కక్కగట్టు

కక్కగట్టు
*********
ఈ పదం విన్నప్పుడల్లా  మా అమ్మ మహాలక్ష్మి గుర్తువస్తుంది.

ఆవిడకా పదం ఊతపదం.

ప్రతీ మాటకి ముందో వెనకో ఈ పదం ఉండి తీరుతుంది.

"" అవున్రా! ఒరేయ్! కక్కగట్టా! ఇలారా!
అ ముసిలి కక్కగట్టు వచ్చాడా!
వీడమ్మక్కడమాడ...ఇక్కడే పడేసి పోయాడే కక్కగట్టు!
ఇలా ఉంటుంది ఆవిడ ధోరణి.
నాకైతే నిత్యం ఈ పదంతో అష్టోత్తర శతనామాలే!
దానర్ధం మాకు తెలీదు అప్పట్లో!
అదో తిట్టు గా భావించే వాళ్లం..అంతే!

ఆవిడ కాస్త లావు..అదే దిబ్బ గా ఉంటుంది.
అందుకే అక్కడి వారంతా దుక్కపంతులమ్మగోరు /గున్నమ్మ. గోరు అనేవారు. చుట్టుపక్కల అంతా పలాస,శ్రీకాకుళం జనాలే!
'రైల్వేరు' లో ఉద్యోగాలు సేసీవోరు.

తన కాయాన్ని తనే మోయలేక కూర్చోడానికి, లేవడానికీ ఇబ్బంది పడేది.
అయినా వంట తనే చేసేది.
కోడళ్లు కత్తిపీట సహా సామాన్లు,గిన్నెలు తనముందు పెడితే.

మా నాన్న గారొక గంగిగోవు.అయనకి సినిమాలు,రాజేశ్వరరావు పాటల పిచ్చి.బాగా పాడేవారు.

మాట కరుకే గానీ ఆవిడ చెయ్యి పెట్టు గొప్పది.
దయా గుణం హెచ్చు.
తనా,పై అని చూడకుండా పెడుతుంది.

ఇంతకీ యీ కక్కగట్టు తిట్టు 
విన్న మా అమ్మగారి స్నేహితురాలు శ్రీమతి ఆదిభట్ల సర్వ మంగళ గారు.. పెద్ద ద్రావిళ్లు గదా... కాస్త ధాటిగా మాట్లాడే వారు.
" అదేవిటి లక్ష్మీ.. పిల్లణ్ణి కక్కగట్టా అంటావా!
చాలా తప్పు సుమా..అమంగళకరమైన మాట.  కక్కగట్టు అంటే కట్టగట్టు..పాడెకట్టడం..అర్ధమైందా!
ఒరేయ్..ఈసారి మీ అమ్మ నిన్నలా తిడితే నాకు చెప్పు"
అందావిడ.
ఆ తర్వాత మా అమ్మ ఆవిడ ముందు అలా తిట్టకుండా జాగ్రత్త పడింది లెండి.

అంత భారీ మనిషి మానాన్నగారి చివరి రోజుల్లో బెడ్ పక్కనే ఉన్న స్టూల్ మీద గంటల తరబడి హాస్పిటల్ లో ఎలా కూర్చోగలిగిందో మా కర్ధం కాలేదు.తర్వాత మూడేళ్లకి తను కూడా మా నాన్నని చేరుకుంది.

Comments