*తగినశాస్తి*
* *********
రొప్పుకుంటూ యాక్టివా అప్పెక్కిస్తున్నాను.
చిరుజల్లులో కూడా చెమటపడుతోంది.
దీనమ్మక్కడుపుమాడ..
ఎంతబరువుంది!
దానిమీద మన యెనభైకేజీల బరు వు పడేసి స్వారీ చేస్తుంటే తెలీదు గానీ..ఖర్మ చాలక పెట్రోల్ లేనప్పుడో,రిపేరుకో తీసికెళ్లాలంటే మన బోటి సున్నితకాయులకి ఇబ్బందే.
అసలీ అవస్థకి కారణం నేనే.
నిన్న పొద్దున్న సామాను తెస్తూ సీటుకింద డిక్కీలో పెట్టి,ఇంటి కొచ్చాక సామాను తీస్తూ, తాళం అక్కడే మరిచి పోయాను...
నాపార్కింగ్ లో అడ్డదిడ్డంగా పెట్టిన బైకు వాడ్ని తిట్టుకుంటూ.
రాత్రి వరకూ గుర్తు రాలేదు.
అప్పుడు కీ హాంగర్ లో చూసి కిందకి పరిగెట్టాను.
ఇంతకు ముందుకూడా ఇలాగే రెండు సార్లు జరిగింది.
లక్కీగా దొరికాయి అప్పుడు.
నిన్న మాత్రం ఎంత వెతికినా కనపడలేదు.
అప్పటికీ సొసైటీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను.
తెల్లారి ఇప్పటిదాకా జవాబు లేదు.
మరిహ లాభం లేదని మా సొసైటీకి దగ్గర్లో వున్న యాక్టివా షోరూం కి తీసికెళ్లి ,కొత్త లాక్ వేయించాలనిడిసైడ్ అయ్యాను.
అదీ కథ.
ఎలాగో ముక్కుతూ,మూలుగుతూ పదికల్లా చేరి ఇనపజంతువుని,మెకానిక్ చేతిలో పడేసి 'హమ్మయ్య' అనుకున్నాను.
గంటలో కొత్తలాక్ బిగించి
బిల్ చేతిలో పెట్టాడు.
లాక్ ఐదువందలు,సర్వీస్ఛార్జి, జిఎస్టీ,గాడిద గుడ్డూ,కంకరపీసు అన్నీ కలిపి తొమ్మి వందలైంది.
దాదాపు ఎనిమిది లీటర్ల పెట్రోలు ధర..
మరో రెండు వందలు కలుపుతే గ్యాస్ బండ ధర..
గూగుల్ పే చేసి బయటపడ్డాను- 'చేసుకున్న బ్రామ్మడా అనుభవించు.'
సొసైటీ గేటులోకి బండి తిప్పగానే వాచ్మన్ లచ్చయ్య పరిగెట్టుకుంటూ వచ్చి -
"సార్..మీ బండి తాళాలు..బండికే మరిచిపోయారు..నిన్న రాత్రి చూసి,మీరు వస్తే ఇద్దామని ఉంచాను.మీరు కనపడలేదు.... "
ఏదో చెప్తున్నాడింకా. నాకేం వినపడలేదు.
Comments
Post a Comment