కేశ క్లేశాలు
*************
ఉన్న పుంజీడు వెంట్రుకలు మహ ఇబ్బంది పెట్టేస్తున్నాయి.
మధ్యలో ద్వీపకల్పం లా మైదానం చుట్టూ ఆఫ్రికా అడవుల మాదిరిగా ప్రహారీ లా పలితకేశాలు.
నేనసలే రంగువెయ్యను.
మా బామ్మర్ది రంగేసి రెడ్ ఇండియన్ లా తయారయ్యాడు.
అదీ నా భయం.
పోతే పూర్వపు ఘన చరిత్ర కలిగిన రోజుల్లో ముప్ఫైరూపాయలు ఇచ్చి నెలనెలా కటింగ్ చేయించుకునేవాణ్ణి.గడ్డం ఇంట్లోనే లెండి.
అదీ మా నాన్న గారు రెగ్యులర్ గా చేయించుకునే సెలూనే!
చాలా సాదాగా ఉండేది దుకాణం.
పోతే తెగ మాట్లాడేవాడు .
తన కుటుంబ విషయాలు దగ్గరి నుంచి రాష్ట్ర రాజకీయాలదాక తెగ మాటాడేవాడు.
మనం ఏమంటే ఏమొస్తుందోనని అన్నిటికీ- "ఠీక్ బొలెచేన్(సరిగ్గా చెప్పావు)" అని వంతపాడే వాణ్ణి.
అప్పుడు నా జుత్తు ఆడవాళ్లు ఈర్ష్య పడేలా ఉండేది.
గ్రోమోర్ వేసి పెంచిన పంటలా అడ్డదిడ్డంగా పెరిగిపోయేది.
కాలక్రమాన చంద్ర కళలు తగ్గినట్టు క్షీణించిపోయింది.
బెంగాలీ సెలూన్ వాడు కూడా యధాశక్తి సానునయవాక్యాలు పలికే వాడు గానీ డబ్బులు మాత్రం అంతే తీసుకునేవాడు.
సరే గతజల సేతు బంధనం ఆపేస్తే-
ప్రస్తుతం ద్వీపకల్పానికి కాపలాగా ఉన్న పుంజీడు వెంట్రుకల్ని సరిగ్గా అమర్చమని భాగ్యనగర క్షురకశాలకు బయల్దేరాను.
ఓ మోస్తరుగా ఉన్న సెలూన్ ఎంచుకుని అడుగు పెట్టాను.
పైన టీవీలో రాజకీయ చర్చలు ఘాటుగా సాగుతున్నాయి. ఇద్దరు బూచాళ్ల వంటి వ్యక్తులు గడ్డాలు నిమురుకుంటూ కూర్చున్నారు.
మరో ఇద్దరు ఆల్రెడీ సింహాసనాధీశులై బుర్ర అప్పజెప్పి ఉన్నారు.
ఇద్దరు కేశకళా నిపుణులు ఇద్దరికీ సీరియస్ గా ఎటెండవుతునే నాకు స్మైల్ ఇచ్చి కూర్చోమన్నట్టు సైగ చేసారు.
నేను బూచాళ్ల పక్కన మరో ప్లాస్టిక్ కుర్చీలో కూలబడ్డాను.
ఎదురుగా టీపాయ్ మీద పేపర్లు ఉన్నాయి.
ఊసుపోక ఒక పేపర్ తిరగేసాను. ఎప్పటిలా రైతులకష్టాలు,ఆడవారి మానభంగాలు,రాజకీయ రచ్చలు,అసెంబ్లీ పోరాటాలతో ,ప్రకటనలతో,అచ్చుతప్పులతో నిండివుంది.
కుర్చీలు ఖాళీ అవగానే-
"అంకుల్ మీది కటింగా"
అన్నాడు సెలున్ ఓనరుడు.
బుర్ర ఊపాను.
ఇంట్లో ముందే గడ్డం చేసుకున్నాను.
బూచాళ్ల వేపు తిరిగి- " ఫైవ్ మినిట్స్" అన్నాడు.
వాళ్లు సెల్ లో దూరిపోయి తుప్పల్లాంటి తలలు ఊపారు.
"రండిసార్" అంటు నన్నాహ్వానించాడు.
'అయిదు కూడా ఎక్కువేన్రా నాయనా' అనుకుంటూ లేచాను నాకు లభించిన బంపరాఫరు సద్వినియోగం చేసుకోడానికి.
కుర్చీ లో కూర్చుని ప్రహారీని సరిచెయ్యమని వేలితో చూపించాను.
కాలర్రివర్సులో మడిచి,కొత్తగుడ్డని విప్పి మెడచుట్టూ జాగ్రత్తగా దోపి పని మొదలెట్టాడు.
సరిగ్గా అయిదు నిముషాల్లో కత్తెరతో ఛక్ ఛక్ మనిపించి, రేజర్లో కొత్త బ్లేడ్ యిరికించి చుట్టూ షేప్ చేసి -
"చూడండి సార్" అన్నాడు.
వెనక్కి తడుముకుని ఎదర అద్దంలో చూసుకుని లేచి,
వంద నోటు అందించి బయట పడ్డాను.
అమ్మయ్య! మరో మూడు నెల్ల దాకా పరవాలేదు.
Comments
Post a Comment