"ఎవర్నువ్వు? ఒంటరిగా అలా ఈ నిర్జనప్రదేశం లో కూర్చున్నావేం?"
అడిగాడతను.
మేలి ముసుగు సవరించు కుంటూ అతడి వేపు తలెత్తి చూసిందామె.
చాలా అందంగా ఉంది.
"నువ్వెవరు"..అడిగింది ..అమె గొంతు చాలా మార్ధవంగా ఉంది.
"ప్రశ్నకు ప్రశ్నే జవాబా !"అని
చిన్నగా నవ్వుతూ-"నేను శబ్ద బ్రహ్మను.త్యాగయ్య,అన్నమయ్యల కీర్తనలతో మొదలైన నాప్రాభవం నేటివరకూ కొనసాగుతోంది.మధ్యలో కుంటుపడినా కళాతపస్వులైన కొందరి కృషి ఫలితంగా మళ్లీ వెలుగులోకి వచ్చాను." అన్నాడా సంగీతనిధి.
తల ఊపుతూ ఆమె తన మధుర కంఠంతో -
నేను అక్షర సరస్వతి ని.
ఎందరో అక్షరశిల్పులు నన్ను తమ పదార్చనలతో చెక్కి నాకు సోయగాన్ని కల్పించారు.
కాళిదాసాది మహాకవులు మొదలుకొని నేటి లబ్ధప్రతిష్టుల వరకూ అందరూ తమతమ వాగ్విభవానుసారం నన్ను ఆరాధించారు.
అయితే ఇటీవలి కాలంలో నా స్వరూపం పూర్తిగా మారిపోయింది.నన్ను నేనే పోల్చుకో లేకుండా ఉన్నాను.
ఈ దురవస్థ ఎంతకాలముంటుందో మరి!
ప్రశాంతత కోసం ఈ నిర్జన ప్రదేశంలో కూర్చుని చింతిస్తున్నాను.
లోపం ఎక్కడుందో వెతుకుతున్నాను."
అందామె నిర్వికారంగా.
ఆమె వంక జాలిగా చూస్తూ-
"నా పరిస్థితి కూడా అలాగే ఉంది.మునుపటి ప్రాభవం రాకపోయినా కనీసం నాలుగు కాలాలపాటు ప్రజల నోళ్లలో నిలవాలంటే ఏమి చెయ్యాలో తెలియక తిరుగుతూ ఇక్కడికొచ్చాను.
నీ మాటలు విన్నాక మనిద్దరి సమస్య ఒకటే అని తెలుసుకున్నాను.
భయపడకు.
మార్పు సహజం.
కాలంతో పాటు మనం మారాలి.
మార్చుకుంటూ ఉండాలి.
ఏమో..ఎవరికి తెలుసు.మళ్లీ పాతరోజులు రావచ్చు.
రాకనూ పోవచ్చు.
ప్రజల ఇష్టమే మనిష్టంగా మనలని మనం మార్చుకుంటూ జనంతో పాటు సాగుదాం!
మార్పుని అహ్వానిద్దాం!పద!"
అంటూ ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని ముందుకి నడిచాడు శబ్దబ్రహ్మ.
ఉదయభానుడి అరుణ కిరణాలు వాళ్లని ఆశీర్వదిస్తుండగా ఆత్మవిశ్వాసంతో బంగారు భవిత దిశగా అడుగులు వేసారా జంట.
Comments
Post a Comment