అచ్చుపుస్తకం

అచ్చు పుస్తకం
***********"
కపిగాడొచ్చాడంటే నాకు భయం.
వాడు తుపాను లా చెప్పాపెట్టకుండా వస్తాడు.
అలాగే అల్లకల్లోలం సృష్టించి పోతాడు.
కపి పూర్తి పేరు కనక వఝల పినాకి..ముద్దుగా కపి అంటారందరూ.
వాడి చేష్టలకి సరిపోయే పేరది.
మాకు వాడికీ ఏదో బీరకాయపీచు చుట్టరికం ఉంది గాని నాకర్ధం కాదు వరసకి వాడేమౌతాడో!
వాడే మా ఆవిణ్ణి 'చెల్లెమ్మా' అని పిలిచి నన్ను బావని చేసేసాడు.
ఉట్టి కబుర్లపోగు.చాలా రకాల పన్లు చేసాడు.దేంట్లోనూ స్థిరత్వం లేదు.రకరకాలబిజినెస్సులు కూడా చేసాడు.
వాడిని వాడింటి వాళ్లు అచ్చోసి వదిలేసారు.ఇక్కడాఅక్కడా చేరి ఏవో కబుర్లు చెప్పి రోజులు వెళ్లదీస్తుంటాడు.
రేపటి చింత లేదు.నేటి భయం లేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే బ్రతకనేర్చిన వాడు.
జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్..
చెయ్యనిదిలేదు హత్య తప్ప.
ఏంచేస్తున్నావిప్పుడు అంటే ఏదో భేతాళ కథ చెప్తాడు గాని అసలు సంగతి చెప్పడు.
' చెల్లమ్మా 'అంటూ మా ఆవిణ్ణి బాగానే మేనేజ్ చేసాడు.
నాకేనా రెండోసారి కాఫీ ఇవ్వాలంటే విసుక్కుంటుందేమో గానీ వాడికి రాచమర్యాదలు చేస్తుంది.
వాడి రాకపోకల్లో క్షవరం నాకే.
"అవును గానీ బావా! ఇన్ని రాస్తుంటావు కదా అచ్చు వేయించవచ్చుకదా..రేపు మన వాళ్ళందరూ నీ పేరు చెప్పుకుంటారు" అన్నాడు
"సర్రా"అనుకున్నాను.
నాకథలు,పద్యాలు వాక్చిత్రాలు వాడెన్ని చదివాడో నాకు తెలీదు గానీ వచ్చినప్పుడల్లా కథా సంపుటి వేయించమని గోల చేస్తుంటాడు.నేనప్పటికేదో చెప్పి మాట మారుస్తుంటాను.
ఈ సారి బృహత్ప్రయత్నంలోనే ఉన్నట్టున్నాడు.
శ్రీకృష్ణుడి మాట వినని దుర్యోధనుడ్లా దాడి ప్రారంభించాడు.
నీకేం తక్కువ అన్నాడు.
పిల్లలు స్థిరపడ్డారు గదా అన్నాడు.
పెన్షన్ వస్తోంది ఇంకేం తెగులా అని ధ్వనింపజేసాడు.
అన్నిటికీ శిశుపాలుడి ధూషణలు వింటూ చిరునవ్వులొలకబోసిన శ్రీ కృష్ణుడ్లా చూసాను.
మా ఆవిడ కూడాఈ విషయం లో నా పార్టీ అని తెలియక "చూడు చెల్లెమ్మా" అంటూ గెరిల్లా దాడి అట్నుంచీ ప్రారంభించేడు.
మా ఆవిడ ఏమనలేక -
"ఇప్పుడే వస్తాను.ఉండన్నయ్యా.పక్కింటావిడ ఎందుకో పిలుస్తుంది "అని మెల్లిగా తప్పుకుంది.

ఇదే సమయమనుకుని నా ఉద్దేశం వివరించి చెప్దామనుకున్నాను.
ఈలోగా మాకపి వాయింపు మొదలైంది.
"చూడు బావా నా ఫ్రెడ్ ఒకడు బుక్ పబ్లిషర్.వాడు మనం ఎంత చెప్తే అంత.నీకోసం రిబేటు బాగా ఇప్పిస్తాను.నలభై జాగాలో ముప్పై కే ఒప్పుకుంటాడు.గోల్డెనాఫర్..మరింకేమీ ఆలోచించకు.నీ రాతలన్నీ అడ్వాన్స్..పదివేలు తో పాటు నాకియ్యి.. చాల్లే...మిగతాది పుస్తకాలు ప్రింటయ్యాక ఇవ్వొచ్చు.
నేను దగ్గరుండి ముక్కు పిండి  మరీ పని చేయిస్తాను.
ఏమంటావ్.."

