బెంగాలీ టిఫిన్

బెంగాలీ టిఫిన్
@@@@@@

"ఏమోయి! ఇవాళ ఆలూచాప్,సింగడా,బెంగాల్ మిఠాయి మలొయ్ చాప్ లేదా రస్మలాయ్  తినాలనుందోయ్.
బెంగాల్ వదిలేసాక మళ్లీ వాటి మొహం చూళ్లేదు కదా!"
అన్నాను. మళ్లీ కాస్త గాప్ ఇచ్చి-
"ఇక్కడ ఎంతసేపు కారప్పూస,చేగోడి, పూతరేకులు, కాజాలు ...
బోరు కొడుతోంది."
అనికూడా అన్నాను.
వంటింట్లో పనిచేసుకుంటూ

"తెప్పిస్తే తినడానికి నాకేం దొబ్బిడాయా!"
అందావిడ జనాంతికంగా.

సరే! ఫోన్ తీసి జోరుగా హుషారుగా బెంగాలీ స్వీట్ షాప్ కి ఆర్ఢర్ పెట్టేసాను.

బెంగాల్లో అల్పాహారానికి మరమరాలు..(మురీ అంటారు అక్కడివారు) అందులో దోసకాయ ముక్కలు,కారప్పూస లాంటి మిక్స్చరు,ఉల్లి,మిర్చి,ఆవనూనె కలిపి ఝాల్ముడి తింటారు. దానికి అనుపానంగా ఆలూ చాప్..అదే ఆలూ బజ్జీ,వెజిటబుల్ చాప్ తింటారు.సింగడాలు అదే సమోసాలు ,కచోడీ..పూరీల్లా ఉంటాయి. వాటిని కూడా దుంపల కూర లేదా చట్నీ తో తింటారు.

స్వీట్లు సరేసరి.

బూంది,లడ్డు,జిలేబీలతో పాటు చెనా(పాల విరుగు)తో చేసే రసగుల్లా,రస్మలయ్,మొలొయ్ చాప్,సొందేశ్,కీర్ కదం,కాలా జామ్ ,మిస్టిదోయ్(తియ్య పెరుగు) వంటివి అద్భుతమైన రుచి తో ఉంటాయి.

బెంగాలీలు ఎక్కువమంది గ్రూపుగా వెళ్లవలసి వచ్చినప్పుడు దూర ప్రయాణాల్లో కూడా మురీలు బస్తాతో తీసుకు వెళతారు.
ఆకలి బాగా ఆపుతుంది

గంట గడవక ముందే వచ్చి మర్యాదగా పేకెట్లు చేతిలో పెట్టి అక్షరాల ఐదువందలు గుంజుకు పోయిండు తెలంగాణ పోరడు.

కాస్త కలుక్కుమన్నా పేకెట్లలో ఉండే తినుబండారాలని తల్చుకుని ఊరట పడ్డాను.

మా ఆమ్మి తెచ్చిన ప్లాస్టిక్ ప్లేట్లలో వచ్చిన పదార్థాలను చేరవేస్తూ వేడిగా ఉన్నాయని గమనించి ఆవిడతో అదే మాట చెప్పాను.

మొత్తం పది సింగడాలు,పది ఆలూ చాపులు రెండు రసమలాయిలు ఉన్నాయి.

అలౌకికానందాంబుధి లో ఓలలాడుతూ,పాత రోజుల్ని
నెమరు వేసుకుంటూ లాగించేక అందావిడ-
'బిల్ ఎంతయిందని'

"హాట్ ఐటెమ్ ఒక్కోటి ఇరవై,స్వీట్ పాతిక..డెలివరి చార్జ్ యాభై."

అన్నాను అదోలెక్క కాదన్నట్టు.

వెంటనే కళ్లు పెద్దవి చేసి-
"దోపిడీ కాకపోతే ఈ మాత్రం టిపిన్ ఐదువందలా...
సెనగపిండి తో ఇంతకన్నా రుచిగా కావల్సినన్ని నేనే చేసి పడేద్దును.డబ్బు కాల్చడంలో  ముందుంటారు మగాళ్లు."
అంటూ పైటకొంగు ఝాడించి తన సామ్రాజ్యం లోకి వెళ్లిపోయింది చక్కా.

హతవిధీ..ఏమిది!!
@@@@

Comments