నేను..నా పనస పొట్టు

నేనూ-పనసపొట్టు

@@@@@@@@@

పనసకాయ దొరికితే,తద్దినం పెట్టమన్నారు శాస్త్రకారులు.

పూర్వం బెంగాల్ లో ఉన్నప్పుడు చుట్టు పక్కల దాదాపు అందరిళ్లలోను పనస కాయలుండేవి.
అడిగినా అడక్కపోయినా కాయలు,తొనలు ఇచ్చేవారు.
తొనలు తినలేక మళ్లీ దానాలు కూడా చేసిన రోజులున్నాయి.
ప్రస్తుతానికొస్తే,
ఇక్కడ భాగ్యనగరం లో ప్రతీది దొరుకుతుంది.
పనసపొట్టు కూడా ఎక్కడెక్కడో లభిస్తుందట.
కానీ దానికోసం 'పెన్నీవైజ్ పౌండ్ ఫూలిష్' లా నగరం లో వెతుక్కోవాలి.
అంచేత ఇక్కడకొచ్చాక పనసకాయ మరిచిపోయామనే చెప్పవచ్చు.
అకస్మాత్తుగా మొన్న వాట్సాప్ లో మా బంధువులమ్మాయి పనసకాయ కూర ,పొట్టు దొరికే చోటు వివరాలు చెప్పడం..దరిమిలా తరచి వివరాలు అడగటం జరిగింది.
మరో వారంరోజులకే మా ఇద్దరి కామన్ బంధువు గృహ ప్రవేశంలో కలవటం..మళ్లీ అక్కడ పనస పురాణం...
విచిత్రంగా వారం రోజులకే మరో కామన్ బంధువుల గృహప్రవేశం లో మళ్లీ కలిసినప్పుడు సర్ప్రైజ్ బహుమతి లా పనసపొట్టు ఒక కవర్లో పెట్టి తెచ్చి నాకిచ్చిందా సోదరి.
అప్రతిభుడనయ్యాను.
పనసపొట్టు ఆవ కూర కళ్లముందు కళకళలాడుతూ కనిపించింది.
ఆమెకెవరో పనస కాయ ఇస్తే ఓపిగ్గా తొక్కతీసి,ముక్కలు తరిగి మిక్సీ పట్టి పొట్టు రెడీచేసి నాలాంటి బాధితులకు సరఫరా చేసిందని చెప్పింది.
బళ్లతో ధన్యవాదాలు చెప్పి
అక్కడి వేడుక ముగిసాక,బోయినాలయ్యాక ,వాళ్లిచ్చిన తిరుగు బహుమతులు(రిటర్న్ గిఫ్ట్) తోపాటు,ప.పొ.ను పట్టుకుని కేబ్ లో ఇంటికొచ్చి పడ్డాం.
దారిలో ట్రాఫిక్ జాం..ఎండ వేడి..భుక్తాయాసం..
ఇంటికి రాగానే హడావుడి గా బట్టలు మార్చి, స్నానించి ' హమ్మయ్య' అనుకుని కాస్త నడుం సాగదీసాం.
ఆ సందట్లో ప.పొ.ని మరచి పోయాం.
తెల్లారి వంటలో పడే ముందు గుర్తొచ్చి చూసేసరికి-
పనసపొట్టంతా ఫ్రిజ్ లో పెట్టకపోవడం వల్ల పాడైపోయి నీరు చిమ్మింది
నా ఆశలాగే.

Comments