సెకెండ్ హాండ్
*************
ఈ కాన్సెప్ట్ చిన్నప్పుడే మొదలవుతుంది.
నలుగురున్న ఇంటిలో అన్నల,అక్కల ఇరుకు బట్టలు చిన్న వాళ్లకి ధారాదత్తం చేయబడతాయి.
చికాకనిపించినా ,ఆ వయసుకు మనం చేసేదేం లేదు.
అలాగే పుస్తకాలు..
పెద్దవాళ్లకి కొత్తవి..తమ్ముళ్లకి,చెల్లెళ్లకి సెకెండ్ హాండ్..ఎంత కొత్త అట్టలు వేసి, బైండ్ చేసినా లోపటి సరుకు పాతదే కదా!
ఇహ స్కూలు దాటి కాలేజి మెట్లెక్కే వేళకు నూనూగు మీసాల నూత్న యవ్వన ప్రారంభ దశలో అన్నీ కలర్ఫుల్ గా కనిపిస్తాయి
ప్రతీ పులుగూ మన వేపే చూస్తున్నట్టు,మనమేదో హీరోల మైనట్టు అనిపిస్తుంది.
అప్పుడు నిక్కర్లని ఓ మూల పారేసి,పొడుగు పేంటు(అన్నయ్యదే,సైజ్ చేయించి) దానిలో పొడుగు చేతుల చొక్కా టక్కుచేసి,మళ్లీ దానిని కొంచెం పైకిలాగి,,ఊపిరి బిగపట్టి,చేతులు మీదకి ఎత్తి...కసరత్తు పూర్తయ్యాక అనుకున్న మేరకు పైకి వచ్చిన చొక్కాను నడుము చుట్డూ సర్దుకుని..
అద్దం ముందు వంకీజుత్తులయితే,రింగు శోభన్‌బాబు లా నుదుటిపై పడేటట్టు,సాఫీ జుత్తయితే చేతితో వీలైనంత నొక్కుకుని ,
రుమాలు కనపడేటట్లు జేబులో పెట్టుకుని కించిత్ అసంతృప్తి తో బయటకొచ్చేసరికి కాలేజి టైమవుతుంది.
టైమనగానే వాచీ గుర్తొస్తుంది.
పదోక్లాసునుండి గోల పెడితే కాలేజీ వేళకి బూట్లయితే కొన్నారు (అన్నయ్యవి పట్టక)గాని రిస్టువాచీ బాకీ పెట్టారు.
చివరకు వాచీకూడా అన్నయ్య వాడిన సెకెండ్హాండ్ హెన్రీశాండజ్ వాచే గతయింది.
వాడు కొత్త ఫేవర్లూబా వాచ్ కొనుక్కుని నాకిది ముష్టి లా పడీసేడు.కోపం వచ్చినా చచ్చినట్టు అదే తీసుకున్నాను..అలిగిన. వాడికి అట్టూలెదు,ముక్కాలేదు అంటారు కదా!
నాకు చిన్నప్పుడు కోపం వచ్చినప్పుడు వ్యక్తపరిచే విధానం తిండి మీద చూపించే వాడిని.
కంచంలో వేసినది వేసినట్టుగా తినేసేవాణ్ణి.
ఇష్టమైన కూర కొంచెం వడ్డిస్తే-,'ఇది ఏములకి'
అన్నట్టు గబగబ ఒకే సారి అంతా ఖాళీ చేసేవాడిని.
కంచం చూసి -"అదేవిట్రా నీ కంచం లో కూరేదీ" అనడిగితే-
"ఏమో నాకేం తెలుసు! వెయ్యలేదేమొ" అనేవాణ్ణి.
అమ్మకి అర్ధమై "నాయనమ్మ గాడు" అని గొణుక్కుంటూ మళ్లీ వడ్డించేది.
మా నాయనమ్మ కూడా చిన్న తనం లో అలానే చేసేదిట.
కందిపచ్చడి కొంచెం వేస్తే కోపంతో తీసి విసిరికొట్టేదిట.
జీన్స్ ప్రభావం..ఎక్కడికి పోతుంది!
సరే!ఎలాగో సెకెండ్ హాండ్ వస్తువులతో విద్యార్ధిదశ పూర్తి చేసాక మాత్రం ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాక మాత్రం ఛస్తే సెకెండ్ హాండ్ వస్తువులు కొనకూడదని భీషణ ప్రతిజ్ఞ చేసుకున్నాను.
అంతేకాదు నా పిల్లలకి కూడా సెకెండ్ హేండ్ వస్తువులు సరఫరా చేయకూడదని గట్టిగా అనుకున్నాను.
అలాగే కొత్తసైకిల్,కొత్తవెస్పా,కొత్త పానాసోనిక్ టేప్ రికార్డర్, కొత్తటివి,ఫ్రిజ్,వాషింగ్ మెషీన్
కాలక్రమంలో తీసుకోవటం జరిగింది.
నాకు అమ్మాయి, అబ్బాయి కాబట్టి వాళ్లకి సెకెండ హాండ్ వస్తువులు వాడే ప్రసక్తే లేదు.
ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫేమిలీలు గదా! ఇప్పుడా భయం లేదులెండి.
Comments
Post a Comment