మాయ

'టప్ 'మని చప్పుడైంది.
నిద్రపట్టక ఆలోచనలతో దొర్లుతున్న మిడిల్ బెర్తు లో పడుకుని చూస్తున్న గిరి కి మెరుస్తూ కనిపించిందా గొలుసు.
గబాలున లేచి కిందికి దిగి చెప్పులకోసం వెదుకుతున్నట్లు నటించి ఆ గొలుసుని గుప్పిటలో బిగించాడు.
పై బెర్తు లో పడుకున్న పెద్దావిడదయి ఉంటుంది.
చుట్టూ చూసాడు.అందరూ నిద్రలో ఉన్నారు.
బరువుగా ఉంది.
ఐదారు తులాలు ఉండవచ్చు.
తన బాధలన్నీ తీరిపోతాయి.
దొంగతనం, పాపం అంటున్న అంతరాత్మ పీక‌నొక్కేసి,
మళ్లీ బెర్త్ ఎక్కి పడుకున్నాడు.
ఎందుకేనా మంచిదని మళ్లీ లేచి బేగులోంచి వెతికి ఒక మేజోడు తీసి అందులో గొలుసును పెట్టి అడుగున దాచాడు.
కాస్సేపటికి కలలు కంటూ నిద్రపోయాడు.

తెల్లారాక,తను దిగాల్సిన పలాస స్టేషన్ రాగానే గబగబ దిగిపోయాడు.
మనసులో సంతోషం ఉరకలు వేస్తోంది.ఐదు తులాలు..అరవై అనుకున్నా మూడు లక్షలు...తరుగు లాటివి తీసేసినా రెండున్నర కి తక్కువ కాదు.
పది గంటలకి చమన్ లాల్ జ్యుయలర్స్ దగ్గర కి వెళ్లాలి.రసీదడుగుతే పోయిందని చెప్పాలి.
****
పదయింది.
గిరి దుకాణం లో అడుగు పెట్టి
సేట్ దగ్గరకు వెళ్లి జేబులోంచి గొలుసు తీసాడు.
చేతిలో పెట్టిన గొలుసును పరీక్షగా చూసిన చమన్ లాల్ "-ఏం..వేళాకోళంగా ఉందా!
గిల్డు నగ తెచ్చి చేతిలో పెట్టావు?" అన్నాడు.

Comments