ఒకశకం అంతరించింది.
రంగుల కల కరిగిపోయింది.
పదమూడేళ్లుగా అలరిస్తున్న మా ఎల్జీ రంగుల టీవీ మూగనోము పట్టింది.
కొన్న దగ్గర్నుంచీ ఒక్క నాడైనా జర్రున చీదెరగదు.
ఒక పైసా రిపేరు చేయాల్సిన అవసరం కల్పించలేదు.
బహుశా రెండువేల తొమ్మిదిలోనో పది లోనో ఆరువేలకి కొన్నాను.
అంతకు ముందు కొన్న బిపిఎల్ టివీ తో చాలాబాధలు పడ్డాను.
అప్పట్లో పరిచయమైన మెకానిక్ ని వెంటతీసుకుని మరీ వెళ్లి ఈ టీవీ కొన్నాను.
అప్పటికే ఎల్సీడీ టీవిలు వచ్చాయి.షాపాయాన అదే తీసుకోమని సలహా ఇచ్చినప్పటికీ మా మెకానిక్ 'వద్దని..వాటి మెకానిజం తనకు తెలియదని' అనడంతో భవిష్యత్తు నాలోచించి పాత మోడల్ బాక్సు టీవీనే తీసుకున్నాను.
ఆరేళ్ల తర్వాత రిటైర్ అయ్యాక ఇక్కడికి వస్తున్నప్పుడు షిఫ్టింగ్లో ఏమైందో మరి ఆన్ చేసాక బొమ్మ కనపడలేదు.
మెకానిక్ వచ్చిచూసి లోపల లాక్ అయిందని నిమిషంలో సరిచేసి మూడు వందలు తీసుకు పోయాడు.
ఆ తర్వాత ఇప్పటి వరకు అంటే మరో ఏడేళ్లు అప్రతిహతంగా పనిచేసి...హఠాత్తుగా పదవీవిరమణ కు ఇవాళసిద్ధమైంది.
మా ఇంటికొచ్చిన వారంతా దీన్ని చూసి "మీరింకా పాతరాతి యుగంలో నే ఉన్నారా..స్మార్ట్ టీవి ఎప్పుడు కొందామని ఇంకా..." అంటూ వ్యంగ్యం గా దెప్పిపొడిచేవారు.
"ఇదింకా నడుస్తోందిగా..అంటూ దాటవేసేవాణ్ణి".
నిజానికి మాఇంట్లో టీవీ చూడడం తక్కువే.
మా ఆవిడ బెంగాల్ చదువులు..హిందీమీడియం వల్ల తెలుగు ప్రొగ్రామ్లేవీ చూడదు.
ఏవో హిందీ సీరియళ్లు..పాటలు తప్ప సినిమాల ఇంట్రెస్ట్ ఇద్దరికీ లేదు.
ఇపుడు ఇంట్లో ఉండేదీ ఇద్దరమే.
ఆవిడ ఆన్లైన్ భాగవత,రామాయణ క్లాసులు..నేను నా వ్యాపకాలు..
అసలు సమస్య టీవీ మూగనోము పట్టాక వచ్చింది.
కొత్తది కొనడం మాట దేవుడెరుగు ఉన్నదానిని వదుల్చుకోవడం ఎలా?
పోనీ రిపేర్ చేయిద్దామమన్నా ఒక్కడూ దొరకడు.
ఖరగ్పూర్ లో కాల్ వేటు దూరంలో డోలూ గాడు..అతగాడిపేరు దొలాయి పాత్రొ...మా ఆస్థాన మెకానిక్...
ఈ భాగ్యనగరం లో ఎవర్ని పట్టుకోవడం..
బజార్లో కనపడ్డ ఒకరి ఇద్దరిని అడుగుతే పెదవి విరిచి-
"హబ్బే..పాత టీవి పార్ట్స్ దొరకవండి..ఇప్పుడంతా ఎల్యీడీ ,స్మార్ట్ టీవీలే.మార్చేయండి..యూజ్ అండ్ థ్రో నడుస్తుంది!."
అని చప్పరించీ గానే మరెవర్నీ అడక్కుండా ఇంటి కొచ్చేసాను.
మా ఆవిడ రోజూ గోల..
పనిచెయ్యని వస్తువు ఇంట్లో ఉంచదావిడ.
స్క్రాప్ వాడికి ఇద్దామని అడిగితే వంద రుపాయలిస్తానన్నాడు.
వారం గడిచిపోయింది.. గోల ఎక్కువవుతోంది.
మా వాచ్మన్ని అడిగాను..
ఐదారువందలలో రిపేరు చేస్తే తీసుకుంటావా అనడిగితే-
" మావోల్లు ఇస్మార్ట్ టివి కొన్నారండి!" అన్నాడు.
ఫ్రీగా ఇచ్చినా ఎవరూ తీసుకునేట్లు లేరు.
వాట్టుడూ?
క్యాకరూం?
అప్పుడు కనపడ్డాడు అపార్ట్మెంట్ చెత్తలు తీసికెడుతున్న అబ్బాయి.
సంగతి చెప్పాను.
నా వేపు చూసి బుర్ర గోక్కుని -
"దీని స్టాండ్ ఉందా..అంటే ఇది పెట్టడానికి టేబుల్ లాటిది. "అన్నాడు.
ఎందుకయినా మంచిదని లేదన్నాను.
మళ్లీ జుత్తు బరబరా గోక్కుని...కాస్సేపు అటూఇటూ చూసి, నా వేపు తిరిగి
" అయితే ఐదువందలివ్వండి!" అన్నాడు.
ఎందుకని అడక్కుండా జేబులోంచి అయిదువందలు తీసి వాడికిచ్చి టీవీ ని వదిలించుకున్నాను.
అయ్యా అదీ సంగతి!
Comments
Post a Comment