#అమ్మతనం

శ్రీమతి తమిరిశ జానకి గారి సౌజన్యంతో భావుక నిర్వహించిన2023 సంక్రాంతి కథల పోటీలో వెయ్యి రూపాయల బహుమతి గెలుచుకున్న నా కథ.

#అమ్మతనం
@@@@@ 

     "బండి బెల్ అయ్యాక వస్తాను. ఇక్కడ కూర్చోండమ్మా." అని బెంచీ చూపించి లగేజ్ నా పక్కనే పెట్టి వెళ్లి పోయాడు రైల్వే కూలీ. ప్లాట్ ఫాం మీద ఉరకలూ పరుగులతో ఉన్న జనాల్ని చూస్తూ కూర్చున్నాను. 
ఏదో ట్రెయిన్ రాబోతున్నట్టుంది ప్లాట్ ఫాం మీదకు.

     అయిదు నిముషాలనంతరం ఒకావిడ వచ్చి నా పక్కన కూర్చుంది. ఆవిడ తో పాటు ఒకబ్బాయి, అమ్మాయి కూడా వచ్చి ఆవిడ పక్కనే నిలబడ్డారు. 

     "తల్లీ, మీకు ఆఫీస్ టైమైపోతుందేమో వెళ్ళి పోండి. నేను కూలీని మాట్లాడుకుని రైలెక్కేస్తాను." అంది ఆవిడ ఆ అమ్మాయి నుద్దేశించి.

     "ఫర్వాలేదత్తయ్యా. మిమ్మల్ని ట్రెయిన్ ఎక్కించే వెళ్తాం." అంది ఆ అమ్మాయి.

     "అరగంట ఆలస్యమైనా ఫర్వాలేదమ్మా. ట్రెయినొచ్చాకే మేం వెళ్తాం." అన్నాడు అబ్బాయి. 

     వారి మాటలని బట్టి వాళ్ళు ఈవిడ కొడుకు కోడలు అని గ్రహించాను. వారి మాటలు వీనులకు అమృత తుల్యంగా తోచాయి.

     "మాకు ఆఫీస్ టైమైపోతోందమ్మా. కూలీని మాట్లాడేను. రైలెక్కించేస్తాడు." స్టేషన్ దగ్గర నన్ను దించేసి కారు స్టార్ట్ చేస్తూ చైతూ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. కోడలు అతడి పక్కనే ఉంది. 'చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ!' అనుకున్నాను.

     "అమ్మా, రైల్లో తినడానికి ఏమైనా పళ్ళు తెమ్మంటావా?" ఆమె నడుగుతున్నాడు అబ్బాయి.

     "మరేమీ వద్దు నాన్నా. కోడలు ఏవేవో పేక్ చేసి పెట్టింది తినడానికి." అంది ఆవిడ పక్కనే నిలబడిన కోడలి చేతినందుకుని. సభ్యత, సంస్కారం అనేవి మానవులకు ఆభరణాల్లాంటివి. వాటిని ప్రోది చేసుకున్న ఆ వ్యక్తులకు మనసులోనే జేజేలు తెల్పుకున్నా. వారి ఆత్మీయ పలుకులు మనసులో తీవ్రమైన అలజడి సృష్టిస్తున్నాయి. పరస్పర విరుద్ధ భావాలు కలిగిన ఇద్దరు పుత్రులను స్వల్ప వ్యవధిలో దర్శించుకున్నాను.

     ఆవిడ ఎక్క వలసిన ట్రెయిన్ వస్తున్నట్టు అనౌన్స్ చేశారు. బోగీ నెంబర్లు పెట్టేరు. ఆవిడ లేచింది బోగీ వచ్చే చోటుకు చేరడానికి. ఆమె సూట్ కేస్ ఆ అబ్బాయి పట్టుకుని ముందు నడవగా అత్తా కోడలు అతడి ననుసరించారు. వెళ్లి పోతున్న ఆ ముగ్గురినీ చూస్తూ ఉండిపోయాను కొద్ది క్షణాలు మైమరచి.

     తాను అనుభవించ లేనివి ఎదుటి వారు అనుభవిస్తూంటే చూసి సంతోషించడం కాకుండా సహించలేక పోవడం సామాన్య మానవుని సహజ స్వభావమేమో! ఆ క్షణంలో నేను సామాన్య మనిషినే అయిపోయాను. జీవితంలో అమూల్యమైన దేదో కోల్పోయిన భావన మళ్ళీ ప్రవేశించింది మస్తిష్కంలో. పొరపాటు ఎక్కడ జరిగింది? అప్పుడప్పుడు ఎదురొచ్చే ప్రశ్నే ఇది! మళ్ళీ వేధించడం ప్రారంభించింది. గత స్మృతులు వెంటాడడం ప్రారంభించాయి.

