బాబూ మొషాయ్
***************
ఇదేదో లాటిన్ భాష అనుకునేరు.
ఆనంద్ సినిమాలో రాజేష్ ఖన్నా అమితాబ్ ని 'బాబూమొషాయ్' అని పిలవడం గుర్తు ఉండే ఉంటుంది.
బెంగాలీలో మహాశయుడిని ఇలా పిలుస్తారు.
మహాశయ్...మొషాయ్ గా రూపాంతరం చెందింది.
పంచె,కళ్లిలాల్చీలతో,నోట్లో కలకత్తా పాన్ నవుల్తున్న దేవదాస్ బ్రాండ్ బెంగాలీ బాబూలు బెంగాల్ లో కనపడతారు.
మా ఆఫీసులో కూడా ఇలాంటి బాబూలు చాలా మంది ఉన్నారు.
వాళ్ల పనిపాట్లు ఎలా ఉంటాయో మీకోసారి పరిచయం చెయ్యడమే నా ఉద్దేశం.
అక్కడ చాలామంది చుట్టుపక్కల గ్రామాల వారే.
కలకత్తా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలనుండీ అక్కడ ఉన్న రైల్వే ఆఫీసుల్లో ,వర్క్ షాప్ లో పనికి లోకల్ ట్రెయిన్ లో రోజూ ఉదయం రావడం,సాయంత్రం ఇంటికి వెళ్లడం చేసేవారు.
ఇటు ఒరిస్సా బాలాసోర్..అటు టాటా సెక్షన్ ల నుండి కూడా అప్ అండ్ డౌన్ చేసే ఉద్యోగులు అసంఖ్యాకంగా ఉంటారు.
ఇప్పుడు పరిస్థితులు కొంత మారేయేమో గానీ అప్పట్లో ప్రభుత్వ.. అదీ కేంద్రప్రభుత్వం లో రైల్వే ఉద్యోగం ఎలా ఉండేదంటే..'వేస్తే వేపకొమ్మ..తీస్తే అసిరమ్మ' లా ఉండేది.
నెలజీతం,డిఎ,బోనస్ కి ఢోకాలేదు.
పనిచేసినా చెయ్యకపోయినా రోజూ మొహం చూపిస్తే జీతం గేరంటీ.
అంచేత గుమాస్తా బాబూలంతా బేఖాతరుగా ఉండేవారు.
మా సెక్షన్ బాబూ బాలాసోర్ నుండి వచ్చేవాడు.గంట ప్రయాణం.
పొద్దున్న తొమ్మిది కి బండెక్కితే పదికి చేరతారు.
బండిదిగి దగ్గర్లో వున్న టీ షాపులో టీ తాగి,తోటి వారితో ముచ్చట్లాడుతూ తన సీటు చేరేసరికి పదిన్నర.
రాగానే బేగ్ పక్కనున్న బీరువాలో పెట్టి, కుర్చీ దుమ్ము దులిపి,టేబిల్ తుడిచి, ఒక కాలు మడిచి సుఖాసీనుడవుతాడు.
అప్పుడు పక్కసీటు వాడి పేపరు తీసుకుని ,కళ్లజోడు సరిచేసుకుని పఠనంలో మునిగిపోతాడు.
అప్పటికే సీటు దగ్గర పది గంటల నుంచీ పనికోసం వచ్చిన వాళ్లు నిలబడి అతగాడి కృపాకటాక్ష వీక్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
అ సంగతి తెలిసే వస్తున్నప్పుడు ట్రెయన్లో చదివిన పేపరులో చదవని వార్తలు వెతుక్కుంటూ ఓరగా వాళ్లనో సారి చూస్తాడు.
అదే భాగ్యం లా వాళ్లు తమ సొద మొదలెట్టేలోగా-
"ఏదీ ఓ సిగరెట్ పాకెట్,జర్దాపాన్ పట్టుకురా"
అంటాడు పేపర్ పక్కన పడేసి.
అప్పటికి పదకొండుంపావు.
వచ్చినవాడు పాతకాపైతే తన జేబులోంచి శ్వేతకాష్టం,జర్దాయుక్త తాంబూలం సమర్పించుకుంటాడు.
అప్పుడు రెండిటిని సేవించిన
బాబు మొషాయ్ అతగాడి పని చూస్తాడు.
అదయ్యేసరికి టీ బ్రేకు.
మధ్యలో రాజకీయ వాగ్యుద్ధాలు...
బెంగాల్ లో రాజకీయాల చర్చ జోరుగా ఉంటుంది.
ఒళ్లూపై తెలీకుండా రాజకీయ వాదనలు జరుగుతాయి. కొత్తవాళ్లు చూస్తే కొట్టేసుకుంటారని భయమే స్తుంది.
అదయ్యాక లంచ్.
తెచ్చుకున్నదేదో తినడం త్వరగా అయినా కబుర్లతో గంట దాటుతుంది.
కాస్సేపు బయట తిరిగి మళ్లీ సీట్లో కూలబడేసరికి మూడు దగ్గరవుతుంది.
మహా అయితే గంటన్నర పనిచేసి మళ్లీ మధ్యాహ్నపు టీ తాగి పనిలో పడేసరికి ఐదవుతుంది.
అరగంట గడిచేసరికి ఇంటికెళ్లే తొందర..
బేగ్ సర్దడం..హడావుడి గా బండి కోసం పరుగు..
అందరూ ఇలా ఉంటారని కాదు గాని అధిక శాతమింతే!
Comments
Post a Comment