#ఆదివారం- చిన్న కథ
చెల్లని నోటు
***********
ఎలా వచ్చిందో, ఎవరిచ్చారో నాదగ్గరో చెల్లని వందనోటు జేబులో ఉంది.
ఎవరిచ్చినా తీసుకోవటం లేదు.
ఎన్ని రకాలుగా మారుద్దామని ప్రయత్నం చేసినా ఆ నోటు మాత్రం వెనక్కి వచ్చేస్తోంది అత్తింటి నుంచి హడలిపోయి వచ్చిన కొత్తపెళ్లి కూతుర్లా!
"దేవుడి హుండీలో పడేయవయ్యా ..కళ్లకద్దుకునిమరీ తీసుకుంటాడు'"
అన్నాడు పక్కింటి జగన్నాధం. అతడు నాస్తికుడు లెండి.దేవుడంటే కోపం.మనిషి మాత్రం మంచివాడే.
బేంకులో పనిచేసే పక్కింటి ప్రసాదు పెళ్లయ్యాక హనీమూన్ వెళ్లాడు. అతగాడు వచ్చాక గానీ నోటుకి విముక్తి లేదు.
బేంకుకి వెళ్లాలంటే ఆటోకే వందవుతుంది.
రోజుకి ఒకసారి బజారులోకెళ్లి నోటు ని చెల్లగొట్టాలని విఫల ప్రయత్నం చేస్తున్నాను.
నోటు చేతికంటకుండా నగదు చెల్లింపులు మోడీ దయవల్ల మొదలైనా 'చిల్లర' వర్తకుల. ..అదే కూరగాయల దగ్గర అప్పుడప్పుడు దెబ్బ తినేయాల్సి వస్తోంది.
మా ఆవిడ యథాశక్తి వాగ్బాణాలు విసుర్తునే ఉంది.
సూదిమందు డాక్టర్లా, మంత్రసాని దెప్పులు రోజుకోసారైనా తప్పడం లేదు.
'స్పీచ్ ఈజ్ సిల్వర్ సైలెన్స్ ఈజ్ గోల్డ'న్నదొరగారి హితోక్తి ననుసరించి నోర్మూసుకున్నాను.
"అంత చూసుకోకపోతే ఎలా?
కూరలు పుచ్చువుంటే పారేస్తాం..."
తప్పు మనదే కాబట్టి మౌనం సర్వోత్తమం!
ఆ రోజాది వారం.
క్షవరం చేయించుకుని చెల్లగొడదామని ఆ నోటు ఒక్కటే జేబులో పెట్టుకుని , బయలుదేరాను. ఎప్పుడూ ఒకే సెలూన్కి వెళ్తాను.
ఆదివారం రష్ గానే ఉంది.
నాకో కన్సెషన్ కూడా ఉందక్కడ.
ఎక్కువ జనం ఉంటే నా తరపు అతగాడే కస్టమర్లకి సర్దిచెప్పి నా పని చేసేస్తాడు.
'సార్ కి కాస్త త్వరగా చేసేస్తాను కాస్త ఆగండ'ని సర్ది చెప్తాడు.
నా సహారా ఎడారి చుట్టూ ఉన్న పుంజీడు వెంట్రుకలు చూసి వాళ్లుకూడా ఏమనరు.
ఐదు నిముషాల్లో కత్తెర 'చిక్ చిక్ 'మనిపించి లేవగొట్టాడు కేశక్రమాలంకారుడు.
క్షవరం అయ్యాక నోటు అందించి వెనక్కి చూడకుండా పోబోతుండగా-
"సార్ !ఈ నోటు చెల్లదు.మరోటి ఇవ్వండి."
అన్నాడా 'బర్బరీకుడు.'
'చచ్చా'మనుకుని - మరో నోటు లేదోయ్.ఫోన్ కూడా తీసుకుని రాలేదు.గూగుల్ పే చేద్దామంటే." అన్నాను నీరసంగా.
"పర్లేదండి.తర్వాత ఇవ్వండి." అంటూ నోటు నా కందించి మరో బుర్ర వేపు తిరిగాడు.
చేసేది లేక ఇంటి కొచ్చి స్నానానికి బాత్రూం లో దురాను.
స్నానించి బయటకొచ్చాక మా ఆవిడ నా వంక చూసి -
"ఇన్నాళ్లు జేబులో పెట్టకు తిరిగారు.ఏం లాభం.ఇప్పుడే క్షణంలో మార్చాను మీ నోటు, చీరలావిడకి ఇన్స్టాల్మెంటు కట్టి" అని గర్వంగా చూసి తన సామ్రాజ్యం లోకి వెళ్లిపోయింది.
ఇంతకీ చెల్లనిదెవరు?
.నోటా? నేనా? అని ఓసారి భుజాలు తడుముకున్నాను.
****
ఇది నా స్వానుభవమని,యే మాధ్యమాల పరిశీలనలో లేదని హామీ ఇస్తున్నాను.
Comments
Post a Comment