నేను సర్దుకుని కూర్చుని ఉపోద్ఘాతం గా- " మాట వింటావా ?" అన్నాను.
చెప్పు అన్నాడు కేజువల్ గా సోఫాలో కూర్చుని కాళ్లూపుతూ.
" నా తర్వాత మా ఇంట్లో తెలుగు చదివేవారెవరు...వాళ్ళలో కథలు ,పద్యాల మీద ఆసక్తి ఉన్న వారెవ్వరు..
మావాడికి తెలుగు మాట్లాడటం తప్ప రాయడం చదవడం రాదు.
బెంగాల్ లో చదవడం వల్ల .ఇహ అమ్మాయి సంగతి అంతే.
ఇహ మనవల సంగతి చెప్పేదేముంది.
పీస్పాస్ అంటూ ఇంగ్లీషు తప్ప మరోటి తెలీదు.
ఎవరికోసం ఈ పుస్తకాలు అచ్చొత్తించాలి.
మరో విషయం. ప్రింట్ మీడియా మూలబడి అంతర్జాలం విహరిస్తున్న రోజులివి.
ఒకటీ అరా పత్రికలు తప్ప 
ప్రింట్ మీడియా కనపడదు.
ఇహ ఆ మూడువందల పుస్తకాలు అచ్చయి నా కళ్లముందు భూతాల్లా మమ్మల్నేం చెయ్యమంటావని నిలదీసి అడుగుతాయి.
వాటిని అమ్మే మార్కెటింగ్ చాకచాక్యం నాకులేదు.

బాంకులో అవసరాలకు దాచుకున్న దాంట్లోంచి ముఫ్పై వేలు నాకోసం ఇలా వ్యర్ధంగా ఖర్చుపెట్టడం నాకు సబవనిపించటం లేదు.
మరో ప్రమాదం మీ అక్క.
దొంతరలుగా కట్టలు కట్టి అమ్ముడు కాని పుస్తకాలు అటక మీద దుమ్మూ,ధూళీ పడుతూ 'మాసంగతేంట'ని
పెళ్లీడుకెదిగిన ఆడపిల్లల్లా ప్రశ్నిస్తుంటాయి.
ఇహ మీ అక్క వాటిని సర్దలేక పారీలేక అవకాశమొచ్చినప్పుడల్లా నన్ను దులుపుతూ ఉంటుంది.

నేను బబ్రాజమానం గాడ్లా మొహం పెట్టి ఆవిడ కపాకటాక్షవీక్షణాల కోసం పరితపిస్తూ ఉండాలి.
అదియునుగాక-
ఇవేమంత సాహిత్య అకాడమీ అవార్డుల కోసం పంపాలి.
మనవాళ్లకి,పై వాళ్లకి ఊరికే పంచిపెట్టాలి తప్ప ఒఖడూ కొనడు.మొహమాటానికి కొన్నా చదివిన పాపాన పోడు.
ఫ్రీగా వస్తే మాత్రం తీసుకుంటారు.పూర్వం అక్షరలక్షలు కవులకిచ్చేవారట.
ఇప్పుడు లక్షలమాట దేవుడెరుగు..కనీసం వందరూపాయల పుస్తకం కూడా కొనాలంటే నసుగుతారు.
మరేల యీ శుష్క వ్యయప్రయాస!"
నా మాటలు పూర్తవకుండానే కపి గాడర్జెంటుగా లేచి- 
బావోయ్..మళ్లొస్తా..అర్జంటు పని గుర్తొచ్చింది."
అంటూ అదేపోత.
"హమ్మయ్య "అనుకున్నాను.

అధో జ్ఞాపిక
********
ఇలా అన్నానని పుస్తకాలు అచ్చువేయించుకున్న,కుంటున్న వాళ్లు తెలివితక్కువ వారని నా అభిప్రాయం కాదు.
ఎవరి అభిరుచి,స్థోమత వారిది.
ఎవరినీ తప్పు పట్టటం లేదని గమనించగలరు...
జస్ట్ రచయిత మిత్రుల బాధలు చెప్పానంతే!

Comments