శంఖనాదం

శంఖనాదం
***********
శంఖం!
పేరు వినగానే-
కురుక్షేత్రం.. శంఖం పూరించడం..జెండాపై కపిరాజు లాంటి పద్యాలు
గుర్తొస్తాయి.
పాంచజన్యం, దేవదత్తం,పౌండ్రకం,అనంత విజయం వంటి ఘన శంఖాల గురించి విన్నాం.
శంఖనాదం చాలా బావుంటుంది.
మిత్రులు గంగరాజు గారు శంఖనాదం మీద ఒక కథ వ్రాసిపారేసారు.
బుగ్గలు పూరించి దీర్ఘశంఖనాదం చేసేవాళ్లని చూస్తే ముచ్చట వేస్తుంది.
బెంగాల్లో ప్రతి ఇంట శంఖం ఉంటుంది.
వాళ్లు పొద్దున్న,సాయంత్రం శంఖనాదం తప్పనిసరిగా చేస్తారు.
పిల్లలు,ఆడవాళ్లు కూడా శంఖనాదం చెయ్యడం లో సిద్ధహస్తులు.
దుర్గా పూజల్లో షష్ఠి నుండి దశమి దాకా ప్రతి పెండాల్ లో తరచూ శంఖధ్వనులు వినిపిస్తూ ఉంటాయి.
ఇహపోతే-
నాకు శంఖం ఎలా పట్టుకోవాలో ఊదాలో తెలియదు.
అకస్మాత్తుగా బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినట్లు నాకు శంఖం వాయించడం నేర్చుకోవాలన్న కోరిక పుట్టి అనతికాలంలో నే తీవ్రతరమైంది..రిటైర్ మెంట్ ముందు.
సరే..గుర్రం గుడ్డిదైనా దాణాకి లోపం లేకుండా గోల్ బజార్ కి పోయి శంఖాల దుకాణంలో ఆరాతీసాను.
మూడువందల నుండి వెయ్యి దాకా ఉన్నాయి ధరలు.
ఎందుకేనా మంచిదని ఓ బుల్లి శంఖం మూడువందలకు కొని ఇంటికి తెచ్చాను.
శంఖం చూసి మా అమ్మి చిరునవ్వు నవ్వి- "పాంచజన్యం దొరికిందా!"
అంది.

ఈ విషయం లో  మా అమ్మి తోడ్పాటు చాలా ఉంది.
దైవ భక్తురాలు కదా!
సరే సాధన మొదలైంది.
దుకాణం అబ్బాయి చూపించిన విధంగా రెండుచేతులతో శంఖాన్ని పట్టుకుని మూతిని సున్నాలా చుట్టి,బాగా గాలి లోపలికి పీల్చి శంఖ ద్వారం దగ్గర ఊదాను.
ఫుస్సు మంటూ గాలి పోయింది తప్ప శబ్దం రాలేదు.
మళ్లీ.. మళ్లీ ఊదాను..
పావుగంట గడిచాక బుగ్గలు నొప్పెట్టేయి.
ఇవాళ్టికి సాధన చాలనుకుని ఆపేను.
ఇలారెండు మూడు రోజులు
గడిచింది.
ఊదుడు..నొప్పి తప్ప శబ్ధం ఇల్లె.
జాగ్రత్తగా శంఖాన్ని దేవుడి గుమ్మటం మీద బట్టచుట్టి పెట్టేసాను.
మళ్లీ రిటైర్ అయ్యాక భాగ్యనగర వాసుడి నయ్యాక రోజూ పూజలో కూర్చునే ముందు బట్టలో చుట్టి ఉన్న శంఖం నన్ను చూసి నవ్వుతున్న అనుభూతి కలిగేది.
అంతే..
కఠోరసాధన చేసాను.
మూడు రోజుల బృహత్సాధన తర్వాత కొద్దిపాటి ఈల ధ్వని వెలువడింది.
ఆ ఊపుతో మర్నాటికల్లా విజయవంతమైన శంఖనాదం వెలువడింది.
సాధించాను.
*****
హమ్మయ్య!!!

Comments