నిత్యానపాయని

నిత్యానపాయని
**************

ముంబయి మహానగరం!
లోకల్ లో ఆ జంటని అనుకోకుండా చూసాడు తను.
వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకోలేదు ముందు.
అతను విడిగా పక్కనే నిలబడితే పక్కన సీటులో కూర్చొని స్వెట్టర్ అల్లుతూ కనపడుతుంది ఆమె.
ఇద్దరూ మాట్లాడుకోవడం కూడా ఎప్పుడూ చూడలేదు.
వాళ్లని అనుకోకుండా గమనించటం అలవాటు గా మారింది.
ఏ రోజైనా వాళ్లు కనపడకపోతే అన్ని బోగీలు వెతికి మరీ వాళ్లున్న అదే బోగీలో ప్రయాణం చెయ్యడం కూడా ఒక వ్యసనమైంది.
ఒక్క రోజు కూడా వాళ్లని పలకరించలేదు.ఆర్నెల్లుగా ఇదే నాదినచర్య.
ఒకరోజు ఇద్దరూ కనపడలేదు.
పరిపరివిధాలుగా ఆలోచిస్తూ గడిపాను.
వారం రోజులు వాళ్లిద్దరూ కనపడక నాకు పిచ్చెత్తినట్టయింది.

అవాళ కూడా అన్యమనస్కంగా ప్లాట్ఫాం మీదకొచ్చాను.
జనాలు ఎప్పటిలాగే ఉరుకులు పరుకులు పెడుతున్నారు.
లోకల్ క్రిక్కిరిసి ఉంది.
నాకళ్లు మెరిసాయి.
ఒక బోగీలో నిలబడి కనపడ్డాడు అతను.నేను చకచక అటునడిచి అదే బోగి ఎక్కాను.
చిరునవ్వుతో అతడిని చూసి,చుట్టూ పరికించాను.
ఆమె కనపడలేదు.
"మీ మిసెస్ రాలేదా?"
అడిగాను.
నా వేపు దీనంగా చూసాడతను.
"ఆవిడ మరి నాతో రాదు" అన్నాడు గద్గద స్వరంతో.
తర్వాత మాటల ద్వారా తెలిసినదే మంటే కాన్సర్ వ్యాధి తో ఆమె చనిపోయిందని తెలిసింది.
ఆమె చనిపోతుందని తెలిసాక వియోగం భరించలేక అతడితోపాటే బయలుదేరి ఆఫీసుకి వచ్చేదట.
అక్కడ అతనితో పాటే ఉండి మళ్లీ ఇద్దరూ ఇంటికి వచ్చేవారట.
ఇదంతా చెప్తూ చివరిగా-
"ఆమె నన్ను భౌతికంగా విడిచివెళ్లినా నాతోనే ఉంది.నేను వేసుకున్న స్వెట్టరు ఆమె చివరగా అల్లినదే." ఆప్యాయంగా స్వెట్టర్ ని తడుముతూ చెప్పేడతను.
నా కళ్లు చెమ్మగిల్లాయి.

(హిందీ లో చదివిన ఒక పోస్ట్ ప్రేరణతో)

Comments