కాబూలీ
********
ఆరడుగుల పైన ఉండే రూపం..
వదులుగా గాలికి రెపరెపలాడే కుర్తా..పెళ్లికూతుర్లా అలంకరింపబడ్డ
ఏనుగులాంటి రాయల్ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్.. మెహెందీ రాసుకున్నట్టు ఎర్రబడిన గెడ్డం..చివర విలాసంగా వేలాడుతున్న తలపాగా...
వెరశి ఇదొక కాబూలివాలా రూపం.
తమ దేశాన్ని,భార్యాబిడ్డల్ని వదలి మన దేశంలో వడ్డీవ్యాపారం చెయ్యడానికి వచ్చిన వీళ్లంతా ఒకే చోట ఒకే సముదాయం లా ఉంటారు.
ఎవరి గిరాకి వారిదే.
గమ్మత్తైన యాస లో హిందీ మాట్లాడతారు.
మర్యాదస్తులు వీళ్ల దగ్గర అప్పు తీసుకోడానికి భయపడతారు.
జీతాల రోజు యములాళ్ల మాదిరి ఆఫీసు ,ఇళ్ల దగ్గర కాపు వేసి,వడ్డీ వసూలు చేయడం లో సిద్ధహస్తులు.
పంధొమ్మిది వందల అరవైఐదు ప్రాంతం...
ఒకసారి మా నాన్న గారి చెయ్యి పట్టుకుని బజారు కి వెళుతున్నాను.నాకప్పుడు పదేళ్లుంటాయి.
ఆఫీసుకి కాక ఎక్కడికి వెళ్లినా చేతిలో సంచిలా నేనూ తయారయ్యేవాడిని.
ఆయనకు సైకిల్ తొక్కడం రాదు.
ఎక్కడికి వెళ్లినా నడకే.
ఒక చేతిలో కూరలసంచి,మరొక చేతితో నన్ను పట్టుకుని నడిచేవారు.
నా యక్ష ప్రశ్నలకి సమాధానాలు చెపుతూ నడక సాగించేవారు.
అవాళ కూడ అలాగే బయల్దేరేం.
దార్లో ఒక ఆఫీసు దగ్గర జీతాల పంపకం జరుగుతోంది.
అక్కడ చిన్న మేళా లా ఉంది.
తినుబండారాలు అమ్మేవాళ్లు,పిల్లల బట్టలు,స్వెట్టర్లు అమ్మేవాళ్ల కేకలు వినపడుతున్నాయి.
ఆఫీసు గేట్ దగ్గర ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు రక్షణగా నిల్చున్నారు.
ఒక మర్రి చెట్టు నీడలో ఒక కాబూలీ తన రాయల్ ఎన్ ఫీల్డ్ మీటారు సైకిల్ మీద యముడు దున్నపోతు వాహనం ఎక్కి కూర్చునట్టు కూర్చున్నాడు.
అతడి బండి తళతళ మెరుస్తోంది.
దాని హేండిల్ కున్న రంగురంగు కుచ్చులు ఆకర్షణీయంగా కనపడ్డాయి.
రెండువేపులా ఉన్న అద్దాల్లో మొహం, సరి చూసుకుంటూ ఎర్రని గడ్డం,మీసాలు దువ్వుకుంటున్నాడు.
నేనక్కడికి రాగానే నడవడం ఆపి ఆరాధనగా చూడటం గమనించి,చిన్నగా నవ్వుతూ-
"క్యా బబువా! బైఠేంగే క్యా?"
అంటూ చేతులు సాచాడు.
మానాన్నాగారు త్రుళ్లిపడి గాబరాగా నన్ను దగ్గరకి లాక్కుని "పదపద" అన్నారు.
"నమస్తే రావ్ బాబు..బచ్చాకో దీజియే"
అంటూ గోడవును లాంటి షరాయి జేబులోంచి ఒక చాక్లెట్ తీసి ఇచ్చేడు.
చాపల్యంగా చేయి చాపిన నా చేతిలో ఆ చాక్లెట్ పడేసి,బుగ్గలు నిమిరాడు.
మా నాన్నగారు మాత్రం తొందరగా నా చేయి పట్టుకుని లాక్కుపోయారు.
