పాపం
@@@@
" ఎప్పట్నించో నెత్తి కొట్టుకుని చెప్తున్నా..వింటే కదా...నా మాటకి విలువెక్కడేడిసింది.
ఉన్న నాలుగు గుడ్డముక్కలూ దాని పొట్టన పెట్టుకున్నాక యిహ దేవతా వస్త్రాలే కట్టుకోవాలి.
అప్పటిగ్గానీ బుద్ధి రాదు పెద్దమనిషికి...
పైగా జాలొకటి..చంపితే పాపం అనుకుంటే బోను పెట్టొచ్చుగా.
ఆ ఎదరింటి దిబ్బ వర్ధనమ్మ దుక్క కొడుకు పెద్ద బోన్లో రోజుకో ఎలక ని పట్డుకుని పొద్దున్నే వీధి కడుగుతున్నప్పుడు కనపడతాడు.
అదీలేదు.
నా ఖర్మ"
తెల్లారిన దగ్గర్నుంచీ కళ్లు వూడి కిందపడిపోయేలా ఆ మొబైల్లో దూరిపోయి మరేమీ పట్టనట్టు వుంటే ఎలా??..."భార్య
సణుగుడు భరించలేక బయటకు నడిచాడు శర్మ.
కందపద్య సమస్యా పూరణం చూస్తున్న శర్మ కి
ఎలుక అడ్డుపడింది.
టామ్ అండ్ జెర్రీ ల అల్లరి
తన జీవితం లో ప్రవేశించింది.
నిజంగానే ఇంట్లో ఎలకల ఉత్పాతం ఎక్కువయింది.
బొత్తిగా భయం లేకుండా కళ్లముందు తిరిగేస్తునాయి.
గేసుపొయ్యి చుట్టూ,దేవుడు మందిరంలో పాల గ్లాసు మీదకి ఎగబడుతునాయి.
అల్మరా లో బట్టలు కొరికి పాడు చేస్తాయని భయం.
పిల్లిని పెంచాలంటే చిరాకు.
దాంతో మరికొన్ని సమస్యలు.
తనకి మందు పెట్టడం ఇష్టం లేదు.
చూస్తూ నిండు ప్రాణాలు తీయలేడు.
పాపభీతి...
అయినా తప్పదు.
భార్య సణుగుడు భరించలేడు.
రెండు రోజులై మందు పెట్టమని చెప్తున్నా తనే తాత్సారం చేస్తునాడు.
ఇవాళ తప్పదు.
బజారులో అంతా కరోనా భయం లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తునారు.
మాస్కులు లేకుండా కొందరుంటే,వున్న మాస్కుల్ని కిందకి లాగి ఫోనులో గంటల తరబడి మాట్లాడుతున్నారు.
ట్రాఫిక్ విపరీతంగా వుంది.
దుకాణం లో 'రాట్ కిల్' తీసుకుని మళ్లీ ఇంటి కొచ్చాడు.
చిన్న చిన్న ముక్కలు గా వాటిని విడగొట్టి, మూలల్లో పెట్టాడు.
అయితే వాటికి నీరు అందుబాటులో వుంచకూడదని దుకాణం వాడు చెప్పాడు.
అవి తిన్నాక వాటికి బాగా దాహం వేస్తుందట.
నీరు వెతుకుతూ బయటకుపోయి ఎక్కడో చస్తాయని చెప్పాడు.
మూషిక సంహార ప్రక్రియ కోసం పూర్వరంగాన్ని విజయవంతంగా ముగించి ,శుభ్రంగా చేతులు కడుక్కున్నాడు.
జరిగిందంతా చూస్తున్న మిసెస్ శర్మ
సణుగుడు తగ్గింది.
ఆ రాత్రి ఎలకలు రోజూ కన్నా ఎక్కువ అల్లర చేసాయి.
@@@@@
తెల్లవారింది.
నిద్ర లేచాడు శర్మ.
భార్య అలికిడి లేదు. బహుశా స్నానానికి వెళ్లుంటుంది.
నిన్న పెట్టిన ముక్కలు ఎలకలు తిన్నాయా!
చెక్ చేద్దామని వంటింటి వేపు నడిచాడు.
హాల్లోకి అడుగు వేయబోతూ,తుళ్లిపడి ఆగి,అడుగు వెనక్కి తీసుకున్నాడు.
ఎదురుగా తెల్లని టైల్స్ మీద నల్లగా చిన్న ఎలకపిల్ల..
నెమ్మదిగా కదులుతూ...
అక్కడక్కడే తిరుగుతుంది..
అలికిడి కి కూడా బెదరకుండా చుట్టూ ఒకే ప్రదేశంలో గిరికీలు కొడుతోంది.
ఉన్నట్టుండి వెల్లకిలా పడి పొర్లసాగింది.
తిరపతిలో గర్భగుడి చుట్టూ పొర్లు దణ్ణాలు పెట్టే భక్తులు గుర్తు కొచ్చారు.
మరణ యాతనా...
దాహమా...
శర్మలో పశ్చాత్తాపం..
తనకేం అధికారం వుంది..దాని ప్రాణం తీయడానికి?
హి హు గివ్స్ లైఫ్ కెన్ ఓన్లీ టేక్ లైఫ్..
మరి అలా చూడటం దుర్భరంగా వుంది.
చీపురు తో మెల్లిగా కదుపుతూ వీధి ద్వారం దాకా తీసుకుని వెళ్లాడు.
అక్కడ ఎదురుగా పూలకుండీ లో దాన్ని జాగ్రత్తగా చేర్చి, మగ్ తో నీళ్లు తెచ్చి పోసాడు.
బాత్రూం తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించగానే గబగబ ఇంట్లోకి వచ్చి తలుపు వేసాడు.
" ఎలకల సందడి తగ్గినట్టుందే" భార్య మాటలకు, 'అవునవు'నంటూ తలూపాడు శర్మ.
@@@@
మర్నాడు కళ్లు మూసుకొని జపం చేసుకుంటున్న శర్మ "టప్ "మన్న చప్పుడు విని కళ్లు తెరిచి చూసాడు.
ఎదురుగా పాలగ్లాసు అంచు మీదకు రెండు చేతులు పెట్టి-"లివ్ అండ్ లెట్ లివ్" అన్నట్టు చూస్తున్న ఎలుకపిల్ల.
.
Comments
Post a Comment