేది.
మా అమ్మా నాన్నల దగ్గరకు హాయిగా వెళ్లవచ్చు నన్న ఆనందం.
మా వాళ్లు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రైల్వేలో పనిచేసే వారు.
ఇక్కడ మా హిట్లర్ అమ్మమ్మ నుండి మాకు కొంతకాలం విముక్తి ...
అయితే రైల్వే స్టేషన్ కంచిలి లో ఉండే ది.
దాదాపు మూడు మైళ్ల దూరం.
కంచిలి కొబ్బరి కాయలకి ప్రసిద్ధి.
అయితే సెలవులకి ముందే మావాళ్లు పంపిన రైల్వేపాసు పట్టుకుని,మా డబ్బా డవాలాలు సర్దుకుని ,జట్కా బండిని పిలిచే వారం.
అప్పట్లో బేరం గుర్తులేదు.
సామాన్లన్నీ బడి కింద త్రాళ్ల తొట్టె లో పడేసి మేమంతా పోలో మంటూ ఎక్కే వాళ్లం.
"కంచిలే..కంచిలే" అంటూ ,చర్నాకోలతో చక్రం ఆకుల మీద శబ్దం టకటక మంటూ చేసేవాడు.
రధం లా కదిలిన జట్కాలో కూర్చుని మహారాజు లా ఫీలవుతూ దారంతా చూసేవాళ్లం..కుడిపక్క తాసిల్దారాఫీసు..ఎడం పక్క..
శ్రీ రాములు గారి టైప్ ఇన్స్టిట్యూట్, అప్పన్న టీకొట్టు...దాటాక..దుకాణాలు..కోసకు వచ్చేసరికి విశ్వేశ్వర కోవెల..మల్లా వారి మామిడి తోటలు..
కుడివేపు పెద్ద గ్రవుండు..
అక్కడే మా ఏన్యువల్ స్పోర్ట్స్ జరిగేవి...
మొదటిసారి దొంగతనంగా నేను,మా మావయ్య,పెదనాన్న కొడుకులు సిగరెట్ తాగేవాళ్లం అక్కడే..
ఆ తర్వా గల్సన్ దొర బంగళా..
మల్లావారి మిల్లు..
ఓ మైలు దూరం దాటాక ఏనుగు మర్రి చెట్టు..
మరి కాస్త ముందుకి పోయాక పొలాల,కొండల మధ్య పాతాళేశ్వరుడి కోవెల..శివరాత్రి జాగారాలు..లేత కొబ్బరి చిప్పలు...
హమ్మయ్య..
స్టేషనొచ్చేసింది .
కొబ్బరి కాయల ఎగుమతి లారీలు కనపడుతున్నాయి.
దాదాపు ఏభైయేళ్ల పైచిలుకే..
బాగా మారిపోయి ఉంటుంది..నాగరికతని ఒంటబట్టించుకొని..
(మిత్రులు సత్యవోలు వారి రిక్షా పోస్ట్ కి గంగరాజు గారి జట్కా స్పందన)
Comments
Post a Comment