హెల్త్ కాన్షస్

ఫణి గాడు ఫోన్ చేసాడు.
రెండు నెలలకిందట కూడా వాడే ఫోన్ చేసాడు.

ఇద్దరం రిటైరీలమే ..నగరానికి  ఓపక్క కొండాపూర్ లో వాడూ,స్టేషన్ కి దగ్గరగా గాంధీ హాస్పిటల్ దగ్గరగా నేనూ..
ఎప్పుడో జీవితం ఆడిన‌ఫుట్బాల్ ఆటలో చెరోమూలకి విసిరివేయబడ్డ మేమిద్దరం రిటైరయ్యాక అనుకోకుండా ఇక్కడ ఇలా మళ్లీ కలిసాం!
ఇప్పుడు మళ్లీ వాడేతనే ఫోన్ చేసాడు.
నాకో దురలవాటు.నా అంతట నేను ఫోన్ చెయ్యను.ఎవరైనా 
చేస్తే మాత్రం గిల్టీగా ఫీలయి మనస్ఫూర్తిగా మాట్లాడతాను..సారీ కూడా చెప్తాను.
ఇంతకీ ఈ సారి సంబాషణ మీరే వినండి.

"ఏరా!ఎలాగున్నావ్"

"బావున్నాను" 

"ఏం చేస్తున్నావ్"

"ఏదో ఫేస్‌బుక్.. పజిల్..కథలు..."

"ఆరోగ్యం బావుందా? మీ మిసెస్ ఎలా ఉన్నారు'"

"ఇద్దరం బావున్నాం"

"బీపీ,సుగర్ లేవా!"

"దేవుడిదయ వల్ల లేవు'"

" ఇప్పుడెంత నీవయసు..అరవై ఏడేనా..నా వయసే కదా!"

"ఔనంతే"

"అయినా ఫుడ్ విషయం లో జాగ్రత్తగా ఉండాలి. రైస్ తింటున్నావా? బ్రౌన్‌ రైసా?
మిల్లెట్లా!
ఆయిల్ రిఫైన్డ్ వాడకు.గానుగనూనె మంచిది ..మన తాతలనాటి నుండీ వాడేవారం.ఇప్పుడు రిఫైన్డ్..డబల్ రిఫైన్డ్ వచ్చాయి గాని"

వాడుతునానంటే ఫోన్లోనే కొడతాడని భయమేసి-

"సరే" అన్నాను.

"రాత్రి డిన్నర్ లైట్గా రెండు చపాతీలు మంచి నెయ్యి రాసుకుని తిను.బేడ్ కొలెస్ట్రాల్ తరిగిపోతుంది
కూర మాత్రం ఎక్కువ తిను.
వాకింగ్ చెయ్యి "

"అలాగే"

"గానుగ నూనె అక్కడ దొరక్కపోతే నాకు చెప్పు.మాఇంటికెదురుగా మూడు గానుగలున్నాయి. నీకు పంపిస్తాను."

"లేదు.ఇక్కడ దొరుకుతాయి. కనుక్కుంటాను"

"టాటా 1mg యాప్ ఉందా!
ఏడాదికోసారి బ్లడ్ ప్రొఫైల్ కోసం రిక్వెస్ట్ పెట్టు.వాళ్ళు ఇంటికొచ్చి బ్లడ్ తీసుకుని రిపోర్ట్ మెయిల్ చేస్తారు "


"యాప్ ఉంది. సరే అలాగే చేస్తాను"

"మంచి విటమిన్ కోసం యామ్వే ప్రాడక్ట్ వాడు.ఖరీదైనా ,రిజల్ట్ బావుంటుంది.
ఇప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటే చివర్లో ఇబ్బంది ఉండదు."

"ఔను"
అప్పు కాస్త ధైర్యం తెచ్చుకుని,నసుగుతూ-
అవునొరేయ్ ఫేస్బుక్ లో ,యూట్యూబ్ ల్లో కూడా ఫలానాది తినకండి..ఫలానాదే తినకండి అంటుంటారు. జనాలకి అసలు ఏది తినాలో ఏది తినకోడదో తేల్చుకోలేక ఛస్తున్నారు.
పూర్వం ఇన్ని రకాలుండేవా..వాళ్లేది పెడితే అది తినేసేవాళ్లం కదా!అయినా బాగానే ఉన్నాం కదా! మరి అకస్మాత్తుగా యీ ఆహార విహార మార్పులెందుకో !"
అన్నాను.
"ఇప్పుడు జనాలు హెల్త్ కాన్షస్ అయ్యారు. యోగా చేస్తున్నారు. వాకింగ్ తప్పనిసరి.
అప్పటికన్నా రోగాలు ఎక్కువ అయ్యాయి. మందులు పెరిగాయి.డాక్టర్లు..వాళ్లు చెప్పే జాగ్రత్తలు పెరిగాయి.
అయినా మనమంచికే చెప్తున్నప్పుడు వినడానికేం!"

"సరే" అన్నాను.

"మరేంటి విశేషాలు? "
"ఏమున్నాయి"

"ఫ్రూట్స్ ఉదయం తిను.రాత్రుళ్లు తినకూడదు."
"అలాగే"
"సరే.ఉంటాను.నేను చెప్పినవన్నీ మరిచిపోకు."
బై చెప్పి ఫోన్ పెట్టేసాను.
మర్నాడు మళ్లీ ఫోను.
ఫణిగాడి ఫోన్..
వాళ్లబ్బాయి మాట్లాడుతున్నాడు.
"అంకుల్ ! డాడీ మార్నింగ్ వాకింగ్ చేస్తూ పడిపోయారు..కేర్ లో అడ్మిట్ చేసాం..కొలెస్ట్రాల్ ఎక్కువైందిట...."ఇంకా ఏదేదో చెప్తున్నాడు.

Comments