నేనూ..నాటకం

నేను..నాటకం
@@@@@@

నేను సహజంగా సభాపిరికిని.

మైకాసురులంటే అబ్బురంగా చూస్తాను.
నేనెప్పుడూ ముఖానికి రంగుపూసుకోలేదు...
హోలీ రంగుల్తప్ప.
అంతంత భారీ డైలాగులు చెప్పే నటులను నిజంగా మెచ్చుకోవాలి.

అయితే 1980 లో ఈనాడులో ఉన్నప్పుడు ఆ ముచ్చట కూడా తీరిపోయింది.

ఈనాడు పుట్టిన రోజు సందర్భంగా మా మేగజైన్ స్టాఫ్ మోడర్న్ సతీసావిత్రి నాటకం వేయాలని నిర్ణయించారు.
కొందరు నటనానుభవం ఉన్నవారే!
నేను మాత్రం ఆడ్ మేన్ ఔట్.

పతిని కోల్పోయిన సావిత్రి దగ్గరకు యముడు రావడం..
వాగ్వాదం..మధ్యలో చిత్ర గుప్తుడు రావడం నాకు మీరిచ్చే జీతం సరిపోలేదు కాబట్టి ఈనాడు లో పార్ట్ టైం జాబ్ చేస్తానని బెదిరించడం..
యముడు ఉగ్రుడై చిత్రగుప్తుడి పై విరుచుకు పడటం..ఇతివృత్తం.
యముడిగా నేటి ప్రముఖ రచయిత, నవ్య సంపాదకుడు శ్రీజగన్నాధ శర్మ..అప్పట్లో పార్వతీపురం నుండి లేతగా వచ్చి మన రాజధానిలో జెండా పాతాలని నిశ్చయం చేసుకుని నిజంగానే కాలక్రమంలో జెండా పాతిన వాడు...
నేను చిత్రగుప్తుడు..

సత్యవంతుడిగా ఎబియస్ ఆనంద్ అనే ఆర్టిస్ట్, సావిత్రి వేషధారిణి పేరు ...గుర్తు లేదు.

మేకప్ అయింది.గుండెలో హౌరామెయిల్ లా పరిగెడుతోంది.
ఛీఫ్ రామోజీ రావు గారు, సతీమణి, మొత్తం స్టాఫ్..
స్టేజి మీదఎదురుగా
డైలాగ్ లేని సత్యవంతుడు సూటుబూటు తో నేలమీదపడి ఉన్నాడు.
నల్ల కళ్లద్దాల సావిత్రి నుదుటిమీద చెయ్యి పెట్టుకుని విలపిస్తూ పోజిస్తోంది.
వై.డి. రాజు బోర్డు మెడలో వేలాడదీసుకున్న యముడు గా శర్మ సహజ రీతిలో విజృంభించి తినేస్తూ నన్ను పిలిచేడు.

కాళ్లు వణుకుతూ..
"ప్రభూ"  అని స్టేజి మీదకు పరి గెట్టేను.
ఏంచెప్పానో..ఎలా చెప్పేనో కూడా తెలియలేదు.
తెరపడ్డాక చప్పట్లకు తెలివి వచ్చింది.
అదే మొదలు..ఆఖరు నా నట జీవితానికి.

Comments