ఆ తర్వాత ఎందుకలా చేసేరనడుగుతే-
వాళ్ల గురించి వివరంగా చెప్పి-
"వాళ్లతో మాట్లాడితే మనం కూడా వాళ్ల దగ్గర అప్పుతీసుకున్నామని నలుగురూ అనుకుంటారు.వాళ్లు సంసారాన్ని,పిల్లల్ని వదిలి ఇక్కడ వ్యాపారం కోసం ఉండిపోవడం వల్ల చిన్న పిల్లలంటే వాళ్లకి ముద్దు."
అన్నారు.
అప్పట్లో నాకంత అర్దం కాకపోయినా అప్పట్లో ఆ రూపం,మోటరు సైకిల్ అలంకరణ నన్ను చాలా ఆకట్టుకున్నాయి.
ఆ తర్వాత మరోసారి నేను అటకి వెళుతుండగా నాపక్కన పెద్ద చప్పుడుతో మోటారు సైకిల్ ఆగింది.
పక్కకు తలెత్తి చూసాను.
మీసాలు దువ్వుతూ,నవ్వుతున్న చాక్లెట్టిచ్చిన పఠాను.
నేను బదులుగా నవ్వేను.
"బైఠో".అని తనేరెండు చేతుల్తో నన్నెత్తి టాంకు ముందు కూర్చోబెట్టుకున్నాడు.
నాకు సింహాసనం మీద కూర్చున్నట్టు అనిపించింది.
పెద్ద చప్పుడుతో బండి బయల్దేరింది.
ఏవేవో సందులు తిరిగి ఒక పెద్ద సత్రం లా ఉన్న భవనం ముందు ఆగింది.
అక్కడి వాతావరణం పాకిస్తాన్ ని తలపిస్తుంది.
ఎక్కడపడితే అక్కడ పరదాలు వేలాడగట్టిన ఇళ్లు,దిసమొలలతో ఆడుకుంటున్న పిల్లలు దుర్గంధం...కాలువలు..
మాంసం అమ్మే దుకాణాలు..వాటిఎదురుగా రాటకు కట్టిన మేకలు,గొర్రెలు.. వాటి కంపు...
బురఖాల్లో హడావుడిగా తిరుగుతూ అరుస్తున్న ఆడవాళ్లు..కల్లు దుకాణాలు...
నన్ను జాగ్రత్తగా దింపి సత్రం లో ఒక గదికి తీసుకుని వెళ్లాడు .
గదిలో సామాను తక్కువే.
ఒక చాప..పక్క బట్డలు..నీళ్లకుండ..కొయ్యకు బట్టలు.ఒకపెద్ద కర్రపెట్టె.
నన్ను చాప మీద కూర్చోబెట్టి తను బయటకు పోయి ఒక పెద్ద పొట్లంతో తిరిగివచ్చాడు.
నా ముందు పొట్లం విప్పాడు.
అందులో మూడు సమోసాలు,వేడివేడి జిలేబీలు ఉన్నాయి.
నా వేపు నవ్వుతూ చూసి తినమని సంజ్ఞ చెసాడు.
బాల్య చాపల్యం కొద్దీ తిన్నాననుకోండి.
తరవాత ఎవరెవరో పఠాన్లు రావడం...నన్ను ముద్దుపెట్టుకుని బుగ్గలు నిమరడం జరిగింది.
అరగమట గడిచాక ఇంటి ధ్యాస పట్టుకుని బిక్క మొహం పెట్టగానే గ్రహించిన పఠాను
నన్ను ఇంటికి తీసుకు వచ్చి దిగపెట్టాడు.
అయితే ఇల్లు కాస్త దూరంలో ఉండగానే దింపేసి తనదారిన వెళ్లిపోయాడు.
నేను అలవాటైన రోడ్డు మీద పరిగెట్టి మా ఇంటికి చేరాను.
అప్పటికే నాకోసం వెదుకుతున్న మావాళ్లు నా ద్వారా జరిగింది తెలుసు కుని నన్ను చింతపండుతో తోమటం వేరే విషయం.
*****
"
Comments
Post a Comment