టెకువా
*******
ఇదేమిటనుకుంటున్నారా!
ఎక్కువ అలోచించి బుర్రపాడు చేసుకోకండి.
ఇదో బీహారీ తీపి వ్యంజనం.
ఖర్గపూర్ లో బీహారీలు కూడా చాలాఎక్కువే.
దీపావళి తర్వాత వచ్చే ఛట్ పూజ (సూర్యుని పూజ)
షష్టి నాడు చేస్తారు.
మొత్తం కుటుంబమమతా పిల్లలతో సహా దగ్గరగా ఉన్న చెరువుకు అట్టహాసంగా బాజాభజంత్రిలతో వెళ్లి టపాసులు కాల్చి,దీపాలు పెట్టి వైభవంగా జరుపుతారు.
అప్పుడు చేసే ముఖ్య నైవేద్యం..ఈ టెకువా!
ఈ పూజ తర్వాత మా బీహారీ సహోద్యోగులు ఆఫీసు కి తెచ్చి మరీ టెకువాలు అందరికీ పంచుతారు.
నరక చతుర్దశి నాడు మూకుడు పెట్టాలంటే మా ఆవిడకి నేనూ మా అమ్మాయి
టెకువాలు చెయ్యమని ముక్తకంఠం తో సలహా ఇచ్చాం.
గోధుమ పిండి లో కొద్దిగా బొంబాయి రవ్వ కలిపి,కొబ్బరి తురుము,సోంపు,ఏలకుల పొడి,నెయ్యి చేర్చి పొడిగా పిండి బాగా కలపాలి.
తర్వాత బెల్లం లేదా పంచదార కొలత ప్రకారం నీటిలో కరిగాక కొద్దికొద్దిగా వేస్తూ గట్టిగా పూరీల పిండిలా కలపాలి.
ఆ తర్వాత పూరీ ఉండల్లాటి వాటిని బిస్కట్ మాదిరిగా చేతితో నొక్కి,డిజైన్ అచ్చుతో వాటిని అలంకరించి న తర్వాత జలజలా నూనెలో వేచడమే!
తక్కువ తీపితో రుచిగా ఉంటాయి.
యూ ట్యూబ్ లో వీటి రెసిపి చూడవచ్చు.
వెరైటీ గా బావుంటాయి.
Comments
Post a Comment