ప్రార్థన

ఎక్కడ మానవ మస్తిష్కం దెయ్యాల నిలయమవుతుందో
ఎక్కడ అరాచకత్వం వెర్రితలలు వేస్తూ నాట్యమాడుతుందో

ఎక్కడ నిత్యావసర వస్తువుల ధరలను అంబర చుంబితమవుతాయో
ఎక్కడ జాత్యహంకారాలు కరాళ నృత్యమాడతాయో

ఎక్కడ దురంతాలకు వ్యతిరేకంగా పెదవులు శబ్దం చెయ్యవో
ఎక్కడి రంగస్థలం నిశ్శబ్ద వేదికగా మారుతుందో

ఎక్కడ అభిలాషలు ఆశయాలు పదవికోసం పాకులాడతాయో
ఎక్కడ నీతి నియమాలు  అధఃపాతాళానికి దిగజారతాయో

ఎక్కడ కలుషితవాతావరణం స్వచ్ఛతకు చోటులేకుండా చేస్తుందో

అటువంటి వైతరణి పాపకూపాల హింసల నుండి
ఓ దేవా!
నా తండ్రీ!
నా దేశాన్ని ఆనందమయ స్వర్గసీమ గా మార్చు ప్రభూ!

Comments