                               ***.   ***.  ***

     పార్వతీపురం అగ్రహారం వీధిలో మా కుటుంబానికి మంచి పేరే ఉండేది.  నాన్నగారు ప్లీడరు గుమాస్తా గా చేసే వారు. సంపాదన అంతంత మాత్రమే అయినా ప్లీడరు గారి సౌజన్యంతో ఏ ఇబ్బందులూ లేకుండా ఉండే వారం. మా కుటుంబాన్ని ఆయన ఆదుకున్న సందర్భాలెన్నో! వారమ్మాయి జానకితో సమానంగా నన్ను చూసుకునే వారు. నేనొక్కర్తినే సంతానం కావడం తో ఇంట్లో అల్లారుముద్దుగా పెరిగాను.

     ఇంటర్మీడియట్ పరీక్షలో స్కూల్ ఫస్ట్ వచ్చాను. జానకి కి కూడా ఫస్ట్ క్లాస్ వచ్చింది. ప్లీడరు గారి ప్రోద్బలంతో విశాఖపట్నం లో డిగ్రీ చదువుకి అడ్మిటయ్యాను జానకితో పాటు. ఇద్దరిదీ హాస్టల్ లోనే బస. పండగలకి ఇంట్లో చేసిన పిండివంటలు తెచ్చే వారు నాన్న ఇద్దరికీ. కొత్త బట్టలు ప్లీడరు గారు కొని పంపేవారు. ప్రతీ వ్యక్తి జీవితంలోనూ దీపం పెట్టి తలచుకోవలసిన వారు కొందరుంటారు. నాకు విద్యా ప్రదాత అయిన ప్లీడరు గారు అటువంటి వారే!

                ***       ***.      ***

     నేనెక్కవలసిన ట్రెయిన్ అనౌన్స్మెంట్ అవ్వడంతో వాస్తవం లోనికొచ్చాను. హడావుడిగా కూలీ వచ్చాడు. ప్లాట్ ఫాం ని కుదిపేస్తూ ట్రెయిన్ వచ్చింది. అంతవరకూ స్తబ్దుగా ఉన్న ప్లాట్ ఫాం కదిపిన తేనె తుట్టెలా అయింది.

     బెర్త్ కింద సూట్ కేస్, బేగూ సర్దేసి డబ్బులు తీసుకుని కూలీ వెళ్లి పోయాడు. చల్లగా ఉన్న సెకెండ్ ఏసీ బోగీ చెమటలు పట్టి ఉన్న శరీరానికి కాస్త హాయి కలిగించింది. కిటికీ పక్కనే నా సీటు. ఎదట ఒక బాబు, తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. పిల్లడికి రెండు మూడేళ్ళు ఉంటాయేమో! తెల్లగా, బొద్దుగా నవ్వితే సొట్ట పడుతున్న బుగ్గలతో ముద్దొస్తున్నాడు. అతడు చేసే చిలిపి చేష్టలకి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. 

     చిన్నప్పుడు చైతూ కూడా ఈ బాబు లాగానే ఉండేవాడు. అయితే, తను మాత్రం ఈ తల్లి లా ఉండేదా?  ఆలోచనలు పక్క త్రోవ పట్టకుండా ఉండడానికి బేగ్ లోంచి పుస్తకం తీశాను చదువుకోడానికి. పేజీలు తిరగేస్తున్నాను కానీ దాని లోని విషయాలు బుర్రకెక్కడం లేదు. 

     ఏదో స్టేషన్ వచ్చినట్టుంది. ట్రెయిన్ ఆగింది. నా పక్క సీట్లోకి ఒకావిడ వచ్చి చేరింది. ఆవిడ కొడుకు కాబోలు. జాగ్రత్తలు చెప్తున్నాడు తల్లికి. మనం దేనినైతే దరిచేరనీయ కూడదనుకుంటామో అదే సన్నిహిత మవ్వడం, వేటిని వినకూడదనుకుంటామో, వాటినే వినేలా చెయ్యడం విధి చేసే విచిత్రాలు కాబోలు! అవాంఛిత పరిస్థితులే తారస పడుతున్నాయి నాకు. వాటర్ బాటిల్లో నీరు కొంచెం గొంతులో పోసుకుని దిండుకి చారబడ్డాను. పక్కన కూర్చున్నావిడ పై బెర్త్ కెళ్ళి పోయింది. ట్రెయిన్ కదిలింది. కళ్ళు మూసుకుని బెర్త్ మీద విశ్రమించాను. ఆలోచనల సుడిగుండాలు మళ్ళీ చుట్టుముట్టాయి నన్ను. 

