దరహాస జీవి

దరహాసజీవి
***********
బలరాం ది నవ్వు మొహం.
అతికించి నట్టు కాకుండా సహజంగా పువ్వులా నవ్వే మొహం.
బ్రహ్మ చాలా ఉల్లాసంగా, నవ్వుతూ సృష్టించి ఉంటాడు బహుశా.
ఒకసారి ఇంటర్వ్యూలో అతని మొహం చూసిన అధికారులు ఆశ్చర్యపోయి- 
"నీకు టెన్షన్ గా లేదా ! నవ్వుతున్నావే!"
అన్నారు కాస్త ఉడుక్కుని.
"నా మొహమే అంతండి"
అన్నాడు మరేమన్లేక.
స్కూల్లో, కాలేజీలో కూడా నవ్వుతో ఇబ్బందులు పడ్డాడు.
ఇంట్లో పెద్దవాళ్లు జారి పడినప్పుడు.
స్కూల్లో హెడ్మాస్టర్ కుర్చీ తన్నుకుని పడిపోయినప్పుడు,
మావయ్య సైకిల్ మీద నుంచి బేలన్స్ తప్పి క్రింద పడినప్పుడు.
నవ్వకపోయినా చీవాట్లు,తన్నులు తినవలసి వచ్చింది.
పార్కులో అమ్మాయిల వంక సూటిగా చూడటమే మానుకున్నాడు.


రామ పట్టాభిషేకం సమయం లో లక్ష్మణుడి అకారణ నవ్వులా చాలా వివాదాలకు లోనయ్యాడు బలరాం.
అప్పటికీ విషాద సమయాల్లో  హాజరవకుండా వీలైనంత జాగ్రత్తలు పడ్డాడు.
నవ్వు వల్ల నలభైయో,డెబ్భై వేల కండరాలో ఉత్తేజితమవుతాయని,మనిషిని ఆరోగ్యం గా ఉంచేందుకు నవ్వు ముఖ్యపాత్ర వహిస్తుందని తెలిసి సరదా పడ్డాడు.లాఫింగ్ క్లబ్బుల్లో చేరి కృత్రిమంగా నవ్వేవారిని చూసి జాలి పడ్డాడు.
తననిలా పుట్టించిన దేవదేవుని కి కృతజ్ఞతలు చెప్పాలో,విసుక్కోవాలో అర్ధం కాలేదతనికి.
పెళ్లిలో కూడా చాలా నష్టపోయాడు తను.
తన చిరునవ్వు ముఖం ఆమోదంగా గ్రహించి ఎదుటివారు తమకనుకూలంగా నిర్ణయాలు తీసుకునే వారు.
తద్వారా చాలా నష్టాల జరిగాయి.
ఆఫీసులో కూడా అందరూ తన నవ్వుని ఎడ్వాంటేజిగా తీసుకుని వాళ్ల పనులు అంటగట్టేవారు.
మొహమాటం తో కాదనలేక లోపల ఏడ్చుకుంటూ చేసేవాడు.
ఆరయింది.
ఆఫీసునుంచి బయల్దేరి రోడ్డు మీదకు వచ్చాడు.

అప్పటికే అతనితోటి వాళ్లందరూ బజార్లకి,పార్టీలకి,క్లబ్బులకీ,ఇళ్లకీ వెళిపోయారు.
బలరాం చివర్నలేచి దుకాణం కట్టగానే స్టూల్ మీద కూర్చున్న ప్యూన్ 'హమ్మయ్య' అనుకుంటూ ఆఫీసుకి తాళాలు వేసి గబగబ ఇంటిదారి పట్టేడు బలరాం ని తిట్టుకుంటూ.
రోడ్డుమీద నడుస్తున్న బలరాం కి అన్నీ తెలుసు.
తన అశక్తత తెలుసు.
తననిలా పుట్టించిన దేవుడి మీద కోపం అవధులు దాటింది.
చుట్టూ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది.
ఎవడి తొందర వాడిది.
అప్పుడు జరిగిందది.
నింపాదిగా నడుస్తున్న బలరాం ని వెనకనుండి వస్తున్న కారు గుద్దింది.
బలరాం ఎవరో బలంగా తోసినట్టు ముందుకి పడిపోయాడు.
తర్వాత ఏం జరిగిందో తెలియదు.
నెలరోజులయ్యాక-
హాస్పిటల్ బెడ్ మీద కూర్చుని ఉన్నాడు బలరాం.
అతని చుట్టూ బంధువులు, ఆఫీసు సహోద్యోగులు ఉన్నారు.
అందరూ అతని వంక ఆశ్చర్యం గా చూస్తున్నారు.
అక్సిడెంట్లో ముందుకి పడటం వల్ల అతని పళ్లు విరిగి,పెదిమలలో గుచ్చుకున్నాయి.
డెంటల్, ఫేసియల్ సర్జరీ తరువాత అతని మొహం మారిపోయింది.
నర్సు తెచ్చిన అద్దంలో తన ముఖం చూసుకున్న బలరాం కి హాయిగా నవ్వాలనిపించింది.
ఎదురుగా అతని ప్రతిబింబం వికృతంగా ఏడుస్తూ కనిపించింది.
****

Comments