భయం

ఏటిఎం లో నిలబడ్డాను.
ఖాళీగా ఉంది.
వెనకెవరూ తొందర పెట్టే వారు లేరు.
ఇంతకీ డబ్బులొస్తున్నాయో లేదో?
కార్డ్ పెట్టాను స్లాట్లో.
డిసప్లే నిర్దేశానుసారం బటన్లు నొక్కు తున్నాను.
అప్పుడు గమనించాను.
నా వెనక ఎవరో దగ్గరగా నిలబడి నా వేలి వంక చూస్తున్నాడు.
చికాకు కలిగింది.
నాదయ్యాక రావచ్చు కదా!
పిన్ కొట్టే సమయమైంది.
అతగాడు ఆత్రంగా చూస్తున్నాడు.
నేను వీలైనంత గా కవర్ చేస్తూ పిన్ నొక్కాను.
లోపల బరబర చప్పుళ్లు మొదలయ్యాయి.
అమ్మయ్య ...పనవుతోంది..
కాసేపటికి  మనీ స్లాట్ అందించిన డబ్బులు తీసుకొని  జేబులో పెట్టుకుంటూ అతన్ని చూసాను.
మిడిగుడ్లూ,కోరమీసాలు ..ఎర్రటి పంచె, గళ్లబనీను తో కత్తులరత్తయ్య తమ్ముడ్లా ఉన్నాడు.
ఎమనాలన్నా భయం వేసింది.
బయటకు నడుస్తుండగా "సారూ" అని పిల్చాడు.
వెనక్కి తిరిగాను,జేబులో డబ్బు నదిమి పట్టుకుని.
"నాకు కొత్త సారూ! కాస్త పైసల్ తీసి పెట్టరాదె" అన్నాడు.
'హమ్మయ్య' అనుకుని  దర్జాగా అతగాడిచ్చిన కార్డు అందుకుని స్లాట్లో పెట్టాను.
ఎంత డబ్బు తీయాలో చెప్పాడు.
పిన్ అడిగితే అరచెయ్యి చూసుకుని నాకూ చూపించాడు.
డబ్బులు వచ్చాక అతగాడికి అందించి అక్కడి నుండి బయట పడ్డాను.
ఈ క్రైం పెట్రోల్ కథలు చూసి బాగా భయపడి పోయానన్నమాట!

Comments