          ***           ***.         ***

     డిగ్రీ పూర్తయ్యాక ఇద్దరం ఎమ్యే చేశాం. ఇద్దరికీ పెళ్ళిళ్ళు జరిగేయ్. సౌజన్యం ప్లీడరు గారిదే! అదృష్టదేవత అనురాగ మూర్తి యైన భర్తను ప్రసాదించింది. మాధవ్ ఒక జాతీయ బేంక్ లో ఆఫీసరు. మామగారు లేరు. అమ్మలా చూసుకునే అత్తగారు కొంత కాలం మాత్రమే ఉన్నారు. చైతూ పుట్టే సరికి పరమపదించారు. మనవడిని చూడాలని ఆరాట పడేవారు. పాపం, ఆ కోరిక తీరకుండానే పోయారు. అమ్మా నాన్నా కూడా చైతూని చూడలేకపోయారు. పెద్దవాళ్ళెవరూ లేకపోవడంతో పసిబిడ్డ చైతూని చూడడానికి ఆయాని పెట్టుకున్నాం. నేను వేసిన తప్పటడుగు అదే అని ఇప్పుడనిపిస్తూ ఉంటుంది.

     ఇంట్లో ఖాళీగా కూర్చోవడమెందుకని కాలేజీలో లెక్చరర్ గా చేరేను. నేను ఏది కోరినా మాధవ్ కాదనే వాడు కాదు. నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పడం అంటే ఇష్టం. జానకికి అర్ధం కాని పాఠాలు హాస్టల్ గదిలో విపులంగా చెప్పే దానిని. 'నువ్వు లెక్చరర్ గా బాగా రాణించగలవు సుమీ!' అనేది మెచ్చుకోలుగా. 'అమ్మగా రాణించ లేవు!' అని మాత్రం కనిపెట్టలేకపోయింది!

     నాకు ఉద్యోగం మీద ఆసక్తి ఎక్కువైపోయింది. ప్రిన్సిపాల్ గా ప్రమోషన్ వచ్చింది. మాధవ్ కి కూడా ప్రమోషన్ లొచ్చాయి. చైతూ చదువులో రాణిస్తున్నాడు. అతడి బాధ్యతంతా ఆయా చూసుకుంటోంది. 

     మాధవ్ అభిరుచి కి తగ్గట్టుగా చక్కటి ఇల్లు కట్టుకున్నాం. 'చాక్లెట్ ముక్కలా ఉంది!' అంటూ గృహప్రవేశం కొచ్చిన అతిథులు ప్రశంసిస్తూ ఉంటే మాధవ్ ని అభిమానంగా చూస్తూ మురిసిపోయాను. మారుతిని అమ్మేసి బీయెమ్ డబ్ల్యూ కొనుక్కున్నాం.

     చైతూ ఖరగ్ పూర్ ఐఐటీ లో చేరేడు. విశాలమైన తారు రోడ్డు మీద చక్కని కారు ప్రయాణం లా సాగుతోంది జీవితం. ఇంటి పనులన్నీ ఆయాకి ధారా దత్తం చేసేశాను.

     అంత అందమైన జీవితానికి నేను అర్హురాలను కాదనుకున్నాడేమో భగవంతుడు! సరిచేసుకోలేని విఘాతం కలిగించాడు నా జీవన యానానికి! 

     సూర్యుడు కనిపించని దినం దుర్దినం అంటారు! ఆరోజు నాకు బాగా గుర్తు! నేను మర్చిపోలేని రోజు! ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నన్ను కాలేజీ దగ్గర దించి ఏదో ఊరు కేంప్ కి బయలుదేరాడు మాధవ్ కారులో. మాధవ్ తో చేసే చివరి ప్రయాణం ఆ మాత్రమే అనుకోలేదు నేను. మార్గమధ్యంలో ఏక్సిడెంట్ లో మృతి చెందేడు మాధవ్. లోకమంతా చీకటైపోయినట్టనిపించింది నాకు. కోలు కోవడానికి చాలా కాలం పట్టింది.

     చైతూ చదువై పోయింది. మంచి ఉద్యోగం వచ్చింది. తనతో కలిసి పని చేసే గుజరాతీ అమ్మాయి ని పెళ్లి చేసుకున్నాడు నా ప్రమేయం లేకుండానే.

     ఏది కావాలనుకున్నా ఆయాతో చెప్పడం వాడితో పాటు కోడలికి కూడా అలవాటైపోయింది. ఉద్యోగ విరమణ చేసిన నేను ఇంట్లో ఉత్సవ విగ్రహం లా మిగిలిపోయాను. నా పెన్షన్, మాధవ్ పెన్షన్, బేంక్ లో ఉన్న రిటైర్మెంట్ సొమ్మూ - ఆర్ధికంగా పై మెట్టు మీద నిలబెట్టినా ఒంటరితనంతో అట్టడుగునే అలమటిస్తున్నాననే భావనకి సాంత్వనం కలిగించే వారే కరువయ్యారు. మళ్ళీ పార్వతీ పురం అగ్రహారం వీధికి పారిపోతే సాంత్వనం కలుగుతుందేమో ననే ఆలోచన ఈ మధ్యనే మనసులో పారాడడం ప్రారంభమైంది. కొడుకూ కోడలికి ఎటువంటి అభ్యంతరమూ ఉండదని వారి చేష్టలే చెప్తున్నాయి.

     ఆ ఆలోచనని అమలు చేసే ముందు తిరుపతి వెళ్ళి రావాలనిపించింది.  నాన్న అనే వారు! "ఏ ఇబ్బంది వచ్చినా స్వామిని తలచుకో! ఏదో మార్గం చూపుతాడు." అని. అదే ఇప్పటి ప్రయాణానికి కారణం. తిరుపతి నుండి వచ్చేక ఆయాని పిల్లల వద్ద వదిలి పార్వతీపురం వెళ్ళిపోవాలనే నిశ్చయించుకున్నాను.

          ***.         ***           ***

     టికెట్ చెక్ చెయ్యడానికి వచ్చిన టీ.సీ. పిలుపుతో తెగిన స్ప్రింగులా వాస్తవంలో కొచ్చాను! అతడు టికెట్  చెక్ చేస్తూండగా హటాత్తుగా పెద్ద శబ్దం విన వచ్చింది. ఒళ్ళంతా, బోగీతో సహ గిరగిర తిరగబడుతున్నట్టనిపించింది. పాసింజర్ల హాహాకారాల మధ్య బోగీ పల్టీలు కొడుతోంది. కళ్ళు మూతలు పడ్డాయి.

          ***           ***           ***

     కళ్ళు తెరిచి చూసే సరికి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాను. బండి పట్టాలు తప్పిందని, చాలా మంది చనిపోయారని, నేను కూర్చున్న బోగీయే బాగా ఎఫెక్ట్ అయిందని పక్క బెడ్ల మీద ఉన్న వారి మాటల్లో గ్రహించాను. ఒక రోజంతా నేను కోమాలో ఉన్నానట! నర్స్ చెప్తే తెలిసింది. 

     అదృష్ట దేవత కరుణా కటాక్షం ఇంకా పిసరంత ఉన్నట్టుంది నా పైన. పెద్దగా గాయాలేవీ తగల్లేదు నాకు. కేవలం షాక్ వలన కోమాలోకెళ్ళిపోయానట!

     నా ఎదుట బెర్త్ మీద కూర్చున్న వారి కోసం ఆతృతగా బెడ్లని పరికించాను. బాబు మాత్రమే కనిపించాడు నా పక్క బెడ్ మీదనే! అమ్మా నాన్నా చనిపోయారట! అభం శుభం తెలియని ప్రాణి! అమాయకంగా నన్నే చూస్తున్నాడు! అతడి కోసం ఎవ్వరూ రాలేదట. 'అతడికెవరూ లేనట్టున్నారు.' అంది నర్స్ నిర్లిప్తంగా.

     అతడి చూపులు చూస్తూంటే నన్ను పోల్చుకున్నట్టే ఉన్నాడనిపించింది. బెడ్ మీద నుండి లేచి వెళ్ళి ఆప్యాయంగా తల నిమిరేను.

     "ఎవరూ లేకపోవడం ఏమిటి? కమ్మని అమ్మతనం పంచడానికి నేనున్నాను!' అనుకుని బాబుని అక్కున చేర్చుకున్నాను.

                    @@@@@@@@@@

Comments